అధికారంలోకి వచ్చిన రాజకీయ పక్షం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయకపోతే మీడియా నిలదీయాలి. ‘ఎన్నికల ముందు ఈ హామీలు ఇచ్చారు, ఎందుకు అమలు చేయడం లేదు’ అని ప్రశ్నించాలి. కానీ, తెలంగాణలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలకే దిక్కులేదు. అయినా ప్రశ్నించే గొంతుకలు మూగబోయాయి.
రైతుబంధు, పింఛన్ల పెంపు, రుణమాఫీ, జర్నలిస్టులకు పలు వాగ్దానాలు సహా అనేక అద్భుతమైన హామీలను కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. బహుశా ఇప్పుడవి కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, ప్రస్తుత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కూడా గుర్తుండకపోవచ్చు. అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు స్వర్గం చూపిస్తామన్నట్టుగా కాంగ్రెస్ నేతలు ప్రసంగాల్లో ఊదరగొట్టారు. హైదరాబాద్‌లోని హౌసింగ్ సొసైటీ సభ్యులు కొందరు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తామని ఎన్నికల సమయంలో ఊగిపోయారు. వంద కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని, పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరిస్తామని, జిల్లాల్లో ఇండ్ల స్థలాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ.ఐదు లక్షలు, రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పిస్తామని, జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందేలా హెల్త్‌కార్డులు జారీ చేస్తామని కూడా కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. కానీ, నేడు వీటిలో ఒక్కటంటే ఒక్క హామీ అమలుకాలేదు.
ఇండ్ల స్థలాల వ్యవహారం 20 ఏండ్ల నుంచి న్యాయస్థానాల్లో ఉంది కాబట్టి, ఆ విషయంలో ఏం చేయలేమని బుకాయించవచ్చు. కానీ, మిగిలిన హామీలైనా అమలయ్యాయా? అంటే అదీ లేదు. దౌర్భాగ్యం ఏమిటంటే.. ‘మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు కదా. ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదు?’ అని అడిగే దిక్కు కూడా లేకుండాపోయింది. విలేకరుల సమావేశంలో ‘ఇండ్ల స్థలాల సంగతి ఏమిట’ని ఎవరో ఒకరు అడగడం, ‘త్వరలో’ అని సీఎం సమాధానం చెప్పడం ఒక తంతుగా మారిపోయింది.
ఏదో ఒక రోజు ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారమవుతుందని జీవితాంతం ఆశతో ఉండొచ్చు. కనీసం మరణించినవారి కుటుంబాలకైనా ఇచ్చిన హామీ మేరకు రూ.ఐదు లక్షల ఆర్థికసాయం చేయడం లేదు. రూ.వంద కోట్ల నిధి మాట దేవుడెరుగు వంద రూపాయల నిధి కూడా ఏర్పాటు చేయలేదు. ఇండ్ల స్థలాలపై దృష్టిసారించిన జర్నలిస్టులు మిగిలిన డిమాండ్లను లేవనెత్తడం మరిచిపోయారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా నిజాంపేట భూములను జర్నలిస్ట్ సొసైటీకి అప్పగించారు. దాని చుట్టూ కంచె కూడా వేయించారు. కానీ, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకొని ఆయన చుట్టూ జర్నలిస్టులు ప్రదక్షిణలు చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు.
నోట్ ఇవ్వడం వేరు, స్థలం అప్పగించడం వేరు. ఆ మధ్య రవీంద్ర భారతిలో రేవంత్ సర్కారు అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించింది. రేవంత్‌రెడ్డికి స్వాగతం పలుకుతూ ‘మూడు రంగుల జెండా పట్టి సింహమోలే వచ్చినాడు’ పాటకు జర్నలిస్టులు నృత్యం కూడా చేశారు. తమ చేతికి ప్లాట్లు వచ్చాయని చాలా మంది సంబురపడ్డారు. కానీ, అది భూమి అప్పగింత కార్యక్రమం కాదు. ఇప్పటికీ సొసైటీకి భూమి అప్పగించలేదు. కేసీఆర్ హయాంలో అప్పగించిన నిజాంపేట భూమి మాత్రమే ఇప్పటికీ సొసైటీ చేతిలో ఉంది. అయితే, సుప్రీంకోర్టు తీర్పు వల్ల సమస్య ఎటూ తేలడం లేదు.
మరోవైపు రేవంత్‌రెడ్డి ఏ సమావేశానికి వెళ్లినా ‘జర్నలిస్టులకు పట్టాలు ఇచ్చినందుకా మీకు నా మీద కోపం?’ అని ప్రశ్నిస్తున్నారు. 20 ఏండ్ల సమస్యను పరిష్కరించి పట్టాలు ఇచ్చానని వరంగల్ సభలో ప్రకటించారు కూడా. అసలు భూమి సొసైటీకి అప్పగించలేదు. ఈ సమస్యే ఓ కొలిక్కి రాలేదంటే, కాంగ్రెస్‌ను తిరిగి గెలిపిస్తే ఫ్యూచర్ సిటీలో కొత్త వారికి ఇండ్ల స్థలాలు ఇస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించడం విడ్డూరం.
జర్నలిస్టుల సంక్షేమానికి రూ.42 కోట్లతో కేసీఆర్ సర్కారు నిధిని ఏర్పాటు చేసింది. కరోనా సమయంలో ఈ నిధులతోనే జర్నలిస్టులకు ఆర్థికసాయం చేశారు. మరణించినవారి కుటుంబాలకు రూ.లక్ష, వారి పిల్లల చదువు కోసం నెలకు రూ.మూడు వేలు ఇచ్చారు. హెల్త్‌కార్డుల ద్వారా వైద్య సహాయమూ పొందారు. కేసీఆర్ రూ.18 కోట్లతో మీడియా అకాడమీకి భవనం నిర్మించారు. ఇప్పుడు అదే భవనంలో మీడియా అకాడమీ కార్యకలాపాలు సాగుతున్నాయి.
నచ్చిన వ్యక్తిని మీడియా అకాడమీ చైర్మన్‌గా నియమించిన సీఎంకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఎంతసేపు? ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన రూ.వంద కోట్ల నిధి, పెన్షన్, హెల్త్‌కార్డులు, ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరించలేరా? ఇండ్ల స్థలాలకు కోర్టు కేసు అడ్డంకి అనుకుంటే, మిగిలిన హామీలు అమలు చేయడానికి ఇబ్బంది ఏముంది?
ఏటా జర్నలిస్టులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇస్తుంది. దీని కోసం అక్రిడిటేషన్ కమి టీ ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలైనా అక్రిడిటేషన్ కమిటీ లేదు, కొత్త కార్డుల జారీ లేదు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డుల మీద ప్రతి మూడు నెలలకు ఒకసారి స్టిక్కర్ అతికిస్తున్నారు. కొత్త కార్డులు కూడా ఇచ్చే స్థితిలో లేదు ఈ పనిమంతుల ప్రభుత్వం.
వృద్ధాశ్రమం పెడుతున్నామని చందాల కోసం వెళ్తే.. ‘మా ఇంట్లో ఇద్దరు ముసలివాళ్లు ఉన్నారు, తీసుకెళ్లండి’ అని ఉదారంగా చెప్పాడట వెనుకటికొకడు. ఇలాగే ఇండ్ల స్థలాల విషయంలో సీఎం, మంత్రులు బోలెడు సానుభూతి చూపిస్తున్నారు. హామీ ఇచ్చిన నేతలకు ఎలాగో అవి గుర్తులేవు. కనీసం ప్రశ్నించే గొంతుకలు జర్నలిస్టులకైనా కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు గుర్తుకురావడం లేదా? ‘రాత్ గయి బాత్ గయి’ అన్నట్టు ఎన్నికలు ముగిశాయి, అధికారంలోకి వచ్చాం.. ఇక ఎన్నికల మ్యానిఫెస్టోతో పనేముందన్నట్టుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు.