‘ఒక జాతి కానీ, ఒక దేశం కానీ తన సొంత కాళ్ల మీద నిలబడి, తన వ్యవహారాలు తానే చక్కదిద్దుకోవాలి. పరాధీనంలో బతకడం కన్నా, చావు మేలు. తన సొంత ఆర్థిక, రాజకీయ అస్తిత్వం ద్వారానే జాతి మనుగడ సాధ్యమవుతుంద’న్నారు రూసో. ఆదిమ సమాజం నుంచి ఆధునిక సమాజంగా రూపాంతరం చెందడంలో మానవ వికాసానికి హేతువుగా నిలిచినవారు తత్వవేత్తలు. మానవుల భావోద్వేగాల పునాదులపై మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి అనేక పార్టీల రూపకల్పనలకు ప్రతిపాదనలు చేసేవారు రాజకీయ నాయకులు.
కుటుంబం, రాజ్యవ్యవస్థ, ఆర్థికవ్యవస్థ మొదలైనవాటిలో రాజ్యవ్యవస్థ అత్యంత శక్తిమంతమైనది. మనిషి అభివృద్ధి చెందాలన్నా, అధోగతి పాలు కావాలన్నా, ఆధునికత వైపు పురోగమించాలన్నా, ఆదిమ సమాజంలోకి తిరోగమించాలన్నా రాజకీయపార్టీల సైద్ధాంతికత, పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. ఇంత ప్రధానమైనది కాబట్టే కాలానుగుణంగా అనేక పార్టీల సైద్ధాంతిక వైరుధ్యాలు సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా ఉన్న ఇక్కడి పార్టీల, పాలకుల స్వార్థపూరిత దోపిడీ విధానాలను, ఆ విధానాల వల్ల ఒక ప్రాంతం ప్రాంతమే చీకటి కోణంలోకి నెట్టివేయబడ్డది. ఈ తీరును ఎండగడుతూ తమ ప్రాంత విముక్తి కోసం వ్యవస్థపై తిరుగుబాటు మార్గం కాకుండా, వ్యవస్థలో అంతర్భాగంగా ఉంటూనే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే ఎజెండాగా, తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమ పార్టీకి పురుడు పోశారు ఉద్యమ నేత కేసీఆర్. టీఆర్ఎస్కు రాజకీయ స్వరూపం ఇచ్చి, తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేశారు. ఆంధ్రులను ద్వేషించకుండా, దూషించకుండా, ఒక్క రక్తం చుక్క నేల రాలకుండా, ఒక్క రూపాయి ఆస్తి ధ్వంసం కాకుండా, శత్రువుకు చిక్కకుండా, ఉద్యమం అణచివేతకు గురికాకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో, చట్టం పరిధిలో, శాంతియుతంగా, అత్యంత చాకచక్యంతో, వ్యూహాత్మకంగా తెలంగాణ మహోద్యమాన్ని నడిపారు. చివరికి నా చావు ద్వారానైనా తెలంగాణ రావాలని చావు నోట్లో తల పెట్టి, దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన కార్యసాధకుడు, ఈ కాలం మహనీయుడు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజాభీష్టం, మద్దతు అనేక అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ఉద్యమం ఎంత న్యాయబద్ధమైనదైనప్పటికీ, నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి వ్యక్తి త్వం, సామర్థ్యం, సాహసం, వ్యూహం ఎత్తుగడలే జయాపజయాలను నిర్ణయిస్తాయి. వ్యక్తిత్వాన్ని బట్టి నాయకత్వం, నాయకత్వాన్ని బట్టి ప్రజాదరణ, ప్రజాదరణను బట్టి ఉద్యమం, ఉద్యమాన్ని బట్టి లక్ష్యసిద్ధి సమకూరుతుంది. శత్రువు ఎంతటి శక్తిమంతుడైనప్పటికీ, ఎంతటి ఆయుధ సంపత్తి కలిగి ఉన్నప్పటికీ యుద్ధంలో మెలకువలు తెలిసినవాడే విజేత.
తెలంగాణ ఉద్యమానికి అనేక అవరోధాలు న్న క్లిష్ట సమయంలో నాయకత్వం వహించిన కేసీఆర్‌ది ఒక విలక్షణమైన, ధీరోదాత్త వ్యక్తి త్వం. అందుకే అంత్యదశ వరకూ కొనసాగిన కుట్రలను అంతమొందించి, ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చగలిగారు. లౌల్యానికి లొంగేవాడైనా, భయపడి పారిపోయేవాడైనా, ఉద్య మం మధ్యనే పుట్టి మునిగిపోయేది. లెక్కలేనన్ని ఒడుదొడుకులను దాటుకొని, రాష్ర్టాన్ని సాధించడంలో ఆయన ఎత్తుగడలు, పోరాట పటిమ, సంచలనాత్మక నిర్ణయాలు వెరసి ఒక పరిణత రాజకీయ చతురత కీలకంగా పనిచేసింది.
యుద్ధాన్ని కలగన్నవాడే త్యాగాలకు సిద్ధపడగలడు. త్యాగాలకు సిద్ధపడ్డవాడికే దాని విలువ ఏమిటో తెలుస్తుంది. తెలంగాణ మహాయజ్ఞంలో సమిధలైన ఎందరో అమరవీరుల త్యాగాలు ఎంత పవిత్రమైనవో తెలిసినవాడు, పోరాడి సాధించుకున్న ఉద్యమఫలాలు ఎవరికి దక్కాలో ఎరుకలో ఉంచుకున్నవాడు, ఎవరి త్యాగాల పునాదులపై తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఏర్పాటుచేయాలో ఒక బాధ్యత ఉన్నవాడు, ఏ స్వప్నాలను సాకారం చేయాలో ఎరుక కలిగిన నాయకుడు కేసీఆర్. రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటిరోజు నుంచే పలు సంక్షేమాత్మక, అభివృద్ధికారక, సాహసోపేత, స్వీయ అస్తిత్వ స్పృహతో కూడిన నిర్ణయాలను తీసుకొని కార్యాచరణలో పెట్టడం మనం చూశాం. పోరాటయోధుడే పాలకుడైన వేళ పాలన ఎంత ప్రజా రంజకంగా, ప్రజాప్రయోజనకరంగా ఉందో ప్రస్ఫుటంగా మనకు కనపడుతుంది. మన నేల, మన ప్రజలు, మన పార్టీ, మన పాలన అన్న స్పృహ ఎంత బలమైనదో నిరూపితమైంది.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన మొదలైనాక జరిగిన ఈ చారిత్రక పరిణామాల నేపథ్యాన్ని ఏ మాత్రం అవలోకనం చేసుకోకుండా, ఉన్న తెలంగాణను ఊడగొట్టి, ఆంధ్రలో కలిపి ఏపీ రాష్ట్ర అవతరణకు కారకులైనవాళ్లు, 1969లో తెలంగాణ కోసం ఉద్యమించిన 369 మంది తెలంగాణ బిడ్డల్ని కర్కశంగా కాల్చిచంపినవాళ్లు, ఇచ్చిన తెలంగాణ ప్రకటనను, ఆం ధ్రా లాబీయింగ్‌కు తలొగ్గి వెనక్కి తీసుకొని 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు కారకులై, వారి తల్లులకు గర్భశోకం మిగిల్చినవాళ్లు తగుదునమ్మా అంటూ మాట్లాడుతున్నా రు. ‘ఒక్క పైసా కూడా తెలంగాణకు ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండ’ని, అధికార, అహంకార, ఆధిపత్య భావనతో, నిండు అసెంబ్లీలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోజు మాట్లాడుతుంటే ముసిముసి నవ్వులతో నోరు మెదుపని కుక్కమూతి పిందలు, గోతికాడి నక్కలు, గుమ్మికింది పందికొక్కులైన ఈ కాంగ్రెస్ నాయకులా కేసీఆర్‌ను విమర్శించేది? పరీక్షకు నిలవాల్సిన ప్రతిసారీ పదవులను త్యాగం చేసి, బలిపీఠమెక్కిన త్యాగాల చరిత్ర కేసీఆర్దైతే, పదవుల కోసం పెదవులు మూసుకొని రాజీనామాలు చేయమంటే దొంగల్లా పారిపోయిన దోపిడిదారుల చరిత్ర మీది. మీరా కేసీఆర్ పాలన గూర్చి మాట్లాడేది?
ఇప్పుడు కావాల్సింది ప్రజలను కండ్లల్ల పెట్టుకొని కాపాడే నాయకుడు. తల్లి కోడిలా పిల్లల్ని రక్షించే పార్టీ. ఈ మట్టి ఆరాటాలు, పోరాటాలు తెలుసుకొని అమలుచేసే ప్రజారంజక పాలసీ లు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవ్వరికీ తాకట్టు పెట్టని దమ్మున్న నాయకత్వం. ఆ నాయకత్వమే గెలుస్తుంది. ఆ నాయకత్వమే నిలుస్తుంది. ఆ నాయకత్వాన్నందించగల సమర్థుడే మొన్నటి స్వాప్నికుడు, నిన్నటి సాధకుడు, నేటి పాలకుడు, రేపటి బంగారు తెలంగాణ నిర్మాణ కారకుడూ కేసీఆర్. ప్రజలిచ్చిన అధికారంతో పాలనకే పాఠాలు నేర్పుతూ, దేశంలో ఏ ఒక్క నాయకునికీ అందనంత ఎత్తులో ఉన్న అరుదైన పాలకుడూ ఆధునిక చాణక్యుడూ కేసీఆర్.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
-నారదాసు లక్ష్మణ్‌రావు
98490 59562