‘సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు’ అన్నారు మన ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆయన అంతేవాసులమని చెప్పుకొనే రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఆ స్పృహ అడుగంటింది. ప్రస్తుతం రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నవారు మరీ దారుణం. తాము ఏ ప్రాజెక్టు కట్టారో, కనీసం కట్టాలనుకుంటున్నారో కూడా వారు చెప్పలేరు. కానీ, ప్రపంచ మన్ననలందుకున్న కాళేశ్వరంపై మాత్రం కక్ష కట్టారు. తెలంగాణ జలభాండాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు కోసం తపస్సు చేసిన అపర భగీరథునిపై అభాండాలు వేయడానికి ఉరుకులాడుతున్నారు. ఆ మేరునగ ధీరుని మీద బురద జల్లడానికి ఎగిరెగిరి ఎల్లెంకల పడుతున్నారు. కాళేశ్వర రూపశిల్పి కీర్తిభానుడి ధగధగలను అరచేతితో అడ్డుకోవాలని ఆరాటపడుతున్నారు. ఎనభై వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అంటూ అవాకులూ చవాకులూ పేలినవారు ఇప్పుడు నిగ్గుతేలిన నిజాలపై కమిషన్లు వేస్తూ సాధింపులకు పాల్పడుతున్నారు. వేధింపులకు బరితెగిస్తున్నారు. ఔను నిజమే. కమిషన్ వేయాల్సిందే. వేస్తే గీస్తే బనకచర్ల మీద వేయాలి. తెలంగాణ నీటిని ఎక్కడెక్కడికో ఎగరేసుకుపోవాలనే చంద్రబాబు కుట్రలపై వేయాలి. ఆ బాబు తాబేదారుగా తలలూపుతున్న వారి గుట్టురట్టు చేయాలి. గోదారి గంగను ఓట్ల సేద్యానికి పారించాలనుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎత్తుగడల రంగుతేల్చాలి. సీఎం రేవంత్ రెడ్డి వంటివారు తెలంగాణను మరోసారి జలదోపిడీకి బలిచేసేందుకు ఆడుతున్న నాటకాలను కడిగిపారేయాలంటే ఓ కమిషన్ వేయాల్సిందే.
కంట్లో నలుసు పడిందని కనుగుడ్డు పెరికివేస్తామా? ముల్లు దిగిందని కాలునే నరికివేస్తామా? పిల్లర్ కుంగిందని కాళేశ్వరాన్ని పడావుపెట్టి నీటి భరోసాను నీరుగారుస్తున్న నీతిమాలినతనంపై కమిషన్ వేయాలి. కేవలం కేసీఆర్పై ప్రతీకారంతో రగిలిపోతూ రాష్ట్ర ప్రయోజనాలకే ముప్పు తెస్తున్న రాజకీయ దిగజారుడుపై కమిషన్ వేయాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టులు మారవు. వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టింది రాజకీయ వికృత క్రీడలో వాటిని పావులుగా వాడుకోవడానికి కాదు. ఈ విజ్ఞత కొరవడటంపై కమిషన్ వేయాలి. కాంగ్రెస్లో మహామహులు అంతరించి కమిషన్ ‘కన్నప్పలు’ మాత్రమే మిగిలారు. రాష్ట్ర మంత్రులే దీనిపై గొంతు విప్పుతున్నారు. ఈ కమీషన్ల రాజ్యంపై ఓ కమిషన్ తప్పకుండా వేయాల్సిందే. గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేతులు మారుతున్న సూట్కేసుల కమీషన్ కక్కుర్తిని బట్టబయలు చేయాలి.
కేసీఆర్ కట్టిన మహా జలనిధికి ఓ చిన్న చిల్లు పడింది. ఆ చిల్లును చిటుక్కున మూసేసి ప్రజలకు నీళ్లు అందిస్తే సరిపోతుంది. కానీ, అలా చేస్తే కేసీఆర్ ప్రాజెక్టు సరైనదే అని ఒప్పుకొన్నట్టవుతుంది. అందుకే ప్రాజెక్టుపై బురద జల్లాలి. దాన్ని ఓ మిషన్లా చేపట్టి, నిలబెట్టి, రాష్ర్టానికి అఖండ జలకళను సంతరించిన భగీరథంపై బట్టకాల్చి మీదేయాలి. ఇదీ యావ. ఇందుకు వారు ఎంచుకున్న మార్గం విచారణ కమిషన్. మంచిదే. నిజం వందోసారి చెప్పినా నిజమే. బంగారం మసిగుడ్డలో కట్టినా బంగారమే. రంగు మారదు. హంగు మారదు. ఏ కమిషన్ గీటురాయి మీద గీసి చూసుకున్నా నిగ్గు తేలుతుంది. మరి కాంగ్రెస్ ప్రాజెక్టుల మాటేమిటి? తెలంగాణకు పైసా పనికిరాని, ఏ మాత్రం ప్రయోజనకరంగా ఉండని ఎస్సారెస్పీ వంటి నిరర్థక ప్రాజెక్టులు కట్టిన నిర్వాకం సంగతేమిటి? శ్రీశైలం ఎడమగట్టున నిర్మించిన సపోర్టు డ్యాం ఉపయోగంలోకి రాకుండానే కూలిపోవడంతో వందకోట్లు కృష్ణార్పణం కావడంపై కమిషన్ వేయాలి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో శవాలతో సహా చిక్కుకుపోయిన భారీ యంత్రాలను బయటపడేసేందుకు కమిషన్లు వేద్దామా? కమిషన్ల మీద కమిషన్లు వేసి కూపీలు లాగుదామా? పొరుగు నీటి దోపిడీకి సంచులు మోసిన ‘జీ హుజూర్-జోహుకుం’ తందానాల నిగ్గు తేలుద్దామా?