యువతరం గళమెత్తితే, నవతరం శిరసెత్తితే లోకమే మారిపోదా.. చీకటే మాసిపోదా’ అన్నాడో కవి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆవిర్భావ వికాసాలకు సంబంధించి జరుగుతున్న చర్చ వెనుక ఉన్నది ఈ ఆకాంక్షేనని చెప్పక తప్పదు. దేశం అనేక సమస్యలతో కుతకుత ఉడుకుతున్నది. ‘కాక్రోచ్’ లేదా బొద్దింక అనే మాట ఆగ్రహ జ్వాలను మండించింది. గూడుకట్టుకున్న నిరసన నిప్పురవ్వలై ఎగిసింది. సైబర్ ప్రపంచంలో సీజేపీ దావానలంలా వ్యాపించింది. బీజేపీకి పోటీ గా సీజేపీ అనే ధ్వని ఇందులో ఉన్నదని గుర్తించాలి. సీజేపీలో చేరికలు మిన్నంటాయి.
ఎంతగా అంటే పాలకులు దడుసుకుని. సోషల్ మీడియా అకౌంట్లను నిలిపివేయించేంతగా. ఒకటి మాత్రం నిజం. సీజేపీ ఖాతాలను మూసివేయిస్తుండటం సర్కార్‌లో నెలకొన్న అభద్రతకు నిదర్శనం అని చెప్పక తప్పదు. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన శక్తులు కార్పొరేట్ల కొమ్ముకాస్తూ, దేశ ప్రజలను గాలికి వదిలేశాయనే భావన దేశ ప్రజల్లో విస్తరిస్తున్న సూచన ఇది. ఈ నేపథ్యంలో యువత నిరసనలో మొలకెత్తిన శోధనే బొద్దింకల తిరుగుబాటు రూపంలో బద్దలైందన్నది వాస్తవం.
ఈ ‘కాక్రోచ్’ సందోహం సైబర్ ప్రపంచంలో పుట్టిందే కావచ్చు. కానీ దానికి మూలాలు మన సమాజంలో, మన పరిపాలనలో, ఆంతరంగిక, విదేశాంగ విధానాల్లో ఉన్నాయనేది వాస్తవం. పన్నెండేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ హయాంలో ప్రజల బతుకు అథోగతిపాలు కావడం కనిపిస్తున్నది. ప్రధాని మోదీ చెప్పినట్టుగా రైతుల ఆదాయం రెండింతలు కాకపోగా, నానాటికీ తీసికట్టు అయిపోయింది. వ్యవసాయ నల్లచట్టాలను తిప్పికొట్టేందుకు రైతులు మహాపోరాటమే చేయాల్సి వచ్చింది. రూపాయి పతనం అధఃపాతాళానికి చేరుకోవడంతో సామాన్యులు ధరాఘాతానికి విలవిల్లాడుతున్నారు.
మహిళలకు, మైనారిటీలకు రక్షణ కరువైంది. అఘాయిత్యాలు చేసినవారిని ప్రభుత్వమే విడిపించి అభాసుపాలవుతుండటం మనం చూస్తున్నాం. బేటీ బచావ్, బేటీ పడావ్ కేవలం నినాదంగా మిగిలిపోయింది. బీజేపీ నేతల సుపుత్రుల అఘాయిత్యాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవలి పోక్సో కేసు ఉదంతం తెలిసిందే.
మోదీ వ్యక్తిపూజ ఆదారంగా, విశ్వగురు టాంటాంలతో పాలకవర్గాలు సాగిస్తున్న ప్రచారార్భాటం విశ్వవేదికలపై బెడిసికొడుతున్నది. అమెరికా-ఇరాన్ యుద్ధం సాక్షిగా భారత్ విదేశాంగ విధానం తీవ్రమైన ఊగిసలాటకు గురవుతున్నది. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ వ్యవస్థలు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నాయనే విమర్శ తెలిసిందే.
మరోవైపు న్యాయవ్యవస్థే ప్రభుత్వ వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నది. ఇవేవీ సుపరిపాలనకు సూచనలు కావు. ప్రజల జీవన విధానాలు మెరుగుపర్చే వ్యవహారాలు అసలే కావు. దేశం సమస్యల వలయంలో చిక్కుకుంటే, సర్కార్ లో జవాబుదారీ మృగ్యమైపోయింది. ప్రభు త్వ చర్యలనో, ప్రధాని నాయకత్వ శైలినో ప్రశ్నించటమే దేశద్రోహం అన్నట్టు కేసులు బుసకొడుతున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన యువత నిస్పృహలో నుంచి తలెత్తిన సంచలనమే సీజేపీ.
అయితే, ‘బొద్దింక’ల తిరుగుబాటును తక్ష ణ ప్రతిస్పందనగానే చూడాల్సి ఉంటుంది. ఈ పరిణామాలు పొరుగు దేశాల్లో ప్రజ్వరిల్లిన జెన్-జీ తరహా తిరుగుబాటుకు దారితీస్తుందేమోనని కొందరు అప్పుడే ఊహాపోహలు చేస్తున్నారు. నేపాల్‌లో జెన్-జీ తిరుగుబాటు ప్రభుత్వాన్ని గద్దె దించింది. బంగ్లాదేశ్‌లోనూ జెన్-జీ ఆందోళనే రాజకీయ మార్పులకు దారితీసింది.
అటు శ్రీలంకలోనూ జెన్-జీ రా జకీయ ఆటుపోట్లకు దారితీసింది. ఇక్కడా అలాంటి పరిణామాలు తలెత్తవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటానికి ప్రభుత్వం పట్ల ఉన్న తీవ్రమైన ప్రజా వ్యతిరేకతనే కార ణం. అయితే ఇది సైద్ధాంతిక నిబద్ధతతో ఆవిష్కృతమైన పోరాట రూపం కాదు. ఇది మహోధృత రూపం దాల్చి సర్కార్ పీఠాలు కదిలించే స్థాయికి ఇప్పట్లో వస్తుందని అనుకోవటం తొందరపాటు.
అయితే దేశంలో కొత్తగాలి కోసం ఆరాటం మొదలైనదన్న మాట వాస్తవం. తమిళనాడులో సినీనటుడు విజయ్ పార్టీ అధికారం హస్తగతం చేసుకోవటం అందుకు ఓ సంకేతం. అయినా, బొద్దింకల తిరుగుబాటు టీకప్పులో తుఫాన్ మాత్రమేనని ప్రభుత్వ అనుకూల వర్గాలు తేలిగ్గా తీసుకుంటున్నాయి. అదే సమయంలో దీన్ని కేంద్రం ఉక్కుపాదాలతో తొక్కిపడేయాలని చూస్తున్నది. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలు చేరలేకపోవటం వాస్తవం. అందుకే ప్రజల్లో గూడుకట్టుకున్న ఆగ్రహావేశాలు సైబర్ బొద్దింకల రూపంలో బిలబిలమంటూ బయటకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిజాన్ని గ్రహించకుంటే చరిత్ర నేర్పే గుణపాఠాలకు సిద్ధం కావాల్సి ఉంటుంది.