ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు, చేష్టలు ఏ మాత్రం ప్రజలు హర్షించేలా లేవు. ఆయన నోరు పెద్దగా చేసుకొని పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. అసలు మొదలే పెట్టని, మధ్యలో వదిలేసిన హామీలను సైతం తీర్చామని చెప్తూ పాలనా బండిని నడిపిస్తున్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులను పది నెలల్లో చేశామని గొప్పలకు పోతున్నారు. చివరి దశలో ఉన్న కాళోజీ కళాక్షేత్రాన్ని ఆరంభించి ఆ నిర్మాణ కీర్తిని తమ ఖాతాలో వేసుకున్నారు. ఆయన ఏది చెప్పినా పత్రికలు రాస్తాయేమో కానీ, ప్రజలు మాత్రం నమ్మరు. ఎందుకంటే వారికి నిజాలు తెలుసు.
నెహ్రూ కుటుంబం తుమ్మినా, దగ్గినా తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుకు పండుగే. నెహ్రూ, ఇందిరాగాంధీ జయంతి, వర్ధంతులకు కోట్లు ఖర్చు చేసి పత్రికల్లో ముందు పేజీ ప్రకటనలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. నెహ్రూ జయంతి నవంబర్ 14న బాలల దినోత్సవం నిజమే. అయితే, రేవంత్‌రెడ్డి కండ్లకు బాలలంటే స్కూల్ పిల్లలు మాత్రమే కనబడ్డారు. వాళ్ల కోసం ఏవేవో చేస్తామంటూ పత్రికల్లో ప్రకటనలు గుప్పించారు. బడి పిల్లల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే, హోటళ్లు, ఇటుక బట్టీలలో పనిచేసేవారు బాలలు కాదా? ఫుట్‌పాత్‌లపై మాసిన బట్టలతో బతికే పిల్లలు ఆయనకు కనబడలేదా? వారికి ఉత్సవాలు ఉండవా? వారిని చేరదీసి మంచి భోజనం పెట్టి, మంచి బట్టలు ఇచ్చి బాలల సంక్షేమ గృహాలకు అప్పగించవలసిన బాధ్యత ఆయనపై లేదా? అసలు నెహ్రూ ఆశించిన బాలల భవిష్యత్తు అదే కదా!
ఇక డిసెంబర్ 9న సోనియమ్మ పుట్టినరోజు వస్తున్నది. ఆ సందడి ఎలా ఉంటుందో? రాష్ట్ర ప్రజలపై ఎంత భారం పడుతుందో..? ఆవిడ కనీవినీ ఎరుగని సంబురాలు ఇక్కడ జరుగవచ్చు. సోనియమ్మ కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవడానికి కూడా కాంగ్రెస్ వాళ్లు సిద్ధమయ్యారు. ఆ పని మీరు కూడా చేయండని ఇతర పార్టీ నేతలకూ చెప్పడం బానిసత్వానికి పరాకాష్ఠ. రాష్ట్ర ఏర్పాటు ఘనతను సోనియమ్మకు కట్టబెట్టడానికి ఆ అబద్ధాన్ని లక్ష సార్లు చెప్పినా జనం ఒప్పుకోరు. నిజంగా సోనియాగాంధీయే తెలంగాణను ఇచ్చి ఉంటే 2014లో జనం కాంగ్రెస్‌కే ఓటేసి రాష్ర్టాన్ని అప్పగించేవారు.
గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి మాటల దూకుడు పెరిగిపోయింది. వేదిక ఎక్కితే చాలు ఆ సమావేశం ఎందుకు ఏర్పాటుచేశారు, ఏం మాట్లాడాలనేది మరిచిపోయి కేసీఆర్ ఫాంహౌజ్, కేటీఆర్ జైలు అనే పదాలు ఆటోమేటిక్‌గా రేవంత్ నోట్లోంచి రాలుతున్నాయి. ఆవేశంతో ఆయన గొంతు చించుకుంటున్నారు. హామీల సంగతేమిటని ప్రజలు, పత్రికల నుంచి ప్రశ్నలు రాకుండా గరం గరంగా మాట్లాడుతున్నారు. దాంతో అవే మాట లు పతాక శీర్షికలవుతున్నాయి.
‘తొక్కుకుంటూ వచ్చిన’ అనడం అహంకారపూరిత మాట. ఇది రాజుల కాలం కాదు. కత్తులు, కఠారులతో కాదు, ప్రజలు ఓట్లు వేస్తే రాజ్యాధికారం వస్తుంది. మొక్క మళ్లీ చిగురిస్తుందో లేదో చెప్పడానికి ఆయనెవరు? రేవంత్ మాటలు కాదు, మిగతా నాలుగేండ్ల ఆయన పాలనే నిర్ణయిస్తుంది.
లగచర్ల ఫార్మా విలేజీ భూసేకరణ, దాడి సంఘటన రైతుల గోడు నుంచి రాజకీయ కక్షకు వేదికైంది. హడావుడిగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనను ఎక్కడ అరెస్టు చేశారన్నది కోర్టులో సరిగా చెప్పలేకపోయారు. మఫ్టీలో వెళ్లి పార్క్‌లో అరెస్టు చేయడానికి ఆయనేమైనా టెర్రరిస్టా అని కోర్టు అడిగింది. ఇంట్లో అరెస్ట్ చేశామని పోలీసులంటే ఇంటివారికి చెప్పారా అని మళ్లీ ప్రశ్నించింది. ఒక మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకోవడానికి ఇంత తొందరపాటు ఎందుకు? అని కోర్టు విసుక్కున్నది. కొణతం దిలీప్ అరెస్టు విషయంలోనూ కోర్టులో పోలీసులకు పదే పదే చుక్కెదురవుతున్నది. ఆయనను రిమాండ్‌కు పంపాలని ప్రభుత్వం ఆరాటపడుతున్నది. రిమాండ్ ఇవ్వడానికి ఈయనపై అంత సీరియస్ విషయాలేమున్నాయని కోర్టు అడుగుతున్నది. జైలు, ఊచలు అనగానే చట్టాలు రేవంత్‌కు చుట్టాలైతాయా?
లగచర్ల ఘటన జరగడానికి నిఘా వైఫల్యమే కారణం. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఊరు మీద పడి దొరికిన వారిని దొరికినట్టు అరెస్టులు, థర్డ్ డిగ్రీ హింసలు చేయడం మరో తప్పిదం. భూసేకరణ సమావేశానికి ముందు నుంచే అక్కడి ప్రజలు తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని మీడియా ముందు గోడు వెళ్లబోసుకుంటున్నారు. చస్తాం కానీ, భూములివ్వమని మహిళలు కన్నీరు పెట్టుకున్న సన్నివేశాలు టీవీల్లో చూశాం. అంత ఉద్రిక్తత పరిస్థితుల్లో అధికారులు గ్రామాలకు వెళ్లవలసిన అవసరం ఉన్నదా? ఊరివాళ్లు ఫలానా చోట ఉన్నారనగానే అధికారులు సమావేశ స్థలాన్ని వదిలి వెళ్లడమేమిటి? ముందుగా పోలీసులు ఆ విషయాన్ని నిర్ధారించాలి కదా! తగిన బందోబస్తు కల్పించాలి కదా! తప్పు ఒకరిదైతే దానికి అమాయక రైతులు బలి కావలసిందేనా? లగచెర్లలో కరెంటు ఆపేసి ఇండ్లలోకి రాత్రిపూట చొరబడి పోలీసులు రజాకార్లలా వ్యవహరించారు. రాత్రి దాడి చేసే అవసరమేమున్నది? అనుమానితులపై అరెస్టు వారెంట్లు తీసుకొని పగటిపూట అరెస్టు చేస్తే సరిపోదా! కేసీఆర్‌పై ఉన్న కోపాన్ని ప్రభుత్వం అమాయక జనంపై చూపెడుతున్నది. వారేం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయలేదు, తమ భూములనే కాపాడుకోవాలనుకుంటున్నారు.
ప్రజాగ్రహాన్ని సరిగ్గా అంచనా వేయకపోవడమే దీనికి అసలు కారణం. లగచర్ల ఇప్పుడు యూపీలోని హత్రాస్‌ను తలపిస్తున్నది. హత్రాస్‌లోకి వెళ్లేందుకు వచ్చిన ఒక విలేకరిని పోలీసులు అరెస్టు చేసి, ఆయనపై ఉపా కేసు పెట్టి ఏడాది పాటు జైల్లో ఉంచారు. లగచర్లలోకి కూడా ఎవ్వరు అడుగుపెట్టే పరిస్థితి లేదు. ప్రజా సంఘాల నేతలను వెనక్కి పంపిస్తున్నారు. అరెస్టు చేసి ఎక్కడో వదిలేస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన పూర్తిస్థాయిలో జరుగుతున్నది.
ఈ కేసు విషయంలో ప్రభుత్వానికి అంత దాపరికం ఎందుకో అర్థం కావడం లేదు. బాధితులు తమ గోడును లోకానికి వినిపించుకోకూడదా? ముఖ్యమంత్రి ఈ మధ్య తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో ముందస్తుగా విపక్ష నేతలను అరెస్టు, గృహ నిర్బంధం చేయడం చూస్తుంటే ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను నియంతృత్వంగా అణచివేసే ప్రణాళిక కొనసాగుతున్నదనుకోవాలి. రాబో యే రోజుల్లో రాజకీయ కక్షలు, ప్రజా సంఘాల అణచివేతలు ఇంకా తీవ్రం కావచ్చు. ఒక ప్రణాళికాబద్ధంగా రేవంత్‌రెడ్డి ప్రజా సంఘాల నేతలను చేరదీసి వారిని ప్రజలకు దూరం చేస్తున్నారు. నియంతృత్వ పాలనకు దూరంగా ఉంటూ, దానిని నిలదీయవలసిన విచక్షణ హక్కుల నేతలకు, ప్రజాస్వామ్యవాదులకు అత్యవసరం.