రాష్ర్టానికి ఇంకా విద్యా మంత్రి నియామకం జరగలేదు. బీఏ చదివిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ శాఖను నిర్వహిస్తూ.. రోజుకొకటి అన్న తీరులో విద్యా సంస్కరణల ప్రకటన చేస్తున్నారు. రాష్ట్ర విద్యార్థి, యువత ఉపాధి విషయంలో ఆయన ఆలోచనా విధానం పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నది. విద్యావంతులైన యువత వ్యక్తిగత ప్రజ్ఞ, ఆసక్తుల పట్ల శ్రద్ధ, అవగాహన లేకుండా వారందరిని పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసే వైట్ కాలర్ కూలీలుగా మార్చడమే గొప్ప కార్యమని ఆయన అనుకుంటున్నారు.
Telangana | రాష్ట్రంలో ఒకవైపు లక్షల మంది రైతులు రుణమాఫీ, రైతు భరోసా అందక బాధల్లో ఉన్నారు. ఇలాంటి ఎన్నో ప్రాథమ్యాలను పక్కనబెట్టి ముఖ్యమంత్రి కేవలం నగర అభివృద్ధిపై అద్భుతాలను చెప్తూ స్టేట్ సీఈవోలాగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు సైబరాబాద్ నిర్మిస్తే తాను ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నానన్నారు. వ్యవసాయం దండగ, చరిత్ర చదివితే ఏం లాభమన్న బాబు పోకడలు రేవంత్‌లో పొడ సూపుతున్నాయి. ఫోర్త్‌సిటీ గురించి ఘనంగా చెప్తూ న్యూయార్క్, సింగపూర్, దుబాయ్లను మించిన నగరంగా దానిని రూపొందిస్తామన్నారు. కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా వృద్ధి పరుస్తామన్నారు. అందులో ప్రముఖ ఫార్మా, ఐటీ కంపెనీలు వెలుస్తాయంటున్నారు. వేల కోట్ల విదేశీ పెట్టుబడులతో ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదంటున్నారు.
రేవంత్ కల కంటున్న ఫ్యూచర్ సిటీ వల్ల తెలంగాణలోని సామాన్య ప్రజల కష్టాలు తీరే మార్గాలేవీ లేవు. రైతు కుటుంబంలో నలుగురుంటే ఒకరు వ్యవసాయంలో ఉండి మిగతా ముగ్గురు బయట ఉద్యోగాలు వెతుక్కోవాలన్నారు. పరోక్షంగా సాగును నిరుత్సాహపరిచే తీరు ఈ మాటల్లో కనపడుతున్నది. నగరాల్లోని పరిశ్రమలకు నిరంతరంగా కార్మికుల సరఫరా కోసం వ్యవసాయాన్ని నష్టాల్లో ఉంచాలనే చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయనే మాటలో నిజమే ఉన్నది. వ్యవసాయం కూడా ఆర్థిక చోదకశక్తిగా ఎదగాలని బ్రెజిల్ లాంటి దేశాలు యువతను ఆ వైపు ప్రోత్సహిస్తుంటే మన ఆలోచన మరోలా ఉన్నది.
ఆ తర్వాత స్కిల్ యూనివర్సిటీ గురించి చెప్పుకోవాలి. 57 ఎకరాల్లో రూ.150 కోట్లతో అది నిర్మించబడుతుంది. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచే ఈ సంస్థకు టెక్ మహేంద్ర అనే ప్రైవేట్ సంస్థ యజమాని ఆనంద్ మహీంద్రా ఛాన్సలర్‌గా ఉంటారు. ప్రభుత్వం కోరి మరీ ఆయన్ని ఆ పీఠంపై కూర్చోబెడుతోంది. వచ్చే ఏడాది 2 వేలతో అడ్మిషన్లు మొదలై క్రమంగా పెరుగుతూ ఏటా 20 వేల మంది విద్యార్థులకు నైపుణ్యం అందించే స్థాయికి అది చేరుతుందని ప్రకటించారు. ఆ చదువులకు ఫీజులు ఎంత, విద్యార్థులకు ప్రభుత్వం నుండి లభించే రాయితీలు ఏమిటో తెలియదు. వీరి నైపుణ్యమంతా ప్రైవేటు కంపెనీలకు ధారపోయవలసిందే. ప్రైవే ట్ కంపెనీలు ఇచ్చే జీతభత్యాలు, వాటి విధుల నియమాలు, ఉద్యోగ భద్రతల విషయంలో మాత్రం ప్రభుత్వాలు కల్పించుకోవు. మన కనీ స వేతనాలు, పని గంటలు, కార్మిక చట్టాలు ఏ కంపెనీలు పాటించే అవసరం లేదు.
ప్రస్తుతం రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల ద్వారా ఏడాదికి లక్షకు పైగా యువత సాంకేతిక విద్యను పూర్తిచేసుకుంటున్నారు. వారిలో కేవలం 20 శాతం మందికే సరైన ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగతావారిలో నైపుణ్యాల లేమి ఉందని కంపెనీలు చెప్తున్నాయి. ఇందు కు ఆయా ఇంజినీరింగ్ కాలేజీల్లోని బోధన, మౌలిక సదుపాయాల కొరతనే తప్పు పట్టాలి. వాటిపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. లక్ష మందికి నా లుగేండ్ల పాటు కోర్సుకు తగిన నాణ్యమైన విద్యను కచ్చితంగా అందిస్తే వారికి స్కిల్స్ నే ర్పే మరో సంస్థ అవసరమే లేదు. ఈ రకంగా చూస్తే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కేవలం పారిశ్రామికవేత్తల ప్రయోజనం కోసమే అనుకోవాలి.
ముఖ్యమంత్రి ఈ మధ్య మరో విచిత్రమైన నైపుణ్య ఆలోచనను ప్రకటించారు. అదే మినీ డిగ్రీ ప్రోగ్రాం. దాని ప్రకారం.. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి 10 వేల మంది డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాల్లో శిక్షణ ఇస్తారు. దీనికోసం ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులను ఐదేసి వేల చొప్పున ఎంపిక చేస్తారు. ఈ శిక్షణ ద్వారా ఆయా విద్యార్థులకు కోర్సు పూర్తికాగానే ఉద్యోగ అవకాశం లభిస్తుందని ప్రభుత్వ తలంపు.
బీఏ, బీకాం చేసేవారికి ఇది ఉపయోగపడవచ్చు. కానీ, ఒక ప్రత్యేక సాంకేతిక విద్యను అభ్యసించిన వారికి ఈ మినీ డిగ్రీ వల్ల ప్రయోజనం ఉండదు. పని మెళకువలు నేర్చుకున్న యువత ఏదో చేసుకొని బతుకుతారనే ఆలోచన దీర్ఘకాలంలో బెడిసికొడుతుంది. ఒకేరకమైన నైపుణ్యం కలవారి సంఖ్య హద్దు దాటితే వారిలో వారికే పోటీ పెరిగి కంపెనీలు ప్యాకేజీలు తగ్గించే అవకాశం ఉన్నది. కొత్తగా చేరినవారికి కాగ్నిజెంట్ ఏడాదికి రూ.2.5 లక్షల ప్యాకేజీ ఇస్తున్నది. తొందరగా ఉద్యోగం వదిలేస్తే విప్రో రూ.లక్ష జరిమానా వేస్తున్నది. ఇలాంటి వాటిని ప్రభుత్వాలు ప్రశ్నించవు.
ప్రస్తుత కంపెనీలకు, మార్కెట్‌కు అవసరం ఉన్న స్కిల్స్ నేర్పి యువతతో వాటికి చాకిరీ చేయించే కన్నా ఆసక్తి ఉన్నవారిని శాస్త్రపరిశోధనల వైపు మళ్లించాలి. వాటి వల్ల నిత్య జీవితంలోని అనేక సమస్యలు తీరి, మానవాళి అభివృద్ధికి అవి తోడ్పడుతాయి. ముఖ్యమంత్రి నాలుగో నగరాన్ని సింగపూర్‌తో పోల్చారు. సింగపూర్‌లో శాస్త్ర పరిశోధకులు లక్ష జనాభాకు 728 మంది ఉంటే మన దేశంలో 26 మంది ఉన్నారు. ఒక దేశం లేదా నగరం అద్భుత అభివృద్ధిని సాధించాయంటే దాని వెనుక దశాబ్దాల కృషి, శ్రమ ఉంటుంది. దాని దరిదాపులకు వెళ్లాలన్నా ఎంతో అధ్యయనం, సమర్థ మానవశక్తి అవసరం. ఆ అంచనాలేవీ లేకుండానే దాటేస్తాం అనడం ప్రజలను మభ్యపెట్టడమే అనుకోవాలి. విద్య, ఉపాధి రంగాల్లో యువతకు మేలు చేయాలంటే ఒక సమర్థ విద్యామంత్రిని నియమించి, తగిన అధ్యయన కమిటీల ఏర్పాటు జరగాలి. యువత శక్తిని ప్రైవేటురంగానికి బలి చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా ప్రయోజనానికి పనికొచ్చేలా తీర్చిదిద్దాలి.
– నర్సన్ బద్రి 94401 28169