తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో ఉత్సాహం కొరవడి, పైపై మొక్కుబడితనమే కన్పించింది. ఆశ నిరాశల మధ్య, ప్రాణత్యాగాలు, పోరాటాల ఫలితంగా సిద్ధించిన రాష్ట్రంలో పదేండ్ల స్వపరిపాలన సంబురాలు ఇంటింటి పండుగలా, ఉప్పొంగిన గుండెలతో తెలంగాణమంతా కళాకాంతులతో వెలిగిపోవాలి. వివిధ కార్యక్రమాలతో కనీసం వారం రోజులైనా రాష్ట్రవ్యాప్తంగా మార్మోగాల్సిన సందడి కేవలం రెండు పూటల ముచ్చటగా ముగిసిపోయింది.
సీఎం రేవంత్ రెడ్డి పొద్దున గన్‌పార్క్‌లోని అమరుల స్తూపం వద్ద నివాళులర్పించి, అటునుంచి పరేడ్ గ్రౌండ్స్ వెళ్లి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత తన ప్రసంగంలో ఆయన ‘రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం’ అన్నారు. గత పదేండ్ల పాలన సాగించింది ప్రజా ప్రభుత్వం కాదని అర్థం ఆ మాటలో ఉంది. ఏ ప్రభుత్వమైనా ప్రజల ఓట్ల ద్వారానే ఏర్పడుతుంది. ప్రజాకంటకులనేది పాలనాక్రమంలో కాలం నిర్ణయిస్తుంది. తొలిదశ ఉద్యమకాలంలో కాంగ్రెస్ పాలనలో ఆనాటి ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆదేశాల ప్రకారం జరిగిన పోలీసు కాల్పుల్లో చనిపోయిన 369 తెలంగాణ బిడ్డల స్మృతిలో గన్‌పార్క్‌లో స్తూపం ఏర్పాటైంది. మలిదశ ఉద్యమానికి అడుగడుగునా అది స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్ర సాధన తర్వాత స్వీయ పాలనలో తెలంగాణ కోసం బలిదానాలు చేసిన అమరుల పేరిట సచివాలయం ఎదురుగా 2023లో భారీ స్మారకాన్ని ప్రభుత్వం నిర్మించింది. అయితే సీఎం కొత్తగా నిర్మించిన అమరుల స్మారక నిర్మాణం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా దాన్ని ఆయన సందర్శించకపోవడం శోచనీయం. వ్యక్తిగత స్పర్థలను అమరుల త్యాగాలకు, స్మారక నిర్మాణాలకు అంటగట్టడం సరికాదు.
అమరుల త్యాగఫలమే తెలంగాణ అనేది శిలాక్షరం. అమరుల కుటుంబాలను పరేడ్ గ్రౌండ్స్‌కు పిలిపించి వారికోసం ఒక ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటుచేసి గౌరవించారు. సీఎం ప్రసంగంలోగాని, ఆ తర్వాతి ప్రభుత్వ కార్యక్రమాల్లో గాని అమరుల కుటుంబాల ప్రసక్తి కానరాలేదు. రేవంత్‌రెడ్డి లేదా ఆయన తరపున ఎవరైనా అమరుల కుటుంబాల గ్యాలరీ వద్దకెళ్లి వారి బాగోగులు తెలుసుకొని, వారి పిల్లల త్యాగాలను కీర్తించవలసిన సందర్భమది. సాయంత్రం జరిగిన సంబురాల ప్రదర్శనలో హడావుడియే ఎక్కువగా కన్పించింది.
తెలంగాణ సంస్కృతి, కళల, జానపద, నృత్యాల ప్రదర్శనల కవాతు సాగింది. ఢిల్లీ, రాజ్‌పథ్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే వివిధ కళా ప్రదర్శనల మాదిరే ఇది కొనసాగింది. ముఖ్యమంత్రి, గవర్నర్ ఏదో కొత్త వింతను చూస్తున్నట్టు కనిపించారు. ఆ తర్వాత వేదికపై తెలంగాణ జాతి గీత కర్త అందెశ్రీని, సంగీత కర్త కీరవాణిని ప్రభుత్వం సత్కరించింది. ఈ సంబురాల చప్పదనం చూస్తుంటే ‘తెలంగాణ కోసం ఏ ఉద్యమమూ జరగలేదు, భాషా ప్రయుక్త రాష్ర్టాల దారిలోనే తెలంగాణ ఏర్పడింది’ అనేలా కార్యక్రమం సాగింది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో పడ్డ గోస, యాతన, త్యాగాలేవీ ఈ ఉత్సవాల నిర్వాహకులకు తెలిసినట్టుగా లేదు. లేదా ఆ గొప్పతనాన్ని యాదిచేసి తమ రాజకీయ విపక్షానికి క్రెడిట్ ఇవ్వొద్దనే ఆలోచన అయి ఉండొచ్చు.
ప్రభుత్వ వివక్ష కారణంగా తెలంగాణ ఉద్యమంలో ఏండ్ల తరబడి పాల్గొన్నవారు, తమ సమయాన్ని, సొమ్మును త్యాగం చేసినవారు ఈ వేళ ఇంటికే పరిమితమై లేదా ప్రేక్షకులుగా మిగిలిపోవడం అసలైన విషాదం. రాజకీయపరంగా వైరుధ్యాలుండి, ఉన్న విషయాన్నీ కూడా ఒప్పుకొనేందుకు మనసు రాకపోవచ్చు కానీ, రాజకీయాలకు దూరంగా ఉంటూ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఎంద రో ఇప్పుడు ఈ ఉత్సవం తమది కానట్టుగా, పరాయివాళ్లు ఫలితాన్ని అనుభవిస్తున్నట్టుగా కనిపించారు. వేదికలపై తెలంగాణ ఏర్పాటు ను బలంగా చెప్పినవాళ్లు, టీవీ చర్చల్లో దీటు గా మాట్లాడినవాళ్లు, పత్రికల్లో వరుసగా మద్ద తు వ్యాసాలు రాసినవాళ్లు, కవులు, కళాకారులు, వారి సంఘాలు, పాటగాళ్లు, ఆటగాళ్లు ఇలా ఎన్నోవిధాలా ఉద్యమానికి ఇంధనంగా పనిచేసినవాళ్లు దశాబ్ది ఉత్సవాల్లో అనామకులుగా మిగిలిపోవడం నిజంగా విచారకరం. ప్రజల్లో వారి గుర్తింపునకు కొదువ లేకున్నా తమ సాధ్య ఫలానికి దూరంగా ఉండటం మనసు నొచ్చుకునే విషయమే.
తెలంగాణ పోరులో సాంస్కృతిక కార్యక్రమాలకు రసమయి బాలకిషన్ పెట్టింది పేరు. ఆయన గజ్జెకట్టి ధూంధాం నిర్వహించని వేదిక లేదు. అంతడుపుల నాగరాజు నృత్యనాటికలు అలరించేవి. జయరాజ్ పాటలు టీవీల్లో మార్మోగేవి. దేశపతి శ్రీనివాస్ గొంతెత్తితే సభికులు మంత్రముగ్ధులయ్యేవారు. తెలంగాణ రచయితల వేదిక తరఫున జూలూరు గౌరీశంకర్, జూకంటి జగన్నాథం కవులను సమాయత్తం చేసేవారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ ఆకాంక్షను ప్రకటించే కవితలతో భారీ సంకలనాలు తెచ్చారు. సంగిశెట్టి శ్రీనివాస్ తన చారిత్రక పరిశోధనతో తెలంగాణ ఘనకీర్తిని వెలికితీశారు.
బీఎస్ రాములు ఎడతెగకుండా తెలంగాణ చరిత్ర, సాహిత్యం, సంస్కృతులను ప్రతిబింబించే ఎన్నో పుస్తకాలను ప్రచురించారు. ఘంటా చక్రపాణి, దాసోజు శ్రవణ్, విఠల్, రఘు తదితరులు టీవీ డిబేట్లలో ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని, ఆంధ్ర పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ వాదించారు. టీఎన్జీఓల సారథిగా స్వామిగౌడ్ సమర్థ నాయకత్వాన్ని పోషించి సమ్మెలను విజయవంతంగా నడిపారు. కేశవరావు జాదవ్, బూర్గుల నర్సింగరావు లాంటి పెద్దలు తొలి, మలి ఉద్యమాలకు తోడుగా ఉన్నారు. కోదండరాం జేఏసీల కన్వీనర్‌గా రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆర్.విద్యాసాగర్ రావు తెలంగాణ నీటి వనరులపై స్పష్టతనిచ్చి ‘నీళ్లు నిజాలు’ బహిర్గత పరిచారు. జయశంక ర్ సార్ తెలంగాణ జనానికి ప్రాతఃస్మరణీయులు.
తెలంగాణను కీర్తించే పాటను అందెశ్రీ రాస్తే నేల దుఃఖాన్ని పేర్కొనే పాటలెన్నో వచ్చాయి. గద్దర్ ‘పొడుస్తున్న పొద్దు మీద..’, నందిని సిధారెడ్డి ‘నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ’, జయరాజ్ ‘వానమ్మా..’ తదితర పాటలు జనం గుండెల్లో తెలంగాణ కాంక్షను రగిలించాయి. మన పత్రిక మన గౌరవం పేరిట మొదలైన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు ఎడిటర్‌గా అల్లం నారాయణ ఉద్యమానికి అక్షర దీప్తిని అందించారు. ఎన్ని పేర్లు ఎత్తుకున్నా ఒడువని ముచ్చట ఇది. వీరిలో చాలామంది పదవుల ను, ప్రతిఫలాన్ని ఆశించలేదు. తమ కళ్లతో తెలంగాణ సాకారాన్ని చూడగలిగామనే సంతృప్తి వారికి చాలు. ఇందరి త్యాగధనుల శ్రమఫలం స్వరాష్ట్రం. తెలంగాణ సౌధంపై ఏదో ఓ రాయిపై వీరి పేరు ఉంటుంది. పాలకులెవరైనా వాటిని చెరిపేయలేరు.
– బి.నర్సన్ 94401 28169