‘ఆరంభింపరు నీచ మానవులు..’ పద్యాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో పదే పదే వల్లె వేసేవారు. ‘నీచ మానవులు సత్కార్యానికి నడుం కట్టరు. కొంతమంది నడుం కట్టినా మధ్యలోనే వదిలేస్తారు. వారు మధ్యములు. కానీ, ధీరులు తమ గమ్యం వైపు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వారే విజయం సాధిస్తారు…’ అని ఆయన తరచూ చెప్తుండేవారు. ఈ మాటలు కేసీఆర్ పాలనా తీరుకు, రేవంత్‌రెడ్డి పాలనా తీరుకు మధ్య ఉన్న తారతమ్యానికి సరిగ్గా సరిపోతాయి. ధీరుడి వలె సత్కార్యాలను చేపట్టిన కేసీఆర్ ఎన్ని విఘ్నాలు ఎదురైనా అదరక, బెదరక వాటిని గమ్యానికి చేర్చారు. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ అసలు సత్కార్యాలనే చేయడం లేదు. ఒకటీ, అరా చేస్తున్నా వాటిని మధ్యముల వలె యూటర్న్ తీసుకొని మధ్యలోనే వదిలేస్తున్నారు.
రాష్ట్రంలో పాలనాపగ్గాలు చేపట్టిన నాటినుం చి రేవంత్ సర్కారుది ఇదే తీరు. ఒక నిర్ణ యం తీసుకోవడం.. దానిపై వ్యతిరేకత రాగానే యూటర్న్ తీసుకుంటున్నారు. తాజాగా సినిమా టికె ట్ రేట్లపై తీసుకున్న నిర్ణయం ఆ కోవకు చెందినదే. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి మరో అడుగు ముందుకేసి సినిమా బడ్జెట్‌తో తమ కు సంబంధం లేదని, దేశభక్తి, తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న చిత్రాలకే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తామని చెప్పా రు.
అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సర్కార్ ప్రగల్భాలు పలికిన కొన్ని రోజుల కే మాట మార్చి యూటర్న్ తీసుకున్నది. దీంతో ప్రేక్షకులను దోపిడి చేయడాన్ని సహించబోమని చెప్పిన మాట ను తెరమరుగు చేసి అసలు సిసలు దోపిడికి తెరలేపారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నా వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా బెనిఫిట్ షోలకు పర్మిష న్ ఇవ్వడం ఏమిటని నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు. సినిమా వాళ్లు మూటలు ముట్టచెప్పారు కాబట్టే వెంటనే బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం హైకోర్టుకు కూడా చేరడంతో సర్కారుకు చివాట్లు పెట్టింది.
ఈ ఒక్క విషయమే కాదు, కాంగ్రెస్ పాలనలో మొదటి నుంచి యూటర్న్ల పర్వమే కొనసాగుతున్నది. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించినప్పటికీ.. ఆ మాట తామెప్పుడు చెప్పామని, ఐదేండ్లలో భర్తీ చేస్తామని వాగ్దా నం చేశామని మంత్రి శ్రీధర్‌బాబు మాట మార్చేశా రు. ఉద్యోగాలు ఇవ్వనిపక్షంలో నెల నెలా రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంకా గాంధీ సాక్షిగా కాంగ్రెస్ వాగ్దానం చేసింది. కానీ, అధికారంలోకి రాగానే డిపూటీ సీఎం భట్టి… ‘నిరుద్యోగ భృతా? మేము ఆ హామీ అస్సలు ఇవ్వలేదు’ అని ప్లేట్ ఫిరాయించేశారు.
లగచర్లలో అల్లుడి ఫార్మా కంపెనీ కోసం రైతుల నోటి కాడి కూడు లాక్కోవాలని చూశారు. కానీ, అది కాస్త రచ్చకెక్కడంతో యూటర్న్ తీసుకొని ఫార్మా క్లస్టర్ కాదని మాట మార్చేశారు. మూసీ సుందరీకరణ వ్యయాన్ని డీపీఆర్ లేకుండానే మంత్రులు, ముఖ్యమంత్రి వేలం పాట పాడి ఏకంగా లక్షన్నర కోట్లకు పెంచేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకేమీ తెలియదన్నట్టు ‘లక్షన్నర కోట్లా? ఎవరు చెప్పారు’ అని అమాయకంగా మాట్లాడారు.
సర్కార్ తీసుకున్న నిర్ణయాలు యూటర్న్ పరంపరలో పరాకాష్ఠ అనే చెప్పుకోవాలి. రుణమాఫీ విషయం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.40 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందని కాంగ్రెస్ పాలకులు చెప్పారు. ఆ తర్వాత క్యాబినెట్లో రూ.32 వేల కోట్లు అని చెప్పి, బడ్జెట్లో రూ.26 వేల కోట్లు మాత్రమే ప్రవేశపెట్టారు. చివరికి సుమారు రూ.20 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకొన్నారు.
ఎన్నికల ముందు అందరికీ బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని ఆ పథకాన్ని బోగస్‌గా మార్చారు. ఇక రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ సర్కార్ రైతులకు చేసిన మోసం యూటర్న్ తీసుకొని సరాసరి దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. ఎన్నికల వేళ ‘ఇప్పుడు తీసుకుంటే రూ.10 వేలే, తర్వాత తీసుకుంటే 15,000’ అని చెప్పి ఇప్పుడు కనీసం ఆ రూ.10 కూడా ఇవ్వడం లేదు. 15 వేల హామీ కాస్త కుంచించుకుపోయి 12 వేలకు తగ్గింది. దసరా, దీపావళి, సంక్రాంతి.. ఇలా పండగల ముహూర్తాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఆ రైతు భరోసా మాత్రం రైతుల ఖాతాల్లో పడటం లేదు.
ఎన్నికల ముందు వరకు మేఘాను ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ సంస్థను నెత్తిన పెట్టుకున్నారు. సుంకిశాల ఘటనతోనే బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కూడా కట్టబెట్టి యూటర్న్ పర్వాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. ఇలా చెప్పుకొంటూ పోతే దేశంలో అతిపెద్ద జాతీయ రహదారి కన్యాకుమారి-కశ్మీర్‌పై ఉన్న యూటర్న్ల కంటే రేవంత్ సర్కార్ తీసుకున్న యూటర్న్‌లే ఎక్కువ ఉంటాయనడంలో సందేహం లేదు.
-డాక్టర్ బీఎన్ రావు ,98668 34717