రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ప్రహసనంగా మారింది. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెళ్లిన ప్రతిసారి ఆశావహుల జాబితాను పట్టుకొని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గత సంవత్సరన్నర కాలంగా మంత్రి వర్గ విస్తరణ అదిగో చేస్తాం ఇదిగో చేస్తామంటూ కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి.. అధిష్ఠానాన్ని మెప్పించటానికి అష్టకష్టాలు పడుతున్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీలో చర్చలు జరగటాన్ని ఈ రాష్ట్ర ప్రజలు వింతగా గమనిస్తున్నారు.
మంత్రివర్గానికి నాయకత్వం వహించి ఎవరిని తీసుకోవాలో ఎవరిని పక్కన పెట్టాలన్న నిర్ణయం మామూలుగానైతే ముఖ్యమంత్రుల చేతిలో ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమంత్రులు మాత్రం ఆ నిర్ణయాన్ని అధిష్ఠానానికి అప్పజెప్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య, వైఎస్సార్ సహా అంతకుముందున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సైతం మంత్రివర్గ కూర్పు, విస్తరణ కోసం అధిష్ఠానం దగ్గర చేతులు కట్టుకొని నిలబడిన సందర్భాలున్నాయి.
మంత్రివర్గ విస్తరణకు కేవలం రేవంత్‌రెడ్డి మాత్రమే ఆశావహుల జాబితా తయారు చేయట్లేదు. ఓ వైపు పీసీసీ అధ్యక్షుడు మరోవైపు ఇద్దరు ముగ్గురు సీనియర్ నాయకులు సైతం తాము తయారు చేసిన జాబితాతో రాహుల్ గాంధీని కలుస్తున్నారు. అసలు ప్రభుత్వ వ్యవహారాల్లో పీసీసీ అధ్యక్షుడి పాత్ర ఏమిటన్నది ముఖ్యమైన ప్రశ్న. కానీ అధిష్ఠానం మాత్రం రేవంత్‌రెడ్డితో పాటు, పీసీసీ అధ్యక్షుడు తెచ్చిన జాబితాను పరిశీలించటం ముఖ్యమంత్రిపై ఆ పార్టీకున్న గౌరవానికి సూచకం. రెండు గ్రూపులుగా చీలిపోయిన రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య అధిష్ఠానం సైతం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కాలం గడుపుతోంది.
ఇప్పటికే ఏడాదిన్నర కాలం గడిచిపోయింది. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికల కసరత్తులో ఉండిపోతారు. ఇక మిగిలింది రెండున్నరేళ్లు మాత్రమే. మంత్రివర్గ విస్తరణ చేసి రెండున్నరేళ్ల కాలానికి మాత్రమే పదవులు అనుభవించాలని తహతహలాడుతున్న వారికి రేవంత్‌రెడ్డి ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటికే ఉన్న మంత్రుల్లో కొందరు తమను మంత్రివర్గంలోంచి తీసేస్తారన్న లీకుల మధ్య ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. తమను ఎలాగైనా కొనసాగించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయం ప్రకారం కుటుంబంలోని ఒకే వ్యక్తికి ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ పదవులు ఇవ్వాలి. కానీ కోమటిరెడ్డి సోదరులు మాత్రం తమకు రెండు మంత్రి పదవులు ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు.
ప్రస్తుతం కీలకమైన హోం, శాంతి భద్రతల శాఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గరే ఉన్నది. ఆయన సరిగాదృష్టి సారించలేకపోవడంతో గతేడాదిలో నేరాల శాతం 22.53కు పెరిగింది. రాజధాని హైదరాబాద్‌లో ఏకంగా నేరాలు 44 శాతం పెరిగాయి. సాధారణ పరిపాలన సహా మిగతా శాఖలను తనవద్దే పెట్టుకున్న ముఖ్య మంత్రి కనీసం నెలవారీ సమీక్షలు కూడానిర్వహించటం లేదు. కీలకమైన న్యాయం, జైళ్లు, అగ్నిమాపక లాంటి శాఖలు సీఎం వద్దే ఉం డటం వల్ల పరిపాలనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రాష్ట్రం లో ప్రధానరంగాలైన పశు, మత్స్య సంవర్ధక శాఖలకు మంత్రి లేకపోవటం వల్ల విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటానికి అధికారులు సంకోచిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గుర వుతున్నారు.
మరోవైపు విద్యాసంవత్సరం ప్రారంభాని కి రెండు నెలల సమయమే మిగిలి ఉంది. ప్రభుత్వ స్కూళ్ల ఏర్పాట్లు చూడాల్సిన విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉంది. గత ఏడాది కాలంలో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం వల్ల చాలామంది విద్యార్థులు గురయ్యారు. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమం లాంటి శాఖలను ఎవరికీ కేటాయించకపోవటం వల్ల ఆయా వర్గాల అభివృద్ధి గాడితప్పుతోంది. కొందరు మంత్రులకు అదనపు శాఖలు ఇవ్వటంతో పర్యవేక్షణ లోపం వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణను పూర్తి చేసి… ప్రభుత్వ పాలన , ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి.ముఖ్యమంత్రి సైతం ప్రతిసారి ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానం ముందు సాగిలపడకుండా పాలనపై దృష్టిసారించాలి.
– మఠం బిక్షపతి, రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్