పాలమూరులో జరిగిన రైతు సదస్సులో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ‘మాదిగోళ్లు ఉన్నారా? డప్పులు కొట్టండి’ అంటూ కులం పేరుతో సంబోధించారు. ఇది ముమ్మాటికీ దళిత సమాజాన్ని అగౌరవపరిచినట్టేనని దళిత సమాజం అభిప్రాయపడుతున్నది. ఆ తర్వాత వెంటనే రేవంత్రెడ్డి తేరుకొని ‘పాలమూరు జిల్లా అంటేనే మాదిగోళ్ల జిల్లానయ్య…’ అంటూ తన వాక్ దోషాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
గ్రామాల్లో ఉన్నత కులాలుగా తమను తాము భావించుకునే కొన్ని కులాలవారు దళితులను ‘మాదిగోళ్లు’ అని అవహేళన చేస్తూ, దళిత సమాజాన్ని అవమానపరిచిన ఘటనలు చరిత్రలో ఎన్నో జరిగాయి. ఈ నేపథ్యంలో దళితులను కులం పేరిట పిలవటం లేదా దూషించటం చట్ట రీత్యా నేరమని పేర్కొంటూ రూపొందిన పలు చట్టాలు దళిత సమాజాన్ని రక్షించాయి.
బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి హుందాగా మాట్లాడాల్సింది పోయి కుల ప్రస్తావన తీసుకురావటం, కుల వృత్తిని ఎత్తిచూపటం ఖండనీయం. మాదిగలంటే కేవలం చెప్పులు కుట్టడం, డప్పులు కొట్టడం అనే పాత చింతకాయ పచ్చడి ధోరణి ఇకనైనా మారాలి. నేడు మాదిగలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మాదిగల్లో విద్యావంతులున్నారు, మేధావులున్నారు. తమ జాతి ఎదుర్కొంటున్న వివక్షపై నిలదీసే ఆధునిక అంబేద్కర్లు కూడా ఉన్నారు. మాదిగలంటే డప్పులు కొట్టేవాళ్లు కానే కాదు. మాదిగలంటే మహారాజులు, ఆదిజాంబవ బిడ్డలు. ఈ నేపథ్యంలో మాదిగలను డప్పులు కొట్టేవాళ్లుగా మాత్రమే చూసే ధోరణి ఇకనైనా మారాలి.
-వీ.ధనంజి, 96661 09616