ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు జిల్లా పరిపాలన భవనాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. అనేక శాఖలు వేర్వేరు చోట్ల విసిరేసినట్లుగా కిరాయి భవనాల్లో కొనసాగేవి. ప్రజలు పనుల మీద నానా ఇబ్బందులుపడి జిల్లా కేంద్రానికి వెళ్లినా.. సంబంధిత కార్యాలయాన్ని దొరకబట్టడం కష్టమయ్యేది. ఆఫీసుల అడ్రస్ కనుక్కునేసరికి టైమంతా అయిపోయేది.
ఒకప్పుడు కలెక్టర్ ఆఫీసుకు వెళ్లాలంటే జిల్లా చివరి గ్రామాల ప్రజలకు నరకం కనిపించేంది. కనీసం నాలుగైదు గంటలు ప్రయాణించాల్సి వచ్చేది. నేరుగా బస్సు సౌకర్యం లేనివారైతే కనీసం రెండు, మూడు బస్సులు మారాల్సి వచ్చేది. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్వరాష్ట్రంలో ప్రజలకు పాలనను చేరువ చేయాలని, అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని తెలంగాణ ఉద్యమ సారథి, ప్రభుత్వాధినేత సీఎం కేసీఆర్ భావించారు. ఆ మేరకు 2016లో జిల్లాల పునర్వ్యస్థీకరణకు శ్రీకారం చుట్టారు.10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా చేయడంతోపాటు అనేక కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. అధిక గిరిజన జనాభా గల మహబూబాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేశారు. ప్రజలకు అన్ని శాఖలు ఒకే దగ్గర అందుబాటులో ఉండాలనే సంకల్పంతో జిల్లాలకు కొత్త కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టారు.
ఈ సందర్భంగా ఉమ్మడి ఏపీలో నేను అనుభవించిన ఒక సంఘటన గుర్తు చేసుకుంటున్నా. మాది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మారుమూల కన్నెగుండ్ల గ్రామం. ఇది ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఉండే గ్రామం. మా ఊరు నుంచి మహబూబాబాద్‌కు 50 కిలోమీటర్లు, వరంగల్కైతే 150 కిలోమీటర్లు. ఊరికి కనీసం బస్ సౌకర్యం కూడా లేదు. అక్కడ నుంచి మహబూబాబాద్‌కు వచ్చి ఇంటర్ చదువుకునేవాడిని. ఆ రోజుల్లో నాకు స్కాలర్షిప్ మంజూరు కాలేదు. ఎక్కడ అడగాలో కూడా తెలియదు. వరంగల్ కలెక్టర్ ఆఫీస్‌లోని స్కాలర్షిప్ సెక్షన్లో అడగమని మా లెక్చరర్ నాకు సలహా ఇచ్చారు. అదే సమయంలో మా నాన్నకు ఎస్సీ కార్పొరేషన్లో కూడా పని ఉంది. ఇద్దరం కలిసి ఊరి నుంచి పొద్దు పొద్దున్నే 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్‌కు బయల్దేరినం. స్కాలర్షిప్ సెక్షన్ ఇన్చార్జిని కలుద్దామని ఆఫీసుకు వెళ్తే ఆ రోజు అతను కొంచెం బిజీగా ఉండటం వల్ల అక్కడే సమయం వృథా అయ్యింది. ఎస్సీ కార్పొరేషన్ వేరే చోట ఉండటం వల్ల అక్కడికి వెళ్లడానికి సమయం లేక వెళ్లలేదు. మళ్లీ ఊరికి పోయి వస్తే డబ్బులు ఖర్చవుతాయి. సమయం కూడా వృథా అవుతుందని భావించి లాడ్జిలో పడుకొని మార్నింగ్ మళ్లీ ఆఫీస్‌కు వెళ్లాం. వారికి పని ఒత్తిడి ఉండటం వల్ల మా పని మరుసటి రోజు కూడా కాలేదు. ఏం చేయాలో తోచలేదు. ఎంతో దూరం నుంచి కలెక్టర్ కార్యాలయానికి వస్తే పని కాలేదు అని బాధపడ్డాం.
ఇటువంటి బాధలు తెలంగాణ వచ్చిన తర్వాత లేకుండా పోయాయి. ప్రజల సౌకర్యార్థం సీఎం కేసీఆర్ అన్ని శాఖలను ఒకే చోట ఉండేలా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు ఎన్ని పనుల మీద జిల్లా కేంద్రానికి వెళ్లినా అన్ని పనులూ ఒకే రోజు పూర్తి చేసుకుంటున్నారు. కలెక్టర్ కార్యాలయం సామాన్యునికి కూడా దగ్గరయింది అని చెప్పటానికి నూతన కలెక్టరేట్లే నిదర్శనం. ప్రభుత్వ సేవలు అన్నీ సింగిల్ విండో పద్ధతిలో ఒకేచోట అందుబాటులోఉంటున్నాయి. దీంతో ప్రజలు అటు ఇటు వెళ్లాల్సిన అవసరం లేకుం డా అన్ని పనులు ఒకే చోట పూర్తి చేసుకునేందుకు వీలవుతుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కలెక్టరేట్ల నూతన భవనాలు పూర్తయి అందుబాటులోకి వచ్చా యి. వీటిని అత్యాధునిక హంగులతో, చుట్టూ పచ్చదనంతో తీర్చిదిద్దారు.
-డా. బొల్లికొండ వీరేందర్
98665 35807