రంగారెడ్డి, జూలై 1 (నమస్తే తెలంగాణ) : అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పసుమాముల గ్రామంలో సర్వే నం.386లో 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో ఫ్రీడమ్ ఫైటర్స్‌కు 30 ఎకరాలు, 20 ఎకరాల భూమిని ప్లాట్లు చేసి బడుగు, బలహీన వర్గాలకు గత ప్రభుత్వం కేటాయించింది. ఇంకా మిగిలిన పదెకరాల భూమిపై కబ్జారాయుళ్ల కన్నుపడింది. పదెకరాల్లో ఇప్పటికే ఆరు ఎకరాలు కబ్జాకు గురికాగా, మిగిలిన నాలుగెకరాల భూమి కళానగర్‌కు సమీపంలో ఉన్నది.
ఈ భూమిని ఎలాగైనా కాజేసేందుకు అధికార పార్టీ నేతల అండదండలతో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఈ భూమిపై కన్నేసిన కొంతమంది కబ్జా చేసి ప్రీకాస్ట్ వాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల ఓ అధికారపార్టీ నేత, మరికొందరు కలిసి ఓ సామాజిక వర్గానికి చెందిన కమ్యూనిటీ భవనానికి కేటాయించారని.. గతంలో చేసిన ప్లాట్లను సైతం తొలగించి కబ్జా చేస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ మండలంలో పసుమాముల, పిగ్లీపూర్, తారామతిపేట, కొహెడ, బ్రాహ్మణపల్లి, బాటసింగారం తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములను రాత్రికి రాత్రే కబ్జారాయళ్లు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
బాటసింగారంలో..
మరోవైపు బాటసింగారం గ్రామంలోని పండ్ల మార్కెట్‌కు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి, అందులో గుడి నిర్మించి.. మిగిలిన భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో పసుమాముల, పిగ్లీపూర్, తారామతిపేట, కొహెడ, బ్రాహ్మణపల్లి, బాటసింగారం తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములను రాత్రికిరాత్రే కబ్జారాయళ్లు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.