నగరంలో ప్రజా రవాణాను పూర్తిగా గాలికొదిలేసిన ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు మెట్రో రెండో దశ విస్తరణపై ఆర్భాటపు ప్రకటనలు చేసిన రేవంత్ రెడ్డి సర్కారు.. ఇప్పుడు కనీసం ఉన్న మెట్రో రైళ్లలో రద్దీని నియంత్రించడంలో పూర్తిగా విఫలమైంది. మెట్రో విస్తరణ అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే కోల్డ్ స్టోరేజీలో వేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. కనీసం ప్రయాణికుల ఇబ్బందులను కూడా పట్టించుకోవాలంటూ ప్రజా సంఘాలు ఘాటుగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు ప్రభుత్వ కార్యదర్శికి బహిరంగ లేఖ రాశారు.
సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ) హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రస్తుతం సగటున రోజుకు 4.5-5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఐటీ ఉద్యోగులు, సాధారణ శ్రా మికులు, విద్యార్థులు, మహిళలు మెట్రో రవాణాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే పీక్ అవర్స్‌లో మెట్రో రైళ్లలో కాలుపెట్టే పరిస్థితి లేకపోవడంపై ప్రజా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. రైళ్ల సామర్థ్యం ప్రయాణికుల డిమా ండ్‌కు తగినట్లుగా లేకపోవడం వల్ల మెట్రో స్టేషన్లు జనాలతో కిక్కిరిపోతున్నాయని విమర్శించారు.
మెట్రో నెట్‌వర్క్‌ను కొత్త ప్రాంతాలకు విస్తరించడానికి వేల కోట్లు ఖర్చు చేయాలంటూ కాలయాపన చేస్తున్న ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న లైన్లలో ప్రయాణికుల కనీస సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం లేదని సిటిజన్స్ ఫర్ బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రతినిధి డా. దొంతి నరసింహా రెడ్డి, అర్బన్ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధి ఎం శ్రీనివాస్, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరమ్ సభ్యులు కే. వీరయ్య, శ్రీనివాస్‌లు ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు అదనపు బోగీలను కొనుగోలు చేయడానికి ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు.
భారీ ప్రాజెక్టు వ్యయంతో పోలిస్తే అదనపు బోగీల కొనుగోలుకు అయ్యే ఖఱ్చు చాలా తక్కువనీ, దీనిపై సర్కారు దృష్టి పెట్టాలన్నారు. యుద్ధప్రాతిపదికన అదనపు బోగీలను మెట్రో రైళ్లకు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. అత్యంత రద్దీగా ఉండే కారిడార్లలో వెంటనే ఈ అదనపు కోచ్‌లను ప్రవేశపెట్టడం ద్వారానే ఐటీ కారిడార్ ఉద్యోగులకు, సాధారణ ప్రయాణికులకు ఊరట లభిస్తుందనీ, ప్రయాణం కూడా మరింత సౌకర్యంగా సురక్షితంగా సాగుతుందనీ స్పష్టం చేశాయి. ప్రభుత్వం ప్రకటనలను తగ్గిం చి, ప్రయాణికుల కష్టాలను తీర్చేందుకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశాయి.