పురాణాల్లో ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు దేవతలు యజ్ఞాలు,యాగాలు,మంచి పనులు చేస్తుంటే రాక్షసులు వాటికి అడ్డుపడేవారు. రాజుల కాలంలో కూడా ఎన్నో యుద్ధాలు జరిగేవి. అద్భుతంగా ప్రజలకు సేవ చేస్తూ రాజ్యాలను ఏలుతున్న రాజులపై దుష్టశక్తులంతా ఏకమై కుట్రలతో ఆ రాజును ఓడించేందుకు ప్రయత్నించేవారు. కానీ విజయం ఎప్పుడూ ధర్మం వైపే ఉండేది. ఆలస్యమైనా ధర్మం, న్యాయం విజయం సాధించేవి. ధర్మయుద్దం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది కూడా ధర్మయుద్ధ్దమనే చెప్పవచ్చు.
కేసీఆర్ లాంటి గొప్ప విజన్ ఉన్న నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఉంటే, 70 ఏండ్లుగా దేశ అభివృద్ధిని మరిచి రాజకీయమే ఎజెండాగా ప్రజల ఆశలు ఆశయాలను విస్మరించిన రెండు జాతీయ పార్టీ లు వాటి తోక పార్టీలు ఒకవైపు నిలిచాయి..ఈ ధర్మయుద్ధం లో గెలుపెవరిది..ధర్మం ఎవరిది? మోసం ఎవరిది..?
ధర్మం అంటే మంచికి సంకేతం..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పరిస్థితులు ఎట్లుంటుండే ఒకసారి బేరీజు వేసుకోవాలి. రైతు వ్యవసాయం చేయాలంటే ఎన్ని ఆటంకాలు..కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు, పండించిన కొద్దో గొప్ప పంటను కొనే దిక్కుండదు.ఎరువుల కోసం చెప్పులు లైన్లలో పెట్టి నిరీక్షించే పరిస్థితి. కరెంట్ అడిగితే కాల్చిచంపే దుస్థితి..కాంగ్రెస్ పాలనలో నెర్రెలుబారిన నేలలు, కాంట్రాక్టుల కక్కుర్తి, కమీషన్ల బాధ తప్ప రైతును పట్టించుకున్న పాపాన పోలేదు. కరెంట్ తీగల మీద బట్టలెండేసుకోండని ఒకనాయకుని మాట. వ్యవసాయం దండుగ అని మరో నా యకుని మాట. సుదీర్ఘకాలం ఉమ్మడి రాష్ర్టాన్ని ఏలిన నాయకులు తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. రాక్షసుల్లా ఈ ప్రాంతాన్ని ముప్పుతిప్పలు పెట్టారు..తెలంగాణ ప్రాంతంపై వివక్ష, నీళ్ల తరలింపు, నిధుల తరలింపు, హక్కుగా రావాల్సిన వాటా ఇవ్వకుండా తెలంగాణను ఆగం చేసిర్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
కేసీఆర్ నాయకత్వంలో ఉవ్వెత్తున సాగిన ఉద్యమం, తెలంగాణ ప్రజల ధిక్కారం వెరసి స్వరాష్ట్ర కల సాకారమైంది. ప్రజల ఆకాంక్షలు నెరవేరటానికి యుగానికొక్కడు పుడుతుంటాడు. తెలంగాణను బాగు చేయటానికి ఈ యుగంలో పుట్టిన నాయకుడు కేసీఆర్.
ఏం చేసిండు కేసీఆర్? ఎందుకు మనం ఆయనను గెలిపించాలి? ప్రతి ప్రశ్నకు ప్రజల్లోనుంచే సమాధానం వస్తున్నది. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధిపొందిన ప్రజలే బీఆర్ఎస్కు స్టార్ క్యాంపెయినర్లు. వారే రేపు కేసీఆర్‌ను గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంత అభిమానం ప్రజల్లో ఉండటానికి కారణం లేకపోలేదు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన రూపొందించిన పథకాలు దేశానికే తలమానికంగా నిలిచాయనటంలో అతిశయోక్తి లేదు. కొన్ని కార్యక్రమాలు కేసీఆర్ మానవతా కోణాన్ని, ఆలోచనా విధానాన్ని, ప్రజలపట్ల ఆయనకున్న కమిట్మెంట్ను చాటి చెప్పాయి. ఆడబిడ్డకు మేనమామగా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ముసలవ్వల ఆత్మగౌరవం పెంచుతూ రెండువేల పింఛను, వికలాంగులకు పింఛన్లు, రైతన్నలకు వ్యవసాయాన్ని పండుగ చేస్తూ రైతుబంధు, రైతుబీమా, ఇంటింటికి మిషన్ భగీరథ నల్లా నీళ్లు ఇస్తున్నారు.
ఇలాంటి గొప్ప కార్యక్రమాలెన్నో అద్భుతంగా అమలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సంక్షేమంలో నెంబర్ వన్‌గా నిలిపారు. అన్ని వర్గాల ప్రజలకు లాభం జరిగేలా పథకాల రూపకల్పన అమలు తీరు ప్రజల్లో కేసీఆర్‌కు మరింత ఆదరణను తెచ్చిపెట్టింది. ప్రభుత్వ దవాఖానలు, పాఠశాలల బలోపేతం, కొత్త బడులు, దవాఖానల నిర్మాణంతో పేదలకు వైద్యం, విద్యను చేరువ చేశారు కేసీఆర్. మొదటి టర్మ్‌లో వ్యవసాయం, సాగునీరు, తాగునీటికి ప్రాధాన్యం ఇచ్చి విజయం సాధించారు. రెండవటర్మ్లో వైద్యం, విద్య ను అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఈ అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాష్ర్టాన్ని పరిపాలించాలి. అప్పుడే తెలంగాణ పునర్నిర్మాణం సంపూర్ణమవుతుంది.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అంటూ కొత్తరాగం అందుకున్నది. 60 ఏండ్లు ఈ ప్రాంతాన్ని పాలించి ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందని ప్రజలెలా నమ్ముతారు. పారదర్శకత లేని గ్యారెంటీలతో ఆశపెడ్తే మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడం అసాధ్యం. మ్యానిఫెస్టో రూపొందిస్తే ఆచరణ సాధ్యమయ్యేదిగా ఉండాలి. గత ఎన్నికల్లో కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను దాదాపు మొత్తం పూర్తి చేసిండు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నోటికి ఏదివస్తే అది హామీ ఇచ్చి కర్ణాటకలో నాలుకకరుచుకున్నది. ఆ ప్రాంత రైతులను కాంగ్రెస్ మోసం చేస్తే ఇక్కడ కొచ్చి పోరాడుతున్నరు.
కాంగ్రెస్‌ను నమ్మవద్దంటూ కర్ణాటకలో తమకు జరిగిన అన్యాయాన్ని ఇక్కడి ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ గతంలో ప్రజలను ఎలా మోసం చేసిందో తెలియనిది కాదు. వారి స్కాములు యావత్ దేశం చూసింది. అలాంటి స్కాముల కాంగ్రెస్ వైపు ఉంటారా? అభివృద్ధి చేసే బీఆర్ఎస్ వైపు ఉంటారా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.
కేసీఆర్ ఉద్యమం, పునర్మిర్మాణంలో ధర్మం వైపు నిలబడ్డా రు. చేసేది చెప్పారు. చెప్పిందే చేస్తున్నారు. ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని హామీలు కూడా పూర్తి చేసి చూపిస్తున్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ఏంటో దేశాన్నడిగితే చెప్తుంది. మ్యానిఫెస్టో రూపకల్పన సైతం అద్భుతంగా చేశారు కేసీఆర్. ఏది చేయగలమో అది మాత్రమే చెప్పారు. కాంగ్రెస్, బీజేపీల్లాగా మోసపూరిత హామీలను ఇవ్వలేదు. పింఛన్లు దశలవారీగా పెంపు నిజాయితీతో కూడిన ప్రకటన. రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఒక విప్లవాత్మక నిర్ణయం, గ్యాస్ సబ్సిడీ ఆడబిడ్డలకు మంచి కానుక. అన్నింటికి మించి ప్రతి కుటుంబానికి బీమా, పేదల ఆరోగ్యం కోసం రూపొందించిన కార్యక్రమాలు పేదల గడప గడపకు చేరాయి. ఎలాగూ గెలువలేమని కాంగ్రెస్, బీజేపీలు నోటికి ఏది వస్తే అది చెప్పి ప్రజలను మభ్య పెట్టజూస్తున్నాయి. కానీ ప్రజలేం అమాయకులు కారు.
కేసీఆర్ తెలంగాణ ఆత్మ. తన జన్మను తెలంగాణకు అంకితం చేసిన యుగపురుషుడాయన..తెలంగాణ చరిత్ర చెప్పాల్సి వస్తే కేసీఆర్‌కు ముందు తర్వాత అని చెప్పవచ్చు. తెలంగాణను ఆయనలా ఎవ రూ ప్రేమించలేరు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఎన్నికల రూపంలో జరుగుతున్న ఈ ధర్మయుద్దంలో అంతిమ విజయం న్యాయం వైపు, ధర్మం వైపు నిల్చున్న కేసీఆర్, బీఆర్ఎస్దే. కుట్రలు,కుతంత్రాలు, అసత్యాలు ఎప్పటికి విజయం సాధించలేవు. ఇది ధర్మయుద్ధం. కేసీఆర్ విజయం తథ్యం.
కేసీఆర్ ఉద్యమం, పునర్మిర్మాణంలో ధర్మం వైపు నిలబడ్డారు. చేసేది చెప్పారు. చెప్పిందే చేస్తున్నారు. ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని హామీలు కూడా పూర్తి చేసి చూపిస్తున్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ఏంటో దేశాన్నడిగితే చెబుతుంది.మ్యానిఫెస్టో రూపకల్పన సైతం అద్భుతంగా చేశారు కేసీఆర్. ఏది చేయగలమో అది మాత్రమే చెప్పారు.
– తెలంగాణ విజయ్ 94919 98702