మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలుపు కోసం జోరుగా నగదు, బంగారం పంపిణీ చేస్తున్నాయి. ఒకరకంగా చెప్పాల్నంటే గెలుపు కోసం మునుగోడు సాక్షిగా సర్కస్ ఫీట్లు చేస్తున్నాయి. బీజేపీ తరఫున బండి సంజయ్ సర్కస్ కంపెనీ తెరిస్తే, కాంగ్రెస్ తరఫున రేవంత్‌రెడ్డి తోలుబొమ్మలాట మొదలువెట్టిండు. మేమేమన్న తక్కువ తిన్నమా అని కోదండరాం పిట్టకథలు, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బుర్రకథలు చెప్తున్నారు. ఇక తెలంగాణ బద్ధ వ్యతిరేకి అయిన వైఎస్ఆర్ తనయ షర్మిళ జగన్నాటకాలు ఆడుతున్నది. ఇలా.. ఒక్కరేంటీ తెలంగాణకు జై అన్నోడు, నై అన్నోడు, అంగి కురుసోడు, పొడుగు నెక్కరోడు ఈస్ట్‌మన్ కలర్ సినిమా చూపెడుతున్నరు.
మునుగోడు అభివృద్ధి, ప్రజల గోడు, వ్యవసాయం, కులవృత్తులు, చేతివృత్తుల గురించి ఏ మాత్రం అవగాహన లేని ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. అంతెందుకు ఢిల్లీ నుంచి ఏది రాసిస్తే దాన్ని అక్షరం పొల్లు పోకుండా ధారాళంగా చిలుకపలుకులు పలికే కొత్తరకం అంబాసిడర్లు బయల్దేరారు. అంతా 15 రోజుల థ్రిల్లర్ సినిమా కంపెనీల స్వభావమే. ముందే లీకైన కట్టుకథలు. అయినా తెలంగాణలో సర్కస్ కంపెనీ చెప్పినట్లు ప్రదర్శనలిచ్చి ప్రవచనాలు చెప్పడం ప్రతి ఒక్కరికి అలవాటైంది.
దశాబ్దాల పాటు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జీవచ్ఛవాలుగా మారిన పరిస్థితి నల్లగొండ బిడ్డలది. ఫ్లోరైడ్ నివారణ కోసం ఉద్యమించడమే కాకుండా కేంద్రంపై ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సం దర్భంలో చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్‌లో ఫ్లోరైడ్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటుచేయాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. అయితే దాన్ని బెంగాల్‌కు తరలించింది నాటి ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమ సమయంలో నల్లగొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ఫ్లోరైడ్‌తో కాళ్లు, చేతులు వంకర్లు పోయిన వాళ్లను చూసి చలించిపోయారు. ఆ సందర్భంగానే ‘చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ’ అనే పాట రాసిండు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిండు. ఇంటింటికీ మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీరు అందించి నల్గొండ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చారు.
‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నారు పెద్దలు. నేటి కేంద్ర ప్రభుత్వ విధానాలు చూస్తుంటే తమకు అధికారం శాశ్వతమని భ్రమిస్తున్నది. చట్టాలను చుట్టాలుగా మార్చుకొని అక్రమ విధానాలను తమ అధికార రక్షణ వలయంగా ఎంచుకుంటు న్నది. తద్వారా కేంద్ర పాలకులు తాము ప్రజాస్వామ్య దేశంలో ఏలికలమని మరిచిపోతున్నరు. నిండా 15 రోజులులేని సర్కస్‌లో ఓటర్ను ఎలా కొనాలో వేసే ఎత్తుగడలే అసలు సిసలు ప్రజాస్వామ్యంగా భావిస్తున్నది.
మత విద్వేషాలకు తెలంగాణ అడ్డా కాదనే విషయం బీజేపీ తెలుసుకోవాలి. నూతన సమాజాన్ని నిర్మించడానికి సాధికారిత రాజకీయాలకు గట్టి మద్దతు ఇక్కడినుంచే ప్రారంభమైంది. దళిత, బహుజనుల చైతన్యం దక్షిణాదిలో ఎక్కువే. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ఓటు చీలిపోయి టీఆర్ఎస్కు అనుకూలంగా మారుతుందన్న కుట్రతో సర్కస్ కంపెనీ (బీజేపీ)తో అంటకాగుతున్నందునే సోయిలేని జన సమితి, బీఎస్పీ, వైఎస్ఆర్టీపీలను పోటీలో దించిందనే అభిప్రాయం మేధావుల్లో ఉన్నది. ఆరంభం అద్భుతంగా ఉన్నప్పటికీ, యూపీ తరహాలో సర్కస్ కంపెనీతో ప్రయాణం వల్ల దళిత, బహుజనుల ఆశలు ఆవిరైనట్టేననే విషయం తొందరలోనే తెలిసివస్తుంది. అనుమానాలన్నీ దూదిపింజల్లా తేలిపోతే 2023లో బీజేపీని ఏ ఒక్క పార్టీ దరిచేరనివ్వదు.
ఒక వ్యక్తి స్వార్థం కోసం, అహంకారంతో, అధికార దాహంతో తెచ్చిన ఉప ఎన్నికల్లో బీజేపీ విలువల వలువలు ఒలిచివేస్తున్నది, సమాఖ్యస్ఫూర్తిని దెబ్బతీసి, ప్రజాస్వామ్యాన్ని గేలిచేస్తున్న బీజేపీ సర్కార్‌కు కర్రు కాల్చి వాతలు పెట్టేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నరు. హుజూర్నగర్, నాగార్జునసాగర్‌లో నామాలు పెట్టింది సరిపోలే పాపం. ఇది నిఖార్సయిన ఎర్రగొండ. అరువై ఏండ్లు దగా పడ్డ ఫ్లోరైడ్ బండలో కులం, మతం పేరుతో రాజకీయాలు చెల్లవు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలు ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఎలాగైనా గెలిచి రాష్ట్ర ప్రభుతాన్ని బలహీనపర్చడానికి వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి కోవర్టులుగా మార్చుకొని యుద్ధానికి దిగింది. ఉపఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇచ్చి 15 మందిని కొనుగోలు చేయాలని బేరసారాలకు దిగడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. పదవులు, డబ్బులకు లొంగకపోవడంతో బీజేపీ ఎదురుదా డికి దిగుతున్నది. టీఆర్ఎస్ ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టింది. కానీ ఈ సర్కస్ కంపెనీలు ఏం చేశాయని మమ్మల్ని ఓట్లు అడుగుతున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ప్రజాబలంతో గెలవలేక రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డుపెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తున్నదని విమర్శి స్తున్నారు. మునుగోడులో ఓడిపో తామనే భయంతోనే బీజేపీ టీఆర్ఎస్ నాయకులకు ఎరవేసింది. ఈ తతంగమంతా బయటపెట్టాక నంగనాచి మాటలతో తప్పించుకోజూస్తున్నది. ప్రజల కోసం పనిచేసేవారినే విజయం వరిస్తుందని బీజేపీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకోవాలి.
(వ్యాసకర్త : కేయూ జర్నలిజం శాఖ విభాగాధిపతి)
ఉద్యమ సమయంలో నల్లగొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ఫ్లోరైడ్‌తో కాళ్లూచేతులు వంకర్లు పోయిన ప్రజలను చూసి చలించిపోయారు. ఆ సందర్భంగా ‘చూడు చూడు నల్లగొండ.. గుండె నిండా ఫ్లోరైడ్ బండ’ అనే పాట రాశారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపిండు.
డా.సంగని మల్లేశ్వర్ 98662 55355