చెల్లని నోటును
చల్లగా చెలామణి చేయాలని
ఖమ్మంగా మాట్లాడటం మొదలుపెట్టారు
రంగులు మార్చడం
ఊసరవెల్లినీ మించి
ప్రాంతానికో మాస్క్ కప్పుకొని వస్తారు
ప్రేమను కొంత అతికించుకుని
పాత్రలు కొన్నింటిని
ప్రత్యేక ఆఫర్లో కొని
పాత హైటెక్ నాటకానికి తెరలేపుతారు
తెలుగు భాషను ముందేసి
పదే పదే పాత సెంటిమెంట్ గుర్తుచేసి
పబ్బం గడుపుకొంటూ తిరుగుతారు
అంతా భాయ్ భాయ్ అంటూ
బ్యాలెట్ బాక్స్ దాకా నడిపిస్తారు
కుర్చీ ఎక్కాక కానీ కుట్ర బయట పడదు
మన వాళ్లను మనవాళ్లతోనే ఓడించి
సందు చేసుకునే పన్నాగం ఎంతకూ పారనీయం
ఎక్కడి వాళ్ళు అక్కడే ఏలుకోండి మేలుకోండి..
చెల్లని నోటు చెల్లదెప్పుడూ
తెలంగాణ మీకు చిక్కదెప్పుడూ…
దాసరి మోహన్: 99853 09080