GDP | భారత్, చైనా.. ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగి ఉన్న మొదటి రెండు దేశాలు. రెండు దేశాలు కూడా భారీ భూభాగం, ప్రాచీన నాగరికత, అణ్వస్త్ర సామర్థ్యం, శక్తిమంతమైన సైన్యం, బలమైన రాజకీయ భౌగోళిక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే ఈ సారూప్యతలు ఇక్కడితోనే ముగుస్తాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా చైనా ఉండగా.. భారత్ మాత్రం ఇప్పటికీ ఎదుగుతున్న ఆర్థిక శక్తిగానే ఉండటమే అందుకు కారణం. 1980లలో ఆర్థిక వ్యవస్థల పరిమాణం పరంగా రెండు దేశాల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. వాస్తవానికి ఆ సమయంలో భారత తలసరి ఆదాయం చైనా కంటే ఎక్కువే. అయితే 2024లో జీడీపీ, తలసరి ఆదాయం, ప్రపంచ ఎగుమతుల్లో వాటా పరంగా చూస్తే భారత్ కంటే చైనా చాలా ముందంజలో ఉన్నది.
జీడీపీ: ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం.. 2024లో చైనా ఆర్థిక వ్యవస్థ విలువ 18.53 ట్రిలియన్ డాలర్లు. ఇది భారత జీడీపీ 3.93 ట్రిలియన్ డాలర్ల కంటే సుమారుగా ఐదింతలు ఎక్కువ. 1980ల నుంచి చూసుకుంటే చైనా జీడీపీ 61 రెట్లు పెరిగి 303 బిలియన్ డాలర్ల నుంచి 18.53 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. అదే సమయంలో 21 రెట్లు మాత్రమే పెరిగిన భారత జీడీపీ 189 బిలియన్ డాలర్ల నుంచి 3.93 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. గత పదేండ్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హయాంలో 93 శాతం పెరిగిన భారత జీడీపీ 2.04 ట్రిలియన్ డాలర్ల నుంచి 3.93 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అదే సమయంలో 76 శాతం పెరిగిన చైనా జీడీపీ 10.5 ట్రిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుత స్థితికి చేరింది.
2004-14 మధ్యకాలంలో యూపీఏ హయాంలో భారత జీడీపీ 188 శాతం పెరిగి.. 704 బిలియన్ డాలర్ల నుంచి 2,039 బిలియన్ డాలర్లకు చేరింది. అదే సమయంలో చైనా జీడీపీ 440 శాతం పెరిగి 1.95 ట్రిలియన్ డాలర్ల నుంచి 10.5 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది.
తలసరి జీడీపీ: ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2024లో చైనా తలసరి జీడీపీ 25,015 డాలర్లుగా ఉన్నది. ఇది భారత జీడీపీ 10,123 డాలర్ల కంటే రెండున్నర రెట్లు అధికం. 1980లలో భారత తలసరి ఆదాయం 582 డాలర్లుగా ఉన్నది. ఇది అప్పటి చైనా తలసరి ఆదాయం 307 డాలర్ల కంటే సుమారు రెండు రెట్లు ఎక్కువ. 1980ల నుంచి చైనా తలసరి ఆదాయం 82 రెట్లు పెరిగింది. అదే సమయంలో భారత తలసరి ఆదాయం 17 రెట్లు మాత్రమే పెరగడం గమనార్హం. మోదీ హయాంలో గత పదేండ్లలో భారత తలసరి ఆదాయం 95 శాతం పెరిగింది. 2014లో 5,187 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం 2024 నాటికి 10,123 డాలర్లకు చేరుకున్నది. అదే సమయంలో చైనా తలసరి ఆదాయం 100 శాతం పెరిగి.. 12,496 డాలర్ల నుంచి 25,015 డాలర్లకు ఎగబాకింది. 2004-14 మధ్యకాలంలో మన్మోహన్ సింగ్ హయాంలో 93 శాతం పెరిగి.. 2,681 డాలర్ల నుంచి 5,187 డాలర్లకు చేరింది. అదే సమయంలో చైనా జీడీపీ 185 శాతం పెరగడం గమనార్హం.
జీడీపీలో ప్రభుత్వ స్థూల అప్పు: 2024లో భారత జీడీపీలో ప్రభుత్వ స్థూల అప్పు 82.5 శాతం ఉండగా.. చైనా ప్రభుత్వ స్థూల అప్పు 88.6 శాతం ఉన్నది. 1995లో భారత స్థూల అప్పు 71 శాతం ఉండగా.. చైనా స్థూల అప్పు 21.6 శాతం ఉండేది. 2004-14 మధ్యకాలంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అప్పు 84.9 శాతం నుంచి 67.1 శాతానికి తగ్గింది. 2014-24 మధ్యకాలంలో బీజేపీ హయాంలో ప్రభుత్వ అప్పు 67.1 శాతం నుంచి 82.5 శాతానికి ఎగబాకింది.
ఎగుమతులు: వరల్డ్ బ్యాంకు డాటా ప్రకా రం.. చైనానే ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారు. వస్తువులు, సేవల రూపంలో 2023 లో చైనా చేసిన ఎగుమతుల విలువ 3.5 ట్రిలియన్ డాలర్లు. మెక్కిన్సీ నివేదిక ప్రకా రం.. ఇది ప్రపంచ ఎగుమతుల్లో సుమారు 14 శాతం. అదే సమయంలో 0.78 ట్రిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులతో భార త్ పదో స్థానంలో ఉన్నది. ఈ లెక్కన భారత్తో పోలిస్తే చైనా ఎగుమతులు సుమారుగా ఐదింతలు ఎక్కువ కావడం గమనార్హం.
ద్రవ్య క్రమశిక్షణ పాటిస్తూనే, మౌలిక వసతుల అభివృద్ధి, దేశీయ తయారీపై దృష్టి సారిస్తూ ఈ వృద్ధిని ఇలాగే కొనసాగిస్తే.. భారత్ కూడా ప్రపంచ శక్తిగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో ఒకటిగా నిలవగలదని నిపుణులు సూచిస్తున్నారు.
వరల్డ్ బ్యాంకు డాటా ప్రకారం.. చైనానే ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారు. వస్తువులు, సేవల రూపంలో 2023లో చైనా చేసిన ఎగుమతుల విలువ 3.5 ట్రిలియన్ డాలర్లు. మెక్కిన్సీ నివేదిక ప్రకారం.. ఇది ప్రపంచ ఎగుమతుల్లో సుమారు 14 శాతం.