వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదానీ గ్రూప్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారని మీడియాలో వచ్చిన వార్తలు చూసి ఒక్క క్షణం షాక్‌కు గురయ్యాను. ఈ సోషల్ మీడియా కాలంలో ఇలాంటి ఫేక్ వార్తలు చాలా వస్తున్నాయి కదా, ఇది కూడా అలాంటిదేమో అనుకున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మన మాజీ ప్రధాని పీవీకైనా గౌరవం ఇవ్వటానికి ఒప్పుకుంటుందేమో కానీ అదానీ గ్రూప్‌తో తమ పార్టీ నేతల దోస్తానాను ఒప్పుకోదు.
సోనియాకు నచ్చని వ్యాపారవేత్త సుబ్రతోరాయ్ సంగతి ఏమైందో కూడా మనకు తెలిసిందే. ఇక ‘ప్రధాని మోదీ దేశాన్ని దోచి తన దోస్తు అదానీకి దేశ సంపద పంచిపెడుతున్నాడని’ రాహుల్‌గాంధీ పొద్దున లేస్తే అదానీ జపం చేస్తుంటారు. అందుకే, కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యమంత్రి అదానీ సంస్థలతో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాడంటే నమ్మటానికి చాలా సమయమే పట్టింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిజంగానే దావోస్‌లో అదానీ గ్రూప్‌లకు సంబంధించి రూ.12,400 కోట్లతో పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో చాలామందితో సహా నాలోనూ కొన్ని ప్రశ్నలు మెదిలాయి. ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించటానికి, ప్రధాని మోదీని కలవటానికి కూడా రాహుల్‌గాంధీ అనుమతి తీసుకున్న రేవంత్‌రెడ్డి అదానీ విషయంలో ఆ మాత్రం అనుమతి తీసుకోకుండా ఉంటారా? ఒకవేళ రాహుల్‌గాంధీ ఇందుకు అనుమతి ఇస్తే మాత్రం ఇక్కడ మన సీఎంను నిందించటానికి ఏమీ లేదు. రాహుల్ ఏది చెప్తే అది పాటించటం ఆయన ధర్మం. నిజానికి సీఎం రేవంత్‌రెడ్డి గతంలో అదానీని, ఆయన గ్రూప్ సంస్థలను రాహుల్ కన్నా ఎక్కువే విమర్శించారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అదానీ సంస్థలతో ఒప్పందం చేసుకోదు. ఆ పార్టీ ఆరోపణలు చేసినట్టుగా అదానీ గ్రూప్ ఒక్క మోదీ జేబు సంస్థ మాత్రమే కాదు, యూఎస్‌కు చెందిన హిండెన్‌బర్గ్ అనే ఓ రీసెర్చ్ సంస్థ అదానీ కంపెనీ మొత్తం డొల్ల అని ఆధారాలతో సహా నివేదిక ఇచ్చింది. అదానీ గ్రూప్ షేర్ వ్యాల్యూను కృత్రిమంగా పెంచారని… ఆ గ్రూప్ సంస్థల నిజమైన వ్యాల్యూకు, మార్కెట్ వ్యాల్యూకు సంబంధమే లేదని తేల్చిచెప్పింది. కేవలం కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ అండతో అదానీ గ్రూప్ అసాధారణంగా పెరిగిపోయిందని చెప్పింది. గతేడాది ఇచ్చిన ఈ నివేదిక కారణంగా అదానీ గ్రూప్‌నకు సంబంధించి షేర్లన్నీ కుదేలయ్యాయి. ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ సహా చాలామంది మదుపర్లు ఆగమయ్యారు. ఈ నివేదిక మీదనే కదా కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ జేపీసీ వేయాలని పార్లమెంట్‌ను స్తంభింపజేశాయి. మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అదానీ సంస్థతో ఎలా ఒప్పందం కుదుర్చుకుంటారు? నిజానికి అదానీ గ్రూప్ కేంద్రంలో మోదీ సర్కార్ మీద ఆధారపడిన సంస్థ. ఒక్కసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకపోయినా.. మోదీ ప్రధాని కాకపోయినా అదానీ గ్రూప్ పేకమేడల్లా కూలిపోవటం ఖాయం.
రాష్ర్టానికి అదానీ గ్రూప్ పెట్టుబడులను తీసుకొచ్చామని కాంగ్రెస్ నాయకులు గొప్పలకు పోతున్నారు. కానీ, అవి తెలంగాణకు ఎప్పుడో రావాల్సిన పెట్టుబడులు. ఇదే దావోస్ వేదికగా అప్పటి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిసి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు గౌతమ్ అదానీ గతంలో ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. కానీ, కేటీఆర్ ఆ సంస్థను దగ్గరకు కూడా రానియ్యలేదు. కారణం బహిరంగమే. అదానీ సంస్థకు మోదీ అనుచిత లబ్ధి చేస్తుండటం. బీఆర్ఎస్ కూడా ఆ కంపెనీ మీద ఆరోపణలు చేసి ఉండటం. మనం ఆరోపణలు చేసిన కంపెనీని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించటం ధర్మం కాదని కేటీఆర్ భావించారు. ఫండమెంటల్స్ ఏ మాత్రం బాగా లేకుండా అసాధారణంగా పెరిగిన కంపెనీని కేటీఆర్ ఏ మాత్రం నమ్మలేదు. ఒక ప్రభుత్వం మీద ఆధారపడిన ఇలాంటి కంపెనీ కారణంగా ఏదైనా జరగరానిది జరిగితే అది తెలంగాణకు నష్టమని ఆయనకు తెలుసు. ఆ కంపెనీని నమ్ముకున్న వారికి, ఉపాధి పొందేవారికి కూడా నష్టమే. అందుకే కేటీఆర్ అసలు అదానీ సంస్థల పెట్టుబడులపై ఆసక్తి చూపకుండా అంతకుమించిన ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలను తెలంగాణకు తీసుకువచ్చారు. బీఆర్ఎస్ వద్దనుకున్న కంపెనీతో ఒప్పందం చేసుకొని వాటినే గొప్ప అని ప్రచారం చేసుకోవటం కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది.
ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే… ప్రాంతీయ పార్టీలను భూస్థాపితం చేసేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తమ సిద్ధాంతాలను పక్కనపెట్టి మరీ పనిచేస్తున్నాయనే అనుమానం కలుగుతున్నది. గతంలో నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ, దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈ రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయనే విషయం బహిరంగమే. తాజాగా అదానీ గ్రూప్‌ను కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోకి ఎర్ర తివాచీ వేసి స్వాగతం పలుకుతున్నారంటే కాంగ్రెస్, బీజేపీల దోస్తానా మరింత బలపడుతున్నది. మొత్తంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అదానీ గ్రూప్‌తో చేసుకున్న ఒప్పందాన్ని చూస్తుంటే.. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు!’ అనే కృష్ణశాస్త్రి కవిత గుర్తుకువస్తున్నది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్పటం ఖాయం.
-రచ్చ దినేష్
89787 40475