ఈ మధ్యనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ వందేండ్ల స్వతంత్ర భారత్‌పై కలలు గంటూ 2047 వరకు భారతదేశ అభివృద్ధి కోసం శూన్య హస్తాలతో పార్లమెంట్లో ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 5న నాందేడ్ మీడియా సమావేశంలో ‘రీ ఇన్వెంట్ ఇండియా’ అంటూ ఒక విధానపరమైన దార్శనిక పత్రాన్ని దేశ ప్రజల ముందుంచారు.
ఇవి గత పది రోజుల్లో దేశంలో జరిగిన రెండు విభిన్న సంఘటనలు. దీంట్లో ఎవరి లోతెంతో వారి చిత్తశుద్ధి ద్వారా ప్రజలకు ఈపాటికే అర్థమైంది. ఇక్కడ మరో ఉదాహరణ ప్రస్తావిస్తాను. కరోనా కష్టకాలంలో కోట్లాది మంది భారతీయులు ‘అన్నమో రామచంద్రా’ అంటూ తమ గ్రామాలకు రోడ్డు బాట పడితే నరేంద్ర మోదీ చేతులెత్తేశారు. కానీ సీఎం కేసీఆర్ ఎవరూ ఊహించని రీతిలో గ్రామీణ భారత ప్రజల కొనుగోలు శక్తి కోసం ఒక ప్రస్తావన దేశ ప్రజల ముందుంచారు. అదే హెలికాప్టర్ కరెన్సీ. ఇదేమీ రాకెట్ సైన్స్ కానప్పటికీ సందర్భోచితమైన రాజ నీతిజ్ఞత ప్రదర్శించడంలో కేసీఆర్ బహుశా దేశంలోనే నంబర్ వన్ కావచ్చు. ద్రవ్య నిర్వహణ విధానంలో యావత్ ప్రపంచం అవలంబించే ఒక ఆర్థిక సూత్రాన్నే సీఎం కేసీఆర్ దేశపౌరుల ముందు ప్రస్తావించారు. కానీ నరేంద్ర మోదీ నాటినుంచి నేటి అమృత్ కాల్ ప్రస్తావనల వరకు నిరుపేద భారతీయులకు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. దేశంలో రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తానని చెప్పారు. కానీ ఆయన బృందంలోని ప్రధాన ఆర్థిక సలహాదారులు రైతులకు పన్నులు వేయాలని పత్రికలకు వ్యాసాలు రాశారు. ఎంతటి వైరుధ్యం, ఎంతటి మోసం వీరి మాటల్లో మనకు కనబడుతుందో కండ్లారా అర్థమవుతుంది. వీరి ఆలోచనలకు భిన్నంగా ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ దేశంలోని రైతులకు ఏ విధంగా రైతుబంధు, ఉచిత విద్యుత్ లాంటి పథకాలతో ఆదుకోవచ్చో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్కలతో సహా విడమరిచి చెప్పారు. కష్టకాలంలో సంక్లిష్ట నిర్ణయాలు తీసుకోవడానికి ఆధునిక నిర్వహణా శాస్త్రంలో మేనేజ్మెంట్ సైన్స్ ఎంతో పురోగామి సాధించింది.
ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక రంగాలకు ఉపయోగపడే ఎన్నో ప్రాబ్లమ్ సాల్వింగ్ పద్ధతులను శాస్త్రీయంగా గుణాత్మక పద్ధతులతో విశ్లేషించే ఎన్నో టూల్స్ ఈ రోజు మన ముందున్నాయి. వీటిలో ప్రధానమైనది ఆపరేషన్స్ రీసెర్చ్. ఇదొక మేనేజ్మెంట్ సైన్స్. గణితాత్మకమైనది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా యుద్ధ వ్యూహాలను, మిలిటరీ ఎత్తుగడలను శాస్త్రీయంగా విశ్లేషించడంలో ఆపరేషన్స్ రీసెర్చ్ ఎంతో ఉపయుక్తంగా దోహదపడింది. లాభనష్టాల సమన్వయాన్ని అంచనా వేయడంలో ఆపరేషన్స్ రీసెర్చ్ అందె వేసిన చేయి. వ్యూహాలను, వ్యూహాత్మక ఎత్తుగడలను తయారుచేసుకోవడంలో ఈ ఆపరేషన్ రీసెర్చ్‌లోని ఒక భాగమైన ‘గేమ్ థియరీ’ ఎంతగానో ఉపయోగపడుతుంది.
గేమ్ థియరీ సిద్ధాంతానికి నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని మోదీ నిరుపేదలకు నష్టం వచ్చే ప్రణాళికలు చేస్తుంటే సీఎం కేసీఆర్ దేశంలోని పలువర్గాల ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలో తన ఆలోచనల ద్వారా పంచుకుంటుంటే ఇంతటి వైరుధ్యాలను సగటు మానవులు, బుద్ధిజీవులు, మేధావులు శాస్ర్తోక్తంగా కేసీఆర్‌ను అర్థం చేసుకోవాలి. అందుకే ఆయనొక ఆపరేషన్స్ రీసెర్చ్. మేనేజ్మెంట్ సైన్స్. గుణాత్మకమైన మార్పుతో భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ జాతీయ రాజకీయ వేదికగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మలచడంలో కేసీఆర్ ప్రదర్శిస్తున్న చాణక్యనీతిని ఆపరేషన్స్ రీసెర్చ్ శాస్త్రంతో గుణాత్మకంగా విశ్లేషించడం ఎంతో అవసరం. ఆపరేషన్స్ రీసెర్చ్ శాస్త్రంలో మాడలింగ్, స్టాటిస్టిక్స్, ఆప్టిమైజేషన్ మూడు ముఖ్యమైన అంగాలు.
ఇప్పటికే కేసీఆర్ ఎన్నోరకాల స్టాటిస్టిక్స్ను గుణాత్మకమైన మార్పు కోసం దేశ ప్రజల ముందుంచారు. దేశంలో ప్రతి రైతుకు పెట్టుబడి సహాయంగా ఎకరానికి రూ.10 వేలు చొప్పున అందిస్తే కేవలం రెండు లక్షల కోట్లతో ఈ పథకాన్ని అమలుచేయవచ్చనేది కేసీఆర్ వాదన. రూ.45 లక్షల కోట్ల దేశ బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లు చిన్న మొత్తమే. కానీ ఆలోచన ఎంతో మానవత్వంతో కూడుకున్నది. దీన్ని మాడలింగ్గా భావించవచ్చు.
ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రూ.65 వేల కోట్ల నగదును అందజేశారు. రెండురోజుల కిందట విడుదలైన ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ నివేదిక ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా రైతుల కోసం ఖర్చుచేస్తున్న రాష్ట్రం తెలంగాణ. అంతేకాదు, మరొక ముఖ్యమైన కేసీఆర్ ప్రస్తావన ఇక్కడ చర్చించాలి. దేశంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీటి పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి కేవలం 8 లక్షల కోట్ల బడ్జెట్ సరిపోతుందనేది ఆయన వాదన. ఇది కూడా గుణాత్మకమైన మార్పునకు మరొక సంకేతం.
ఈ విధాన మార్పులను శాస్త్రీయ పరిభాషలో ఆప్టిమైజేషన్ అనవచ్చు. ఎందుకంటే ‘ఆక్స్‌ఫామ్’ నివేదిక ప్రకారం- దేశంలో ఒక్క శాతం ప్రజలు 40 శాతం దేశ ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. 50 శాతం దేశవాసులు కేవలం 3 శాతం ఆదాయంతో బతుకుతున్నారు. అందుకే 75 ఏండ్ల స్వాతంత్య్ర ఫలాలపై సీఎం కేసీఆర్ పదే పదే ప్రశ్నిస్తున్నారు. నాడు మనకన్నా వెనుకంజలో ఉన్న చైనా నేడు ప్రపంచంలో ఎందుకు అగ్రభాగాన ఉన్నదో విశ్లేషించారు. సహజవనరుల వినియోగంపై ఇప్పటికే తన ఆలోచనలను పంచుకున్నారు. నీటివనరుల వినియోగం, ఉచిత విద్యుత్తు ముఖ్యమైనవి. అయితే భవిష్యత్తులో మరిన్ని ఆలోచనలు పంచుకునే అవకాశం ఉన్నది. నాందేడ్ సమావేశంలో ముఖ్యంగా ఐదు రంగాల్లో అంటే ఆర్థిక, రాజ్యాంగ, ఎన్నికల, పరిపాలన, న్యాయరంగాల్లో తీసుకురావాల్సిన మార్పులపై క్లుప్తంగా తన ఆలోచనలు పంచుకుంటూ‘ రీ ఇన్వెంట్ ఇండియా, రీ ఓరియంట్ ఇండియా’ అంటూ ఒక పత్రాన్ని మీడియాకు విడుదల చేశారు. అయితే సహజ, మానవ వనరులు వినియోగం కోసం నూతన వ్యూహాన్ని అమలుచేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి భవిష్యత్తులో కరెన్సీ మేనేజ్మెంట్లలో, అనగా ద్రవ్య నిర్వహణ విధానంలో మనం ఊహించని నూతన ఆలోచనలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.
రైతులు బ్యాంకుల ద్వారా పొందే స్కేల్ ఆఫ్ ఫైనాన్సింగ్ విధానం చాలా పురాతనమైనది. ఈ రోజు దేశంలో దిగువ వర్గాల నుంచి జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం 64 శాతం వరకు ఉన్నది. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో బ్యాంకులకు వచ్చే డిపాజిట్ల నుంచి ఆధిపత్య కార్పొరేట్ వర్గాలు లాభం పొందుతున్నాయి. కాబట్టి ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్సింగ్ విధానంలో అత్యవసర మార్పులు అవసరం. అంతేకాకుండా బ్యాంకుల నుంచి రుణాలు పొందే విధానంలో సిబిల్ స్కోర్ విధానం ఒక గొడ్డలి పెట్టు. రుణగ్రహీత తనకు సంబంధం లేకున్నా ఇతరుల పొరపాట్లతో సిబిల్ స్కోర్ తగ్గడం వల్ల నష్టాలకు గురవుతున్నాడు. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్ల చిన్నచిన్న పొరపాట్లతో కూడా రుణగ్రహీతలు బ్యాంకులకు అంటరానివారిగా మారిపోతున్నారు. దీన్ని సామాజిక బహిష్కరణగా ఆర్థిక అంటరానితనంగా నిర్వచించాలి. కాబట్టి కరెన్సీ మేనేజ్మెంట్లో ఔట్ ఆఫ్ ది బాక్స్ పరిష్కార మార్గాలు వెతకాల్సిన అవసరం ఉన్నది.
ధన సంపద అష్టలక్ష్మిగా చలామణి అయ్యే భారతీయ జీవనవిధానంలో నేడు డిజిటల్ కరెన్సీ ఒక అదృశ్య లక్ష్మిగా తయారైంది. దీన్ని నవ లక్ష్మిగా కూడా పరిగణించాలి. అందుకే పైన పేర్కొన్న
హెలికాప్టర్ కరెన్సీ ఆలోచనను ముఖ్యమంత్రి కేసీఆర్ చాణక్యనీతికి నిదర్శనంగా పరిగణించాలి.
ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు దేశ జీడీపీలో కొంత భాగాన్ని నగదురూపంలో ముద్రించి ఆ మేరకు చలామణిలోకి తీసుకువస్తారు. దీన్నే హెలికాప్టర్ కరెన్సీగా భావిస్తారు. ఇలాంటిదే మరో కరెన్సీ గురించి ప్రస్తావించవచ్చు. దానిపేరు కమ్యూనిటీ కరెన్సీ. ప్రస్తుత ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇది సాధ్యం కాదు. కానీ ఆలోచనారీత్యా దీనిగురించి చర్చించాలి. దీన్నే లోకల్, రీజినల్ కరెన్సీ అని పాశ్చా త్య ప్రపంచంలో పిలుస్తారు. ఒకేరకమైన సామూహిక జీవన విధానంలో ఉండే కొంతమంది సమూహాలు పరస్పర విశ్వాసంతో ఆర్థిక చలామణి రీత్యా కరెన్సీని ముద్రించుకుంటే దాన్ని కమ్యూనిటీ కరెన్సీగా భావిస్తారు. ఇది ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆచరణ సాధ్యం కానప్పటికీ భారత్ ఎన్నో కమ్యూనిటీల సమూహం కాబట్టి దీనివల్ల లాభనష్టాలపై మేధావి లోకం చర్చించాలి.
భారత్ అంటే గ్రామాల సమూహం కాబట్టి ఒక గ్రామం, తన ఆర్థిక వనరుల నిర్వహణ కోసం ఇప్పటికీ శాస్త్రీయపద్ధతిలో బడ్జెటింగ్ లేదు. రాష్ట్ర, కేంద్ర నిధులపైనే ఆధారపడి ఉన్నది. అయితే పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతంలో భాగంగా ఆయా గ్రామాలు తమ సొంత ఆర్థిక వనరులు సమీకరించుకునే అవకాశంలో భాగంగా గ్రామస్థాయిలో విలేజ్ బాండ్స్ ప్రవేశపెట్టడానికి ఒక మంచి అవకాశం ఉన్నది. ఈ 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో గ్రామాలు స్వయం సమృద్ధిగా మారాలంటే ఆర్బీఐతో పాటు ఆర్థికవేత్తలు తక్షణమే ఈ విషయంపై దృష్టిసారించాలి.
హెలికాప్టర్ కరెన్సీ గురించి ప్రస్తావించిన సీఎం కేసీఆర్ భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో అధునాతన విధానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఏదేమైనా కేసీఆర్‌ది ఒకే జీవితం కావచ్చు. కానీ, ఆయన పోషించే పాత్రలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి కారణజన్ముడి జన్మదినం ఈ రోజు. కాలపురుషుడు మన కేసీఆర్ వెంట ఉంటాడని ఆశిస్తూ ప్రేమతో!!
ఢిల్లీ వసంత్: 81424 44345
(వ్యాసకర్త: రైతు నాయకులు, మేనేజింగ్ డైరెక్టర్, గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ)