కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నది. తాము అధికారంలో లేని రాష్ర్టాల్లో పాగా వేసేందుకే బీజేపీ ఈ ఎత్తుగడను ప్రదర్శిస్తున్నదనే విషయం స్పష్టమవుతున్నది. ఇందులో భాగంగానే తెలంగాణనూ కైవసం చేసుకోవడానికి అనేక కుట్రలు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు రాష్ట్రంలో ఉన్న ఓ ఫామ్‌హౌజ్ సాక్షిగా నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి విఫలమవ్వడమే తాజా ఉదాహరణ.
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న బీజేపీ వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్నారు. రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక ఉండటమే ఆ మౌనానికి కారణమని నిన్నటి విలేకరుల సమావేశంతో స్పష్టమైంది. ఆ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిందో లేదో కేసీఆర్ విలేకరుల ముందుకు వచ్చారు. బీజేపీ నిరంకుశత్వాన్ని, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలను దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన విన్నవించుకున్నారు. దీంతో ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ పట్ల ఆయనకున్న గౌరవాన్ని ఇది చాటిచెప్తున్నది.
ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు తాయిలాలు ఇచ్చి ప్రభుత్వాలను లోబరుచుకోవడం, విడగొట్టడం తదితర అనైతిక చర్యల ద్వారా బీజేపీ 10-12 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ నిబంధనలు, నైతికతను పాటించాలన్న ప్రాథమిక సూత్రాలను బీజేపీ పట్టించుకోలేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ర్టాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియడం లేదు. సాధారణంగా ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలం ఐదేండ్లు అయినప్పటికీ కొన్ని నెలలకే ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. దేశాన్ని కాషాయీకరించాలనే పెద్ద లక్ష్యంతో 2014 నుంచి బీజేపీ పట్టుదలగా పనిచేస్తున్నది. అదే సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ ఏర్పాటుపై నరేంద్ర మోదీ సంతోషంగా లేరు. రాష్ర్టాన్ని ఏర్పాటుచేసిన విధానంలో లోపాలున్నాయని మోదీ-షాలు పార్లమెంట్ లోపల, బయటా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.
మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి దఫా అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ సర్కారుతో తటస్థంగా వ్యవహరించింది. మొదటి దఫా చివరి దశలో కేంద్రం-తెలంగాణ ప్రభుత్వాల మధ్య అంతరం పెరిగింది. 2019 ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ సీట్లను గెలుచుకున్న తర్వాత తెలంగా ణలో విస్తరించాలన్న ప్రణాళికకు పదును పెట్టింది బీజేపీ. అప్పటినుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని రాజకీయంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. ఉప ఎన్నికల రూపంలో రాష్ట్రంపై ఎన్నికల దాడులు చేసింది. ఈ ఎన్నికల్లో గెలువడం వల్ల రాష్ట్రంలో తమ ప్రాబల్యం పెంచుకోవడానికి ఆ పార్టీకి అవకాశం దక్కింది. తెలంగాణ బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై పదే పదే అసంబద్ధమైన, నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఆ పార్టీ అధినాయకత్వం ప్రోత్సహించింది. తెలంగాణకు కేటాయించిన అనేక ప్రాజెక్టులను ఇతర రాష్ర్టాలకు మళ్లించింది. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, గ్రాం ట్ల మంజూరీలో విపరీతమైన జాప్యం చేసింది. జాతీయ సంస్థలు ప్రతిపాదించిన కేంద్ర నిధులేవీ రాష్ర్టానికి ఇవ్వలేదు. ధాన్యం సేకరణకు రాష్ర్టానికి అయిన భారీ ఖర్చును తిరిగి చెల్లించడానికి కేంద్రం నిరాకరించింది. ‘ఎఫ్ఆర్బీఎం’ పరిధిలో రుణాలు తీసుకోవడానికి అనుమతులు మంజూరు చేయడంలో ఇబ్బందులు కలిగించింది. గతంలో ఆమోదించిన, ప్రశంసించిన ప్రాజెక్టులకు ఆర్థికసాయం నిరాకరించింది. ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించి ప్రగతికి మోకాలడ్డింది.
రాష్ట్ర బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పరిపాలన, ఆర్థికాభివృద్ధిపై సృష్టించిన అసత్యాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు ఆ పార్టీ అధినాయకత్వం అనుమతించింది. ఈ పన్నాగాలన్నీ చాలవన్నట్లుగా వివిధ రాజకీయ కారణాల వల్ల గత అరువై ఏండ్లుగా నిర్వహించని ఉత్సవాలను సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ రాజ్య విమోచనా దినోత్సవం’గా నిర్వహించి ప్రజలు మరిచిపోయిన విషయాన్ని గుర్తు చేయాలని బీజేపీ ప్రయత్నించింది. నాటి పోరాటంలోని హిందు-ముస్లిం కోణాన్ని తన ప్రయోజనం కోసం వాడుకొని రాష్ట్రంలో మత ఘర్షణలు రేపడానికి ప్రయత్నించి విఫలమైంది. తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల పాటు జాతీయ సమైక్యతా దినాన్ని జాతీయత స్ఫూర్తితో ఘనంగా నిర్వహించుకున్నది.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక రాష్ర్టాన్ని రాజకీయంగా బెదిరించడం, ఆర్థికంగా కట్టడి చేసి ఒత్తిడి పెంచడం అప్రజాస్వామికం. తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం బీజేపీకి ఒక గుణపాఠం అయింది. ఇలాంటి తప్పులను అనుమతించడం కేంద్ర ప్రభుత్వానికి సరైనది కాదు. భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం. తరచుగా అస్థిరతకు లోనయ్యే బనానా రిపబ్లిక్ వంటిది కాదనే విషయం కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం లాంటి అడ్డదారుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని
పడగొట్టాలని చూడటం బీజేపీ నీచ రాజకీయాలకు నిదర్శనం. తెలంగాణ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు అమ్ముడు పోకుండా ఉండటం ప్రజాస్వామ్యం, నైతిక విలువలు ఇంకా మనుగడలో ఉన్నాయని చెప్పడానికి తార్కాణం.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణను హస్తగతం చేసుకోవడానికి అనేక కుట్రలను పన్నుతున్నది. ఇందుకోసం రాష్ర్టాన్ని ఆర్థిక ఇబ్బందులకూ గురిచేస్తున్నది. టీఆర్ఎస్ను, తెలంగాణ ప్రభుత్వాన్ని రాజకీయంగా బెదిరిస్తున్నది. బీజేపీ కుయుక్తులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారు. దీనిని గ్రహించి మసులుకుంటే బీజేపీకి మంచిది.