విపరీతమైన వేడిలో దుమ్ముతుపాను లేస్తున్నది. వాహనాలు రహదారిపై కిక్కిరిసిపోయాయి. కుప్పలుగా ఉన్న పడవలతో గంగా నది తీరం రద్దీగా ఉన్నది. ముంబైలోని చౌపట్టీ బీచ్‌లో వలె గంగా తీరంలో ఓ స్థాయిలో ప్లాస్టిక్, చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. ఎత్తైన బంగీ జంప్ గురించిన బోర్డులు, సెల్ఫీలు తీసుకుంటున్న పర్యాటకుల గుంపులు దర్శనమిస్తున్నాయి. ‘మునీ కీ రేతి’లో డీజే సంగీతాన్ని వినిపించే పార్కింగ్ స్థలాలున్నాయి. డీలక్స్ స్పాలు, లగ్జరీ హోటళ్లు, ఆసన అభ్యాసకులతో నిండిన అంతర్జాతీయ ఆశ్రమాలు సమీపంలో కనిపిస్తున్నాయి. ఈ దుమ్ము, ధూళితో కూడిన సమ్మర్ధం ఎక్కడో కాదు, యోగా నగరం రిషికేష్ నిండాపరుచుకొని ఉంది. ‘ఆధ్యాత్మిక’ పర్యాటకం ప్రస్తుత పరిస్థితి ఇది.
చార్ధామ్ యాత్ర ఒకప్పుడు తీర్థయాత్ర. కానీ, ఇప్పుడు అది ‘ఆధ్యాత్మిక’ పర్యాటకం. ఈ ఏడాది మేలో మొదటి 20 రోజుల్లోనే చార్‌ధామ్‌ను 14 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేదార్‌నాథ్‌కు రోజుకు 18,000 మంది, గంగోత్రికి 11,000, బద్రీనాథ్‌కి 20,000, యమునోత్రికి 9,000 మంది పర్యాటకులను పరిమితం చేసింది. 2022తో పోలిస్తే ఇది సుమారు 50 శాతం ఎక్కువ. దీనర్థం ఏమిటంటే.. ప్రతి భక్తుడికి అసలైన దర్శనం ఐదు సెకన్ల కంటే ఎక్కువ ఉండదని. అది కూడా పోలీసులు గెంటివేయకపోతే.
ఈ సందడికి తగినట్టుగానే మన దేవతలు కూడా ఓవర్ టైం పనిచేయాల్సి వస్తున్నది. అంతేకాదు, వారి మధ్యాహ్న భోజన, విశ్రాంతి సమయాలు తగ్గిపోయాయి. ఆన్లైన్ పూజలు రాత్రంతా కొనసాగుతూనే ఉంటాయి. ఎక్కడా ఎడతెరపి అనేది లేకుండా తెల్లవారుజాము దర్శనంతో మరో రోజు ప్రారంభమవుతుంది. మన ఆధ్యాత్మికత ఎంత లోతుల్లోకి పడిపోయిందో చెప్పేందుకు ఈ శ్రద్ధారాహిత్యమే నిదర్శనం.
మన దేవతలు సజీవ రూపాలా లేక రాళ్లా? ప్రాణప్రతిష్ఠ మంత్రాలు దైవత్వాన్ని వాటిలోకి ఆవాహన చేస్తాయా, లేదా? కేదార్నాథ్ ఆలయ గోడలపై ప్రదర్శించే లేజర్ షోలు కూడా భక్తేనా? అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠాపన సమయంలో దాని ప్రభావం గురించిన ఉపన్యాసాలు విన్నాం. చార్‌ధామ్‌లోని దేవతా విగ్రహాలు చాలా పురాతనమైనవి. ఈ టూరిజం దూకుడు ఓవైపు కొనసాగుతుండగా.. అట్టడుగు వర్గాలవారు, గ్రామస్థులు, అసలైన భక్తులను ఈ హడావుడి అడ్డుకుంటున్నది. దైవ దర్శనానికి అనుమతించాలని వారు వేడుకుంటున్నారు. అయినా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ప్రపంచంలో వాళ్లు నివసించనందున, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురించిన అవగాహన లేని కారణంగా వారిని తిరస్కరిస్తున్నారు. అంతేకాదు, కాలినడకన తీర్థయాత్ర చేయాలని విశ్వసించేవారి కోసం నడక మార్గం కూడా లేదు. ఎందుకంటే, వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు తీసుకొచ్చిన చార్ధామ్ ప్రాజెక్టు (సీడీపీ)లో భాగంగా చేపట్టిన రోడ్డు విస్తరణకు దాన్ని బలి చేయాల్సి వచ్చింది.
విపరీతమైన వేడి, కొండచరియలు విరిగిపడటం, అడవిలో మంటలు, నీటి సంక్షోభం, హిమాలయాల్లో పర్యాటక సంబంధిత నిర్మాణాల తాకిడి మధ్యనే ముఖ్యంగా నిషేధిత వరద ప్రాంతంలో రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికీ 12 మీటర్ల వెడల్పు ఉండే రహదారి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నది. ఈ వెడల్పు రోడ్లు ప్రత్యేకంగా రోజుకు 10,000 ప్యాసింజర్ కార్ యూనిట్ల (పీసీయూ)ను దృష్టిలో పెట్టుకొని వేశారు. అయితే ఈ ఇరుకైన లోయల్లో వాహనాలు ఎక్కువగా ఇరుక్కుపోతుండటంతో పర్యాటకుల రాకపై ప్రభుత్వం పరిమితి విధించింది. ప్రస్తుతం ఒక రోజుకు సగటున 5 వేల పీసీయూల కంటే తక్కువ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయినప్పటికీ గౌరీకుండ్ నుంచి 10 కిలోమీటర్ల వరకు, కేదార్నాథ్ దిగువన 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతున్నది. 2013లో వరదలు సంభవించి వందల మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం ఇదే కావడం గమనార్హం.
కొండలు, లోయల్లోని ఇరుకైన రహదారుల్లో ఉండే పరిమిత వాహక సామర్థ్యం ఎక్కువగా ఉల్లంఘనలకు గురవుతున్నది. ఈ రహదారిని నిర్మిస్తుండటం వల్ల కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. కొండవాలు స్థీరికరణ కోసం ఇటీవల అదనంగా రూ.1,400 కోట్ల ప్రజా సొమ్మును ప్రభుత్వం విడుదల చేసింది. 40 మంది కూలీలు సజీవంగా చిక్కుకుపోయిన సిల్క్యారా సొరంగాన్ని నిపుణుల బృందం పర్యవేక్షించింది. 12 మీటర్ల వెడల్పే ఆ ప్రమాదానికి ప్రధాన కారణమని ఆ బృందం తేల్చిచెప్పింది. మన విధ్వంసానికి మనమే నిధులు సమకూరుస్తున్నాం. ఇది ఒక విషపు వలయం.
ఆధ్యాత్మిక పర్యాటకం అనే పదబంధమే ఒక వింత. ఆధ్యాత్మిక పర్యాటకులు ఒక్కో ధామ్‌లో ప్రతిరోజూ 10 వేల కిలోల చెత్తను వేస్తున్నారు. రహదారి పక్కన, గంగా నది ఒడ్డున వారు కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. కదిలే కార్ల నుంచి సీసాలు, ైస్టెరోఫోమ్ ప్లేట్లను (మెరిసే ప్లేట్లు) విసిరివేస్తున్నారు. అంతేకాదు, ఎక్కువ శబ్దం వచ్చేలా పాటలు పెట్టడం.. పర్వతాలు, పుణ్యక్షేత్రాలు బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించేలా బట్టలు విప్పి సెల్ఫీలు తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. అరుదైన పైన్, సిల్వర్‌ఓక్ చెట్లు, పర్వత ప్రాంతాల్లో జీవించే జంతువుల మధ్యనే పెద్దపెద్దగా చప్పుడు చేసే హారన్లు మోగిస్తున్నారు. హిమాలయాలను అపవిత్రం చేయడం, హిమాలయాలను అమ్ముకోవడంలో ఆధ్యాత్మికత ఏముంది?
ఐదు ట్రిలియన్ డాలర్ల భావన మన కండ్లకు గంతలు కట్టకముందు ఈ విధానం భిన్నంగా ఉండేది. పర్వత ప్రాంతాల్లోని గ్రామస్థులు బగ్యాల్పై (పర్వత ప్రాంతాల్లో ఉండే పచ్చికబయళ్లు) బూట్లు ధరించి నడవరు. దేవతల సన్నిధిలో ఉన్నప్పుడు తమ స్వరం పెంచి మాట్లాడరు. కాలకృత్యాలు తీర్చుకొని, ఆ పవిత్ర స్థలాలను కలుషితం చేయాల్సి వస్తుందేమోననే భయంతో ధామ్‌లలో రాత్రిపూట ఆగరు. ప్రకాశవంతమైన దుస్తులను ధరించడాన్ని కూడా వారు అగౌరవంగా భావిస్తారు. స్వామి వివేకానంద లాంటి సంతుసాధువులకు రిషికేష్ ఒకప్పుడు ధ్యాన కేంద్రం. గంగా నదిలో కనిపించే చేపలకు అప్పట్లో చేతితోనే మేత వేసేవారు. నీళ్లు తాగేందుకు అక్కడికి ఏనుగులు వచ్చేవి. ఈ దృశ్యాలు, స్వచ్ఛమైన గంగా జలాలను చూసి వారు ఆనందించేవారు.
ఇదంతా సనాతన ధర్మం పేరిట జరుగుతున్నందున దాని గురించి స్పష్టత ఇవ్వాలి. ఒక దాన్ని చూసి ‘నేను దీన్ని ఎలా పెంచగలను?’ అని సనాతన ధర్మం అనుకుంటుంది. కానీ, ‘న్యూ ఇండియా’లో ఆధునిక మానవుడు ఏదైనా ఒక వస్తువును చూసి.. ‘నేను దీన్ని ఎలా వినియోగించగలను?’ అని అనుకుంటున్నాడు. ఆధునిక భారతదేశం అమర గంగానదిని సొరంగంలా మార్చడానికి, చార్‌ధామ్‌ను చార్ దామ్ (నాలుగు రాళ్లుగా చేసుకొని అమ్ముకోవడం) గా మార్చడానికి, హిమాలయాలను దుమ్ము, ధూళితో కూడిన మట్టికుప్పగా మార్చేందుకు సిద్ధంగా ఉంది. ఒక వస్తువు ధర తప్ప, దాని విలువ తెలియని స్థితికి మనం చేరుకున్నాం. మహోన్నత వారసత్వ సంపద, విజ్ఞానాన్ని మనం వదిలేసుకుంటున్నాం.
(‘ది వైర్’ సౌజన్యంతో)
– ప్రియదర్శిని పటేల్