జాతీయపార్టీగా కొన ఊపిరితో మనుగడ సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చింతచచ్చినా పులుపు చావదు. ముఖ్యమంత్రులను మార్చే ఆనవాయితీ మారలేదు. కర్ణాటకలో సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌ను గద్దెనెక్కించటం ఇందుకు తాజా ఉదాహరణ. ఈ కుర్చీలాట కాంగ్రెస్ పార్టీ అంత పురాతనమైంది. స్వాతంత్య్రానికి పూర్వం ప్రాంతీయ విభాగాల నాయకుల, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రుల ఎంపిక చేసేదంతా అధిష్ఠానమే! ఆయా రాష్ర్టాల్లో గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాలకు పూచికపుల్లంత విలువ ఇవ్వదు. ఢిల్లీలో కూర్చుండి అధిష్ఠానమే చక్రం తిప్పి ఎవరు సీఎంగా ఉండాలో తేల్చటం ప్రజాస్వామ్యాన్ని పరిహసించటం తప్ప మరోటి కాదు.
గల్లీ నేతను ఢిల్లీ నిర్ణయించటం పాతకాలపు రాజరిక నిరంకుశాధికారాన్ని గుర్తుచేస్తున్నది. అలాగే పదేపదే ముఖ్యమంత్రులను మార్చటం వల్ల నిరంతర పరిపాలనాపరమైన అస్థిరత, రాజకీయ అసమ్మతి ఏర్పడటం కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఏండ్ల తరబడి షరా మామూలుగానే జరుగుతున్నది. ఎవరెక్కువ మూటలు మోస్తే వారికే పదవి కట్టబెట్టటం అనేది సీఎంల ఎంపికకు గీటురాయిగా మారింది. నాటి నుంచి నేటి దాకా కాంగ్రెస్ ధోరణిలో ఏమాత్రం మార్పు రాలేదని ఇపుడు కర్ణాటకలో అధికార మార్పిడి రుజువు.
ఇది చాలదన్నట్టు ప్రాంతీయ నేతల్లో ఒకరిమీద మరొకరిని పోటీ పెట్టి తమాషా చూడటం కాంగ్రెస్ మార్క్ రాజకీయం. కర్ణాటకలో సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ అధికార పోటీ తమాషా నడిపించింది అధిష్ఠానమే. కులరాజకీయాల పరంగా సిద్ధరామయ్య, ధనబలం, నిర్వహణా సామర్థ్యం కారణంగా శివకుమార్..ఈ ఇద్దరి మధ్య ఎటూ తేల్చుకోలేకపోయిన అధిష్ఠానం చెరిసగం పదవీకాలం అనే కృత్రిమ సర్దుబాటును తీసుకువచ్చింది. కానీ సిద్ధరామయ్య గద్దె దిగేందుకు నిరాకరించటం, శివకుమార్ పదవి కోసం పట్టుబట్టటంతో అసమ్మతి రాజుకున్నది.
ఈ రాజకీయ ఫ్యాక్షన్ తగాదా తారస్థాయికి చేరుకోవటంతో అధిష్ఠానం రంగంలోకి దిగి సీఎం మార్పిడికి శ్రీకారం చుట్టింది. ఇలా ఇద్దరి కుమ్ములాటలతో రాష్ర్టాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం భ్రష్టు పట్టించింది. ఈ తతంగంలో పరిపాలన ఏమైపోయిందనేది ఎవరికీ పట్టలేదు. ఎన్నికలకు ముందు అడ్డగోలుగా ఇచ్చిన హామీలు అటకెక్కటం గురించిన చర్చ వెనుకకు పోయింది. కొంచెం అటుఇటుగా రానున్న రోజుల్లో తెలంగాణలోనూ ఇదే జరుగుతుంది. రాజకీయ ఫ్యాక్షనిజంలో ఎవరెప్పుడు ఎటు తిరుగుతారో, అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గుతుందో తెలియదు కదా!
కాంగ్రెస్ పార్టీలో అన్నిటిని అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. ప్రాంతీయం అనేది కేవలం సామంత రాజ్య వ్యవహారమే. ఇదీ ఆ జాతీయ పార్టీ వ్యవహార శైలి. అదే ప్రాంతీయ పార్టీ అయితే ఢిల్లీ హుకుమత్ నడవదు. వారికి అధిష్ఠానం ప్రజలే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంల తోలు బొమ్మలాట ప్రజలకు విసుగు తెప్పించింది. ఏడాదికో సీఎంను మార్చే సంస్కృతి చిరాకు కలిగించింది. పర్యవసానంగా ఏర్పడే పరిపాలనాపరమైన స్తబ్ధత వెగటు కలిగించింది. వెరసి ప్రాంతీయ అభిలాషలను, ఆకాంక్షలను పట్టించుకోని జాతీయం దేనికనే ఆలోచన అంకురించింది.
సీఎంలను అధిష్ఠానం బహిరంగంగా అవమానించిన ఘటనలు అస్తిత్వాన్ని తట్టిలేపటంతో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. గల్లీ జుట్టు ఢిల్లీ చేతిలో పెట్టి ఇరికి ఇగిలించేకన్నా ప్రాంతీయమే మేలనే నిర్ధారణకు ప్రజలూ వచ్చారు. తన నిరంకుశాధికారానికి సవాల్‌గా నిలిచిన ప్రాంతీయ పార్టీలను అణచివేసేందుకు కాంగ్రెస్ చెయ్యని దుర్మార్గం లేదు. ఇపుడు ఢిల్లీలో చక్రం తిప్పుతున్న బీజేపీ ఆ దారిలోనే పోతుండటం మనం చూస్తున్నాం. కానీ ఎన్నటికైనా ప్రాంతీయ ప్రయోజనాలు ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే సురక్షితమని చరిత్ర రుజువు చేసిన సత్యం.