కలలు, కోరికలు మనుషులందరికీ ఉంటాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడా రెండు రకాల మనుషులను గుర్తించాలి. సామాన్య ప్రజలు, వాళ్లను పరిపాలించే రాజకీయ నాయకులు. ప్రజలకు వారి బతుకు, ఉద్యోగాలు, కుటుంబాలు, పిల్లల బాధ్యతలు- ఇవన్నీ ముఖ్యం. వాటినీ తీర్చుకుంటూ ఉంటారు, ఉండాలి కూడా. మరి నాయకులకు వారి వ్యక్తిగత బాధ్యతలే కాకుండా ప్రజాపాలన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి, సహజంగానే వారు సామాన్య మానవుల కంటే కొన్ని విలక్షణ లక్షణాలు కలిగి ఉండాలి. మన రాజకీయ నాయకుల గురించి మాట్లాడే ముందు అసలు దార్శనికత అంటే ఏమిటి? దార్శనికుడికి ఏ లక్షణాలు ఉంటాయన్నది చూద్దాం!
దార్శనికత అంటే ప్రస్తుత పరిస్థితి గురించి అవగాహన, భవిష్యత్తులో ఏమి జరుగుతుందన్న విషయం మీద భావన, దానిని సాధించడానికి మనం ఇప్పుడు ఏ పథకాలు రచించాలని అనే దానిపై స్పష్టత. దీనికి ఎంతో భావనాత్మక శక్తి, సృజనాత్మక శక్తి కావాలి. ఈ ఆలోచనలు ఆచరణలో పెట్టగలిగిన వ్యూహరచన చేయగలగాలి. ఇవి చేయడానికి తగిన తెలివి, విజ్ఞానం కలిగినవారిని ఒక బృందంగా ఏర్పర్చి, అందులో కూడా ఎవరు, ఏ పని బాగా చేయగలరో గ్రహించి, ఆ పని వారికి అప్పగించాలి. మొట్టమొదట ఆ పథకం ఉద్దేశాలను దార్శనికుడు స్పష్టంగా చెప్పగలగాలి. దానికి ఒక వినూత్నమైన పద్ధతిని రూపొందించాలి. ఈ పథకం, దానిని ఆచరించే పద్ధతిలోని స్థాయిలు, వాటి ఫలితాలు ఆ బృందంలోని వారందరికీ స్పష్టంగా చెప్పగలగాలి. ప్రతీ అడుగు ప్రతి ఒక్కరికీ అర్థమవ్వాలి. అందుకు నాయకుడు సరైన ఆలోచనలు, పట్టుదల కలిగిన మనిషి అయి ఉండాలి. ఆ పథకంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకొని, మిగతావారిని కూడా నిరాశకు గురికాకుండా ఉత్సాహపరచాలి.
ఈ పథకం తప్పక భవిష్యత్తు తరాలకు వెలుగునిస్తుందన్న గట్టి నమ్మకం ఉండాలి దార్శనికుడికి. తన జీవితానుభాలను, చూసిన విషయాలను, తన విజ్ఞానాన్ని ఆ రంగంలోని నిపుణుల సలహాలను క్రోడీకరించి, ప్రగతిశీల ఆలోచనలు చేసి, మారబోయే కాలానికి తగిన పథకాలు, విధానాలను రూపొందించగలగాలి. ప్రతి స్థాయిని పూర్వం కంటే మెరుగైన పద్ధతిలో తీసుకెళ్లాలి. కొత్త సమస్యలు ఎదురైతే తగిన విధంగ వాటిని నాయకుడు పరిష్కరించగలగాలి. అన్నిటికంటే ముందుగా ఆ పథకానికి అయ్యే వ్యయం, ఆ ధనం అమర్చుకునే విధానం చాలా స్పష్టంగా అలవర్చుకోవాలి. ప్రతి స్థాయిలోనూ ఊహించిన ఫలితం వస్తోందా? అని బేరీజు వేసుకోవాలి. ఊహల్లో విహరించకూడదు. ఏదైనా విఫలమైతే అదొక పాఠంగా భావించి జాగ్రత్త తీసుకోవాలి. ఆ పనిని నిర్వహించే జట్టులోని సభ్యులు నిరాశ చెందకుండా ఉత్సాహపరచగలగాలి. ఇంకా ముఖ్యంగా తన పథకాలు ఏ దిశలో సాధిస్తున్నామన్నది సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు వివరించాలి.
నాయకుడికి సక్రమంగా ఆలోచించే శక్తే కాదు, భావోద్వేగ మేధస్సు (ఎమోషనల్ ఇంటెలిజెన్స్), అంటే ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకునే తెలివి కూడా ఉండాలి. సకారాత్మక భావనలతో కూడిన వాతావరణం అన్ని వేళలా ఉండేట్టు శ్రద్ధ తీసుకోవాలి. అభిరుచితో కలిసిన ఉత్సాహంతో నాయకుడు ఎప్పుడూ తన బృందాన్ని ఉత్సాహపరచాలి. ఇంకా ముఖ్యమైన విషయం, పనిచేసే వారందరికీ ఇది సామూహిక విజయమనీ, తనొక్కడి గొప్ప కాదన్న భావం కలిగేటట్టు ప్రవర్తించాలి. ఆచరణలో ఏవైనా కొత్త విషయాలు తెలుసుకోవలసి వస్తే వాటి గురించి కూలంకషంగా చదవాలి. బృందంలో చర్చించాలి. వేరే వారు ఇచ్చిన మంచి సలహాలను తీసుకోవాలి. ప్రతి స్థాయిలో ప్రతి చర్యకు ఫలితం గురించి ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకోగలిగిన మేధావే కార్యసాధక దార్శనికుడు అవుతాడు. ఇందులో ఏ గుణం లోపించినా కలల విజనరీగా మిగిలిపోతాడు.
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పుడు ఎన్నికల్లో గెలిచి ఇక్కడ టీఆర్ఎస్; ఆంధ్రలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ మీద అభిమానంతో కాంగ్రెస్ నాయకుల దోపిడీకి రోసి, టీడీపీలో చేరిన కేసీఆర్ తెలంగాణపై చంద్రబాబుకు ఉన్న వ్యతిరేకతతో ఆ పార్టీ నుంచి కూడా బయటికి వచ్చారు. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని ఉచ్చరించకుండా నిషేధించడం, కరెంటు కోసం ధర్నా చేస్తున్న రైతుల మీద బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపించిన టీడీపీ నాయకుడు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తెలంగాణ వ్యతిరేక చర్యలకు ఆవేదన చెంది పార్టీ వీడిన కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా చేశానని, వాజపేయిని ప్రధానమంత్రిగా సూచించానని, మొబైల్ ఫోన్ దేశంలోకి తెమ్మని తనే వాజపేయికి సలహా ఇచ్చాననీ, రాజకీయాల్లో తనకు జూనియర్ అయిన నరేంద్ర మోదీకి శిక్షణ ఇచ్చానని చెప్పుకొనే చంద్రబాబు.. కేసీఆర్‌ను కూడా తన శిష్యగణంలో వేసుకోవడంలో ఆశ్చర్యం లేదు.
అయితే, చాలామందికి తెలియని విషయం ఏమంటే… 1995లో చంద్రబాబు చేజిక్కించుకున్న టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన విజయవంతమైన పథకాలన్నీ కేసీఆర్ మేధలోంచి పుట్టినవే! అంతేకాదు, ఆయన పార్టీలో ఉన్నంతకాలం ఎన్నికైన జూనియర్ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. మరి ఈ గురుపీఠం అధిరోహించిన చంద్రబాబు, టీఆర్ఎస్ నాయకుడు ఒకేసారి 2014లో రెండు పొత్తు వీడిన రాష్ర్టాలైన తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులయ్యారు. ఇక వారిద్దరి పాలన ఐదేండ్లు ఎలా సాగిందో చూడటం వల్ల ఎవరు దార్శనికుడై, కార్యసాధకుడిగా నిరూపించుకున్నారో, ఎవరు కలలు కనే విజనరీగా మిగిలారో పోల్చిచూద్దాం. అంతేకాదు, చంద్రబాబు కంటే ముందే టీడీపీలో చేరిన కేసీఆర్ ఎమ్మెల్యేగా ముందే గెలిచారు. కేంద్ర మంత్రి పదవి కూడా పొందారు. ఇంకొక్క ముఖ్య విషయం. ఒకరి పొత్తు లేకుండా చంద్రబాబు టీడీపీ ఎప్పుడూ ఎన్నికలలో గెలవలేదు. ఆయనలాగా కేసీఆర్ ఇంకొకరు స్థాపించిన పార్టీ గుంజుకోలేదు. స్వయంగా పార్టీని స్థాపించి, నిలిపి, 14 ఏండ్లు ఉద్యమం చేసి రాష్ట్రం సాధించి, దానికి ముఖ్యమంత్రి అయ్యారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైనప్పుడు ఈ ప్రాంతం 58 ఏండ్లు విధ్వంసానికి, దోపిడీకి గురై, ఉన్న వనరులు అభివృద్ధికి వాడక చాలా నిర్వీర్యమై ఉంది. అటువంటి రాష్ర్టానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి వలస పాలకులు తమ అవినీతితో తెలంగాణ సంపద దోచుకొని స్వయంగా బాగుపడ్డారు కానీ, ఆంధ్ర ప్రాంతాన్ని బాగు చెయ్యలేదు. ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకుండానే ఉండిపోయాయి. 2014 తర్వాత ప్రతి రంగంలోనూ ఎటువంటి మార్పులు వచ్చాయో విశ్లేషిద్దాం. ఒక రాష్ట్ర అభివృద్ధి ముఖ్య నాయకుడైన ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల పథకాలను రంగాలవారీగా పరిశీలించాల్సి వస్తుంది.
1.వ్యవసాయ రంగం: తెలంగాణలో దశాబ్దాల తరబడి చెరువులు పూడిపోయి, కుంటలు నాశనమై, ప్రాజెక్టులు కట్టకుండా వదిలివేయడంతో వ్యవసాయం కుంటుపడింది. కేవలం వర్షపు నీరు, బోరు నుంచి వస్తే ఆ నీరు మాత్రమే రైతులకు అందేది. దాంతో అరకొర పంటలు పండేవి. గొలుసుకట్టు చెరువుల సౌలభ్యంతో రకరకాల పంటలు పండించిన రైతులు సాగునీరు, కరెంట్ లేక అల్లాడారు. 1956 నుంచి 2014 దాకా సుమారు 40,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దుస్థితిని రూపుమాపడానికి కేసీఆర్ మొట్టమొదటగా వ్యవసాయరంగ పరిరక్షణ చేపట్టారు. కరెంట్ డిస్కంలన్నీ ఆంధ్రలో పెట్టిన వలస పాలకుల చర్య వల్ల, తెలంగాణ మీద కక్షతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు కరెంటు రాకుండా డిస్కంలను ఆపేశాడు. కేసీఆర్ పట్టు విడవకుండా రూ.17 వేల కోట్లు వెచ్చించి ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ నుంచి కరెంట్ తీసుకొచ్చి, రైతులకు ఉచితంగా 24 గంటలు అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటుచేశారు.
2018లో రెండోసారి ఎన్నికల్లో గెలిచాక, ఒక బృహత్తర పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును 2019 జూన్‌లో మొదలుపెట్టారు కేసీఆర్. కేవలం మూడేండ్లలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని తెలంగాణకు వరప్రదాయిని లాగ అందించారు. దాంతో బీడుపడిన తెలంగాణ పంటల, సిరుల తెలంగాణ అయ్యింది. ఇది రాష్ర్టానికి కేసీఆర్ తన మేధను రంగరించి, నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు జరిపి అతితక్కువ కాలంలో నిర్మించి ఇచ్చిన అతిపెద్ద బహుమతి. కరెంట్, సాగునీళ్లు ఇవ్వడమే కాకుండా పెట్టుబడి కోసం రైతుబంధు పథకాన్ని పెట్టి, ఎకరానికి రూ.ఐదు వేలు ముందుగానే ప్రతి పంటకు ఇచ్చి; రైతులు, ముఖ్యంగా సన్నకారు రైతులు అప్పుల పాలు కాకుండా కాపాడారు. ఇంకొక పథకం రైతుబీమా అందించారు. ఏ రైతు అయినా మరణిస్తే, రూ.5 లక్షలను అతని కుటుంబానికి సహాయంగా ఇచ్చారు. ఈ పథకాలతో తెలంగాణలో చాలా త్వరగా రైతులు కోలుకొని, వ్యవసాయం చేసి కేవలం తొమ్మిదిన్నరేండ్లలో వరి పంట ఉత్పత్తిలో దేశంలోనే మొదటివారుగా, ఎక్కువ పంటను పండించినవారుగా నిలిచారు. వలస పాలకుల వివక్ష వల్ల అర్ధ శతాబ్దం పాటు వ్యవసాయంలో కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందింది తెలంగాణ. అంతటి దార్శనికుడు, కార్య సాధకుడు కేసీఆర్.
ఇక 2014 నుంచి ఆంధ్ర పరిస్థితిని పరిశీలిద్దాం. వరి పంటకు ఆంధ్ర ప్రాంతం అన్నపూర్ణగా పేరుగాంచింది. ముఖ్యంగా 1956 తర్వాత తెలంగాణను ఎండబెట్టి ఆంధ్ర ప్రాంతానికి పారించుకున్న కృష్ణా, గోదావరి నీళ్లతో ఆంధ్ర ప్రాంతంలో భూమి అంతా సారవంతంగా మారి పంటల సిరి మెరిసింది. అయితే, ఏపీ ముఖ్యమంత్రి ఒక కలల రాజధానిని తన విజన్‌గా ప్రవేశపెట్టాడు. విజయవాడకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, ప్రపంచంలోనే పెద్ద నగరాన్ని నిర్మించాలని సంకల్పించాడు చంద్రబాబు నాయుడు. శివరామకృష్ణ కమిటీ, ఇతర నిపుణులు సూచించిన ప్రదేశాలు కాకుండా, వారు సమర్థించని ప్రదేశాన్ని అందుకు నిర్ణయించాడు. బౌద్ధారామం ఉన్న అమరావతి చుట్టుపక్కల 29 సస్యశ్యామలమైన గ్రామాలు, కృష్ణా నది ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని రాజధాని కోసం ప్రతిపాదించడం వల్ల కొన్ని అడ్డంకులు వస్తాయని నిపుణులు హెచ్చరించారు.
అయినా అక్కడి రైతులను సామదానదండోపాయాలతో ఒప్పించి దాదాపు 34 వేల ఎకరాలను రాజధానికి కేటాయించాడు చంద్రబాబు. అయితే, ఒక విజనరీ తీసుకోవలసిన జాగ్రత్తలు లేకపోవడం వలన, వ్యయానికి అయ్యే ధనం సమకూర్చుకునే సమర్థత లోపించడం వల్ల, 1953లో అప్పటి నాయకులు కర్నూలులో చేసిన అరకొర పనులలాగే, అమరావతి కూడా ఏ ఉపయోగం లేకుండా 2014 జూన్ 8 నుంచి ఈ రోజు 2025 వరకు ఉన్నది. కోట్లు ఖర్చుపెట్టి అట్టహాసంగా శంకుస్థాపన చేసిన కలల నగరం కలగానూ, యానిమేషన్ సహాయంతో ఫొటోలలోనూ మిగిలిపోయింది. ఈ విజన్‌లో లోపాలు చాలా ఉన్నాయి. సరైన ప్రాంతాన్ని ఎన్నుకోకపోవడం, దానికయ్యే ఖర్చును సరిగ్గా బేరీజు వేసుకోకపోవడం, ఒకవేళ సుమారుగా దాని వ్యయం గురించి అంచనా ఉన్నా, ఆ ధనంలో సగమైనా సమకూర్చుకోకపోవడం! అందుకే ఐదేండ్లలో అమరావతిలో కనీసం శాసనసభ, హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణం కాలేదు.
రాజధాని కలలోనే ఉంది. పైగా 27 రకాల పళ్లు, కూరగాయలు పండించే చక్కటి నేలలో వ్యవసాయం విధ్వంసమైంది. ఆంధ్ర రాష్ట్రం ఇతర రాష్ర్టాల నుంచి బియ్యం కొనుక్కునే దుస్థితి వచ్చింది. ఆ భూములిచ్చిన రైతులూ నష్టపోయారు. అనువుకాని చోట రాజధాని అంటూ మొదలుపెట్టి ఆ భూమి సేకరణ కోసం డబ్బులు – వేల కోట్లు వెచ్చించటంతో రాష్ట్ర ప్రజల మీద లక్షల కోట్ల అప్పుల భారం పడుతున్నది. ఈ పరిస్థితి ఆ విజనరీ వైఫల్యమే కదా! మిగతా రంగాల గురించి వచ్చే వ్యాసంలో..!
-కనకదుర్గ దంటు ,89772 43484