ఎందుకిట్లా అయ్యారని కేవలం మేధావుల గురించి ఆలోచించటం వల్ల ఉపయోగం లేదు. వారి విషయం మాత్రమే ఆలోచించటంతో సమాధానం కూడా దొరకదు. ఎందుకంటే వారిని పరిస్థితులు అట్లా తయారుచేస్తున్నాయి. పరిస్థితులు అనారోగ్యకరంగా ఉన్నట్లయితే వాటికి భిన్నంగా ఆలోచించి సమాజానికి మార్గదర్శనం చేయటం కదా మేధావుల బాధ్యత అనే సందేహం కలగవచ్చు. అది నిజమే. ఆ విధంగా చేసినవారు అనేకులు కన్పిస్తారు. వారు సమాజాన్ని చైతన్యపరిచి సంఘ సంస్కరణల నుంచి విప్లవాల వరకు అనేక మార్పులకు దోహదం చేశారు. కనీసం ఆ దిశగా అలుపు లేని కృషిని తమ జీవితాంతం వరకు చేశారు.
తెలంగాణ విషయానికి వస్తే పరిస్థితి ఏమిటి? అటువంటి మేధావుల తరం బాలగోపాల్‌తో ముగిసిపోయింది. వరవరరావు, గద్దర్‌లను ఈ పరిధిలోకి తీసుకురావటం లేదు. వారు విప్లవకారులు. మెయిన్‌స్ట్రీమ్ అనబడే పరిధిలోకి ఇమడని వారు గనుక. అందువల్ల బాలగోపాల్ తర్వాత మనకిక మిగిలింది శూన్యం. ఇంకా మేధావులమని చెప్పుకునేవారు, లేదా చెప్పబడేవారు, సమాజాన్ని చైతన్య పరుస్తున్నది, ఉత్తేజపరుస్తున్నది ఏమీ కన్పించదు. అంతేకాదు. రొటీన్ గానుగ బండ వలె మిగిలిపోయారు.
ఇందుకు సమాధానం, పైన అనుకున్నట్టు, కేవలం వారి గురించి ఆలోచించటం వల్ల దొరకదు. ముఖ్యంగా వారు రొటీన్లో గానుగ బండ వలె మిగిలిపోయారు తప్ప, రొటీన్‌కు భిన్నంగా ఆలోచించి పనిచేసేవారు కాకుండాపోయారు గనుక. అటువంటప్పుడు వారిని ఏ పరిస్థితులు అట్లా తయారుచేస్తున్నాయంటూ, సమాధానాన్ని పరిస్థితులలో వెతకాలి. మ్యాన్ అండ్ హిజ్ టైమ్స్ అనే మాట ఒకటుంది గదా. అదే పద్ధతిలో ప్రస్తుతపు సోకాల్డ్ మేధావులు అండ్ దెయిర్ టైమ్స్ అన్న మాట. అట్లా అర్థం చేసుకున్నప్పుడు వీరిపై వ్యతిరేకతకు బదులు సానుభూతి కలుగుతుంది.
ఈ స్థితికి ఆరంభాన్ని బహుశా 1991లో సోవియెట్ యూనియన్ పతనం నుంచి వెతకాలి. వర్తమాన తరాలకు సంబంధించిన సామాజిక మేధావులలో స్థూలంగా మూడు విధాలైన వారున్నారు. ఈ చర్చలోకి అకడమిక్ మేధావులను తీసుకురావటం లేదు. కనుక సామాజిక మేధావులంటున్నాము. ఆ ముగ్గురిలో ఒకరు, మితవాద భావనలు కలవారు. వారు సామాజిక చైతన్యాలు, పరివర్తనల గురించి ఆలోచించేవారు కాదు గనుక వారిని కూడా వదిలివేద్దాము. మిగిలిన ఇద్దరిలో ఒకరు పూర్తిగా వామపక్ష భావజాల పరిధిలోని వారు కాగా, మరొకరు ఉదారవాదులు, సాధారణ రూపంలో అభ్యుదయవాదులు.
వామపక్ష పరిధిలోని వారిలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలను, విప్లవ పార్టీలను అనుసరించే వారుంటారు. వాటిమధ్య తేడాలలోకి ఇక్కడ పోవటం లేదు. కాకపోతే ఒక మాట మాత్రం అనుకోవచ్చు. ఉభయ కమ్యూనిస్టులను అనుసరించే మేధావులలోనూ అనేకానేకులు, ఆ పార్టీల క్షీణత కారణంగా ఉదారవాదులుగా, సాధారణ అభ్యుదయవాదులుగా మారిపోతున్నారు. కొందరు అంతకన్నా కిందిస్థాయికి పోతున్నారు. అయినప్పటికీ ప్రస్తుత చర్చ కోసం వారిని కూడా పక్కకు పెడదాము. ఇంకా చెప్పాలంటే, ఈ ప్రభావాలు క్రమంగా విప్లవ పార్టీల అనుయాయ మేధావులపైన సైతం పడటం కనిపిస్తున్నది. మొత్తానికి ఈ రకరకాల వామపక్షీయులందరినీ పక్కన ఉంచితే మిగిలేది ఉదారవాదులు, సాధారణ అభ్యుదయవాదులు.
తక్కినవారిని వదిలివేసి ప్రత్యేకంగా వీరిగురించి చర్చించటం ఎందుకన్నది ప్రశ్న. అందుకు కొన్ని కారణాలున్నాయి. అవి సమాజ స్వభావానికి సంబంధించినవి. సమాజం, లేదా సాధారణ ప్రజలు సాధారణ సమయాలలో ఇటు మితవాదంతోనో, అటు అతివాదంతోనో ఆలోచించరు. మధ్యస్థంగా ఉంటారు. వారిలోనూ ఉదారవాదం, మంచితనం, ఆ మేరకు అభ్యుదయ లక్షణాలుంటాయి. అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని బట్టి మితవాదులు, లేదా అతివాదులు అవుతారు. అనగా, సర్వసాధారణంగా వారి ఆలోచనా ధోరణికి, ఉదారవాద-అభ్యుదయవాద మేధావుల ధోరణికి దగ్గరితనం ఉంటుంది.
ఒకవిధంగా వారు సహజమిత్రులన్న మాట. అందువల్ల, సాధారణ సమయాలలో ప్రజలు మితవాద మేధావులను, అతివాద మేధావులను కాదని, ఉదారవాద-అభ్యుదయ వాద మేధావుల మధ్యే మార్గానికి ఎక్కువ విలువ ఇస్తారు. దానిని అనుసరిస్తారు. ఆ కారణంగానే ప్రస్తుత సందర్భంలో ఈ వర్గం గురించి చర్చిస్తున్నాము. ఇప్పుడు తెలంగాణలో మితవాదం లేదు, అతివాదం లేదు. మధ్యేవాద పరిస్థితులు, ఆలోచనా ధోరణులే ఉన్నాయి.
ఈ మాటలు చెప్పుకొన్నాక, కొద్దిగా నేపథ్యాన్ని చూడాలి. తెలంగాణలో కొంతకాలం కిందటి వరకు అతివాద ఆలోచనలు (ఇందులో సీపీఐ నుంచి నక్సలైట్ల వరకు అందరినీ కలిపి స్థూలంగా మాట్లాడుతున్నాము) ప్రబలంగా ఉండేవి. అన్యాయాలకు వ్యతిరేకంగా, ప్రత్యేక రాష్ట్రం కోసం తీవ్ర భావనలతో జరిగిన సుదీర్ఘ ఉద్యమాన్ని కూడా ఈ వరుసలోనే చేర్చుతున్నాము. ఈ రెండు జరిగినంతకాలం వాటి ప్రభావాలు ఉదారవాద, సాధారణ అభ్యుదయవాద, మధ్యేమార్గ మేధావులపై ఉండేవి. వారి వ్యవహరణ అందుకు అనుగుణంగా ఉండేది. కనుక కేవలం మధ్యేమార్గంలో గాక, కొంత ఎడమకు మొగ్గి ఆలోచించేవారు.
మరొక మాటలో చెప్పాలంటే అప్పటిదంతా ఒక విధమైన ప్రత్యేక వాతావరణం గనుక వారి తీరు అదే పద్ధతిలో ఉండేది. అయితే వారు స్వయంగా తమ ఉదారవాద స్వభావాన్ని బట్టి గాని, సాధారణ అభ్యుదయ ధోరణిని బట్టి గాని, మితవాదుల వలెనో, అతివాదుల వలెనో, నిర్దిష్టమైన, ఖచ్చితమైన భావ ధోరణులు గలవారు కాదు. ఉదారవాదులు, సాధారణ అభ్యుదయవాదుల స్వభావం ఎప్పుడైనా అంతే. అందులోనూ, పైన అనుకున్నట్టు, అతివాదం బలంగా ఉండినంతకాలం ఆ ప్రభావాలకు లోనైన వారు, అది బలహీనపడటంతో పక్కకు జరిగి సాధారణ మధ్యేమార్గ ధోరణికి దగ్గరవుతారు. తమ గతంతో వారికి బంధం బలహీనపడుతుంది.
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నది అదే. మధ్యేమార్గ ధోరణికి దగ్గరకావటమంటే అనివార్యంగా తాము నిన్నటిస్థాయి అభ్యుదయవాదానికి దూరంగా జరిగి, సమాజంలో, రాజకీయాలలో, పరిపాలనలో జరిగే పరిణామాల పట్ల అంతే సాధారణంగా ఆలోచించటం, వ్యవహరించటమన్నమాట. వారిపై వామపక్ష భావజాల ప్రభావాలు బలహీనపడటం మొదటి దశ. పైన చెప్పుకున్నట్టు బాలగోపాల్ మరణం అందుకు తుది ఘడియ. వరవరరావు వంటి వారు క్రియాశీలతలో లేరు. తెలంగాణ భావజాలం కనీసం ఉద్యమకాలంలో వలె లేదు. ఇటువంటి స్థితిలో, కేవలం ఇసుక భూమి వంటి పునాదులపై నిలిచే మధ్యేమార్గ, ఉదారవాద, సాధారణ అభ్యుదయవాద మేధావి తరగతి రకరకాల బలహీనతలకు, అయోమయాలకు, ఊగిసలాటలకు లోనవుతూ, చుక్కాని లేని పడవ వలె సాగుతుంటుంది. వారికి కొత్త రాజకీయ సానుభూతులు మొదలవుతాయి.
ఈ తరగతి మేధావి వర్గం మనకు ప్రస్తుతం కనిపిస్తున్నది ఆ విధంగానే. వివిధ పరిస్థితుల మధ్య వారొక కొత్త చట్రంలో బిగుసుకుని పోయారు. అందువల్ల బీఆర్ఎస్ పాలననైతే యథేచ్ఛగా విమర్శించారు. కనీసం ఒక్క మంచినైనా గుర్తించలేని నిజాయితీరాహిత్య స్థితికి పతనమయ్యారు. వరుసగా కనిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలలో ఒక్కదానినైనా ఎత్తిచూపగల నిజాయితీ లేని వారిగా తెలంగాణ ప్రజల దృష్టిలో మిగులుతున్నారు.
అందుకు సంబంధించిన ప్రశ్నలు ఏవైనా ఎదురైతే కళ్లు వాల్చుకుని మొహం దింపుకోవటం, వినిపించీ వినిపించని అరకొర మాటలతో నీళ్లు నమలటం మినహా మరొకటి చేయలేని బలహీనత ఏదో వారిని ఆవరించింది. ప్రభుత్వం రానున్న రోజులలోనైనా ప్రజలకిచ్చిన హామీలు అమలుపరిచి, బాగా పాలించి, తమను తిరిగి తల ఎత్తుకునేట్టు చేయకపోతుందా అనే ఆశలతో జీవిస్తున్నారు. కానీ, మేధావులు చేయవలసింది అదికాదు కదా? మొన్నటివరకు బీఆర్ఎస్ పట్ల చేసింది కూడా అది కాదు. అయితే, వారిని ఈ విధంగా తయారుచేసింది పరిస్థితులని, అందుకు భిన్నంగా వ్యవహరించగల శక్తిని వారు కోల్పోయారని, ఒక కొత్త చట్రంలో ఇరుక్కున్నారని, అదెట్లా జరిగిందోనని పైన చెప్పుకున్నాము. చివరగా, తమపై సమాజం ఒక ఆశ పెట్టుకోవచ్చునేమో చూడాలి. నేడు కానట్టయితే రేపు తెలంగాణ సమాజం తిరిగి తన చైతన్యాన్ని తెచ్చుకున్న పక్షంలో, కనీసం ఆ ప్రభావంతో ఒత్తిడితో వీరు కూడా తమ ప్రస్తుత చట్రం నుంచి బయటపడవచ్చునా?
– టంకశాల అశోక్