‘కంచె చేను మేస్తే…’ అనే నానుడి కేంద్ర ప్రభుత్వ తీరుకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. రైతును కాపాడాల్సిన కేంద్రం రైతుపై పగవడుతున్నది. ‘జై జవాన్ జై కిసాన్’ అన్న నినాదం మర్చిపోయినట్టుంది మన కేంద్రం. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని వేర్వేరుగా చూసినట్లు కొన్ని రాష్ర్టాల పట్ల వివక్ష చూపుతున్నది. ఇప్పుడిప్పుడే బాధరబందీలు లేకుండా బతుకుతున్న రైతన్న నోట్లో మన్ను కొట్టేందుకు సిద్ధమవుతున్నది. తెలంగాణ వడ్లను కొనమంటే, కేంద్రం కొనబోమని మొండికేయడం అందులో భాగమే కదా..?
దేశంలో ఏ మూలన ఉన్నా.. తమకు బాధ వస్తే రైతులు కేంద్రానికి మొర పెట్టుకుంటారు. అలాంటి రైతు కంట్లో కేంద్రమే నలుసైపోతే ఆ రైతు ఎవరికి చెప్పుకోవాలి? కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాంత, రాష్ట్ర రైతు అయినా భేదాభిప్రాయాల్లేకుండా అందరికీ ఒకేవిధమైన సౌకర్యాలు కల్పించాలి. అదే విధంగా ప్రజల ఉపాధి జీవనంగా ఉన్న వ్యవసాయ వసతులు కూడా అన్ని రాష్ర్టాలకు సమంగా అందించాలి. కనీస మద్దతు ధర అందరికి అందాలి. ఆ క్రమంలోనే రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం బాధ్యత. కానీ కొన్ని రాష్ర్టాల్లో మాత్రమే గోధుమ, వరి ధాన్యాన్ని కొంటాం కానీ తెలంగాణలోని వరిని కొనలేమనటం వివక్ష కాకుండా మరేం అవుతుంది?
ఇది సమాఖ్య భావనకు తీవ్ర భంగకరం. రాజ్యాంగానికి విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి అడ్డంకి కలిగించటమే. కేంద్రం తెలంగాణలోని 56 లక్షల రైతు కుటుంబాల జీవితాలను చిన్నాభిన్నం చేయడం, ఆర్థికంగా దిగజారడానికి కారణం కావటం గర్హనీయం. ప్రపంచవ్యాప్తంగా గతేడాది దాదాపు 700 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తయింది. వరి పండించే దేశాల్లో తొలిస్థానం చైనా 142 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి చేయగా, రెండో స్థానంలో భారత్ 122.27 మిలియన్ మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని పండించింది.
ప్రపంచవ్యాప్తంగా చెరకు, మక్కజొన్న తర్వాత 3వ అత్యంత దిగుబడినిచ్చేది వరి కావడం విశేషం. అయినా.. 1964లో దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడింది. అప్పట్లో దేశంలో 33.82 మిలియన్ హెక్టార్లలో కేవలం 30.58 మిలియన్ టన్నుల వరి దిగుబడి వచ్చేది. అంటే హెక్టారుకు 937 కిలోలు మాత్రమే. ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో హెక్టారుకు 2,578 కిలోలు పం డుతున్నది. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పంజా బ్, హర్యానాలో వరి ధాన్యం ఉత్పత్తికి ఊతం ఇవ్వడానికి రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించారు. దీనిద్వారా ఆ రాష్ర్టాలకు కేంద్రమే అనేక సబ్సిడీల ద్వారా విత్తనాలు, ఎరువులు, యంత్రాల కొనుగోళ్లను ప్రోత్సహించింది. అలా ఆ రాష్ర్టాల్లో 1966లో మొదటిసారి గోధుమ, బియ్యానికి కనీస మద్దతు ధర నిర్ణయించారు. అలా ఈ రోజు మండీలలో ఎఫ్‌సీఐ ద్వారా 90 శాతం వరి, గోధుమను పంజాబ్ రాష్ట్రంలో కొంటున్నది. ఇది 1966 నుంచి ఇప్పటికీ కొనసాగిస్తూ, మిగతా రాష్ట్రాలను విస్మరించడం మంచిది కాదు. కేంద్రం మిగతా రాష్ట్రాల్లో 10 శాతమే కొంటున్నది.
2014లో వరి ఉత్పత్తి రాష్ర్టాలలో 10వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం నేడు 2వ స్థానానికి చేరడం రాష్ట్ర వ్యవసా య విస్తరణను సూచిస్తుంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ లాంటి పథకాల కారణంగా ఈ రోజు మన రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకోవడం గర్వించదగిన విషయం. ఇలాం టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఉండాలి. పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలుకు ప్రోత్సహించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతూ వరి ధాన్యాన్ని కొనబోమని చెప్పటం బాధ్యతారాహిత్యమే.
పంజాబ్‌లో 64.6 శాతం భూమి 7.6 లక్షల కుటుంబాల దగ్గర ఉన్నది. సుమారు 10 లక్షల కుటుంబాలు మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయి. అదే తెలంగాణలో దాదాపు 56 లక్షల కుటుంబాలు వ్యవసాయాన్ని ప్రధాన వనరుగా చేసుకొని జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్న, చిన్నకారు రైతులు అంటే 5 ఎకరాల్లోపు వారు 53 లక్షల కుటుంబాలున్నాయి. వారి దగ్గర దాదాపు 89 శాతం భూమి ఉండటం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులపై ఉన్న మమకారంతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఈ రోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరిధాన్యం ఉత్పత్తి అవుతున్నది. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న రైతుల జీవనవిధానం కేంద్ర ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పంథాలో ముందుకుసాగటానికి కేంద్రం ఇతోధికంగా సహకరించాలి. రైతులను అన్ని విధాలా ప్రోత్సహించాలి. పండించిన పంటకు 1966లో సూచించినట్లుగా నేటి పరిస్థితులకు అనుగుణంగా కనీస మద్దతు ధర అమలుచేయాలి. ‘రైతును రాజు చేస్తాం’ అని మన్‌కీ బాత్‌లో చెప్పడం కాదు చేసి చూయించాలి.
–బైరి నిరంజన్ , 93901 15644