లేబర్ కోడ్ల అమలుకు ఆదేశాలు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో కనీసం చర్చలు జరపడం లేదు. పైగా కొత్త చట్టాలు కార్మిక సంక్షేమం కోసమే తీసుకొచ్చామని గొప్పలు చెప్తూ ప్రసార మాధ్యమాల్లో కేంద్ర పాలకులు, బీజేపీ నేతలు విస్తృతంగా ఊదరగొడుతున్నారు. వాస్తవానికి కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు కట్టుబానిసలుగా మార్చడమే ఈ లేబర్ కోడ్ల లక్ష్యం. అప్రెంటీస్‌లు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, కాంట్రాక్ట్ కార్మికులు, స్కిల్ వర్కర్లు ఇలా పలు విధానాల కారణంగా పర్మనెంట్ కార్మికులు అనే విధానం ఈ కోడ్ల మూలంగా నిర్వీర్యమవుతున్నది. అంతేకాదు, దేశ కార్మిక శక్తిలో ముఖ్యమైన అసంఘటితరంగ కార్మికులను ఈ చట్టం నిరాశలోకి నెట్టివేస్తున్నది. కార్మికులకు కఠినమైన శిక్షలు, పెనాల్టీలు విధించే వెసులుబాటు కల్పిస్తుండటం శోచనీయం.
ఒకవైపు లేబర్ కోడ్స్, మరోవైపు భారత న్యాయ సంహిత ద్వారా న్యాయమూర్తుల అధికారాలను కత్తిరించి, పోలీసులకు కేంద్రం అధికారాలను కట్టబెడుతున్నది. శ్రమ నీతి పేరిట శ్రమ చేయడమే కార్మికుల ధర్మమని, ఫలితం మాత్రం యాజమాన్యాలు చూసుకుంటాయనే కొత్త సూత్రీకరణను కేంద్రం చేసింది. ఫైర్ అండ్ రెస్క్యూ సేవల్లో డ్రైవర్లకు పదేండ్ల జైలు శిక్ష, ఏడు లక్షల జరిమానా విధిస్తుండటం బాధాకరం. కోర్టుల పర్యవేక్షణ లేకుండా కార్మిక సంఘాల నాయకులను జైలుకు పంపే నిబంధనలు అత్యంత అమానవీయం.
అంగన్వాడీ, ఆశాలు, మిడ్ డే మీల్స్‌లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించడం లేదు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం మొన్నటివరకు కార్మికుల తొలగింపు అత్యంత కష్టతరంగా ఉండేది. కానీ, కేంద్రం తాజాగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లు ఫైర్ అండ్ హైర్ విధానానికి అనుమతిస్తున్నాయి. మానవీయ పరిస్థితులు, తొలగింపు పరిహారాలు, నోటీస్ పేలు.. ఇవన్నీ లేకుండానే నియమించుకునే, తొలగించే స్వేచ్ఛను యాజమాన్యాలకు లేబర్ కోడ్ ఇస్తున్నది. భారతదేశంలో దశాబ్దాలుగా అమల్లో ఉన్న పాత కార్మిక చట్టాలు కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతన రక్షణ, సామాజిక భద్రత కల్పించడంలో కీలకపాత్ర పోషించాయి. అయితే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు దశాబ్దాలుగా అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి.
లేబర్ కోడ్లలో లేబర్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల అధికారాలను తొలగించారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణను ఎత్తివేసి, ఏకపక్షంగా యాజమాన్యాల సెల్ఫ్ డిక్లరేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల కార్మికుల భద్రత ప్రమాదంలో పడుతుంది. అలాగే కార్మిక సంఘాల ఎన్నికల్లో లేబర్ డిపార్ట్మెంట్ జోక్యాన్ని తొలగించారు. దీని వల్ల సంఘాలపై యాజమాన్యాల ఆధిపత్యం పెరుగుతుంది. గతంలో కార్మికులు, ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడానికి పోరాటాలు చేసేవారు. యాజమాన్యాలను సంప్రదించేవారు. ఇప్పుడు ఆ పోరాటాలు, సంప్రదింపులను నామమాత్రం చేసేశారు.
పని గంటల విషయంలోనూ లేబర్ కోడ్లు కార్మికులకు తీరని నష్టం చేస్తున్నాయి. చికాగో అమరుల రక్తంతో సాధించుకున్న చట్టాల ప్రకారం కార్మికులు రోజుకు 8 గంటలు పని చేయాల్సి ఉండగా, కొత్త కోడ్లలో రోజుకు 10-12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు. అదే సమయంలో ఉద్యోగావకాశాలు తగ్గి నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుంది. హైర్ అండ్ ఫైర్ విధానానికి చట్టబద్ధత కల్పించడం ద్వారా ఉద్యోగ భద్రత లేకుండా చేశారు. ఓవర్ టైం వేతనం లేకుండానే వారంలో 48 గంటల ప్యాకేజ్ అనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావడం అన్యాయం.
లేబర్ కోడ్లు సామాజిక భద్రతనూ విస్మరించాయి. ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి పథకాలకు అర్హత పొందేందుకు కార్మికుల సంఖ్య పరిమితిని 100 నుంచి 300కి పెంచడం సరికాదు. దీని వల్ల చిన్న చిన్న సంస్థల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికులు సామాజిక భద్రతకు దూరమవుతారు.
గ్రాట్యుటీ, బోనస్, కనీస వేతనం వంటివి కూడా బలహీనంగా మారాయి. కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను నియంత్రించాల్సిన ప్రభుత్వమే దాన్ని చట్టబద్ధం చేయడం దారుణం. భవన నిర్మాణరంగానికి సంబంధించి అసంఘటిత రంగ కార్మిక సంక్షేమ బోర్డుల అధికారాలను లేబర్ కోడ్లలో పూర్తిగా తగ్గించివేశారు. గతంలో సంక్షేమ బోర్డులలో ప్రభుత్వ ప్రతినిధులు ప్రాతినిధ్యం అధికంగా ఉండేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధుల ప్రాతినిధ్యాన్ని తగ్గించి, కార్మికులతో సమానంగా యాజమాన్య ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని లేబర్ కోడ్‌లో పేర్కొన్నారు.
దీనివల్ల బోర్డులలో వారి నియంత్రణ పెరిగి, కార్మికుల పాత్ర తగ్గిపోతుంది. భవన నిర్మాణరంగంలో పనిచేసే కార్మికులకు బోర్డుల ద్వారా వచ్చే సంక్షేమ ప్రయోజనాలు యాజమాన్యాల ఆధీనంలోకి వెళ్తాయి. బోర్డుల ద్వారా కార్మికులకు నేరుగా అందాల్సిన ప్రయోజనాలు యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది.యాజమాన్యాలు ఇష్టానుసారంగా కార్మికులను తొలగించే వీల్లేకుండా గతంలో స్టాండింగ్ ఆర్డర్స్ చట్టం ఉండేది. లేబర్ కోడ్‌లో ఈ చట్టాన్ని బలహీనపరిచి, 300 మందిలోపు కార్మికులు ఉన్న సంస్థలకు స్టాండింగ్ ఆర్డర్స్ అవసరం లేదని నిర్ణయించారు. తత్ఫలితంగా ఉద్యోగ భద్రత గురించి పోరాడే హక్కును కార్మికులు కోల్పోతారు. సమాన పనికి సమాన వేతన చట్టం కూడా ఈ లేబర్ కోడ్లలో బలహీనంగా మారింది. టాప్ లెవెల్ పోస్టుల నుంచి కింది స్థాయి వరకు వేర్వేరు వేతన విధానాలను లేబర్ కోడ్ అనుమతిస్తున్నది. దీంతో కార్మికుల మధ్య విభేదాలు పెరుగుతాయి.
41 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను నేరుగా రద్దు చేసి, మిగిలిన చట్టాల్లోని అంశాలను లేబర్ కోడ్లలో పొందుపరిచారు. పాత కార్మిక చట్టాల ప్రకారం పని ప్రదేశాల్లో పరిస్థితులపై యాజమాన్యాలు బాధ్యత వహించేవి. కానీ, ఇప్పుడు యాజమాన్యాలు ఆ బాధ్యత నుంచి తప్పుకొన్నాయి. కార్మికుల శ్రమపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉన్నది. కాబట్టి, వారి హక్కులను పరిరక్షించడం అత్యంత అవసరం. అందుకే లేబర్ కోడ్లను రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలనే డిమాండ్ న్యాయసమ్మతమైనది. ఈ నేపథ్యంలో తమ హక్కుల పరిరక్షణ కోసం కార్మికులు సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈ కోడ్లను కేంద్రం వెనక్కి తీసుకునే వరకు పోరాడాలి. కేంద్రం మెడలు వంచి రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసిన అన్నదాతల ఉద్యమమే ఇప్పుడు కార్మికులకు స్ఫూర్తి కావాలి.
ఇక రాష్ట్రంలో కనీస వేతనాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టింది. రెండేండ్లు గడిచినా ఆ హామీని అమలు చేయని రేవంత్ ప్రభుత్వంపై కూడా కార్మికులు, ఉద్యోగులు పోరాడాలి. లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు కార్మికులకు అండగా ఉంటామని, అవసరమైతే ఢిల్లీ వేదికగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్టీయూ నాయకత్వంలో విస్తృత స్థాయిలో పర్యటించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో కార్మికులు పోరాడితే పోయేదేమీ లేదు, బానిస చట్టాలు తప్ప.
లేబర్ కోడ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని కూడా కార్మికులు ఎండగట్టాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ జాతీయ స్థాయిలో లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో వాటిని అమలు చేయబోమని ప్రకటించడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నూతన కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్మికుల పక్షాన నిలుస్తుందా? లేదా ‘బడేభాయ్’ బాటలో నడుస్తుందా? అనేది చూడాలి.
(వ్యాసకర్త: పూర్వ ఉద్యోగ సంఘాల జాక్ చైర్మన్)
-దేవీప్రసాద్