ఎన్సీఆర్బీ-2019 ప్రకారం బడుగు బలహీన, దళిత వర్గాలపై దాడులు జరుగుతున్న ప్రధాన రాష్ర్టాలన్నీ బీజేపీ పాలనలో ఉన్నవే. 2014 నుంచి 2023 వరకు దశాబ్ద కాలంలో ఉత్తరభారతంలో దళితులపై అనేక మూకదాడులు జరిగాయి. ఆ దాడులను అడ్డుకోవాల్సిన బీజేపీ నేడు కొత్తగా కుల రాజకీయాలు చేయడం హాస్యాస్పదం. ఎన్నికలు వస్తే చాలు బీజేపీ ఎక్కడాలేని హడావుడి చేస్తుంది. ప్రజలను ఆకాశానికి ఎత్తే హామీలు ఇస్తుంది. అభివృద్ధిపై జరగాల్సిన చర్చను మళ్లించడానికి బీజేపీ ఇలాంటి విధానాలను అవలంబిస్తుంది. ఇందులో భాగంగానే బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ లాంటి అంశాలను ప్రస్తుతం తెరమీదికి తెస్తున్నది. ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్క తెలంగాణలోనే ఎందుకు ఇలాంటి హామీలు ఇస్తున్నదో, ఇక్కడి ప్రజలను మళ్లీ ఎందుకు మోసం జేయ చూస్తున్నదో అర్థం కావడం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాదిలో మత రాజకీయాలు చెల్లవని తెలిసి ఇక్కడ కుల రాజకీయాలు మొదలుపెట్టింది. హైదరాబాద్లో ఇటీవల జరిగిన విశ్వరూప సభలో ప్రధాని మోదీ చెప్పిన ఎస్సీ వర్గీకరణ ఈ కుట్రలో భాగమే.
బీజేపీ సాధారణంగా కుల ప్రాతిపదిక రాజకీయాలు చేయదు. అసలు ఆ పార్టీకి వాటిమీద కనీస అవగాహన కూడా లేదు. 1980 దశకంలో మండల్ కమిషన్కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించి, నేడు బీసీల పట్ల ఎక్కడాలేని ప్రేమ చూపించడం ఏమిటో అంతుచిక్కడం లేదు. ఎస్సీ వర్గీకరణ మీద కనీస అవగాహన లేకుండా ఎలా వర్గీకరిస్తారనేది ఇప్పుడు బీజేపీని ప్రజలు అడుగుతున్న ప్రశ్న. అసలు దేశంలో కులగణన చేయనిది, వర్గీకరణ ఎలా చేస్తారు? ఎస్సీ రిజర్వేషన్ను 15 శాతం నుంచి పెంచుతారా లేదా ఇదే కొనసాగిస్తారా అనేది మోదీ సమాధానం చెప్పాలి.
ఎస్సీ వర్గీకరణ అనేది జాతీయ అంశం. అలాంటిదానిపై జాతీయ ప్రణాళిక లేకుండా తప్పుడు హామీలు ఇవ్వడం బీజేపీ నాన్చివేత ధోరణని తెలియజేస్తున్నది. దళితులకు ఎస్సీ వర్గీకరణ ముఖ్యమైన అంశం. కానీ రెండు జాతీయపార్టీలు ఈ అంశంపై యాభై ఏండ్లుగా రాజకీయాలు చేస్తూనే ఉన్నాయి. దేశంలో ఈ రోజు కులగణన చేస్తేనే వర్గీకరణకు అవకాశం ఉంటుంది. నేడు దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే దేశంలో కులగణన తప్పనిసరి. కులగణన చేయాలనీ కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానాన్ని సైతం ప్రవేశపెట్టారు. కులగణన ద్వారా ఆర్థిక, సామాజిక, జీవన విధానం తెలుసుకునే అవకాశం ఉంది. బీహార్లో కులగణన చేయడం ద్వారా అక్కడి సామాజిక విధానం తెలుసుకోవడంతో 50 నుంచి 65 శాతానికి రిజర్వేషన్ పెంచింది. ఇదేవిధంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తే బడుగు, దళితవర్గాల జీవన విధానం స్పష్టంగా తెలుస్తుంది. కానీ, ఈ రోజు బీజేపీ కేవలం వాటిని రాజకీయానికి వాడుకుంటున్నదే తప్ప కులగణన చేసే ఆలోచన కానీ, ప్రతిపాదన కానీ ఆ పార్టీ దగ్గర లేదు. మరి ఈ కులగణన చేయకుండా దళితుల్లో అనేక కులాల్లో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులను బట్టి ఏ విధంగా ఈ రోజు వర్గీకరణ చేస్తారు? ఏ విధంగా వీరిని వర్గీకరిస్తారు? బీసీలో మాదిరి ఏ, బీ, సీ, డీగా వర్గీకరిస్తారా లేదా ఇంకా ఏమైనా ప్రతిపాదన ఉందా? అంటే అదీ అస్పష్టం.
దళితులకు న్యాయం చేయాలంటే కేంద్రం తక్షణమే కులగణన చేపట్టాలి. ఆ గణాంకాల ద్వారానే ఎస్సీ కులాలను వర్గీకరించవచ్చు. దేశంలో అత్యధిక ఎస్సీ జనాభా కలిగిన రాష్ట్రం యూపీ. అక్కడ కూడా రెండు పర్యాయాలు బీఎస్పీ అధికారంలోకి వచ్చినా ఈ వర్గీకరణ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. వీటన్నింటికీ ప్రధాన కారణం సరైన ప్రణాళిక, నిబద్ధత పార్టీలకు లేకపోవడమే. దళితులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడమే. నేడు బీజేపీ కూడా అదే పని చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ కంటే ముందు ప్రస్తుతం ఉన్న ఎస్సీలకు 15 శాతం నుంచి 20 శాతం రిజర్వేషన్ను పెంచాలి. తద్వారా వర్గీకరణ చేసిన కులాలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.
1992 ఇందిరా సహానీ తీర్పును మరోసారి పరిశీలించి రిజర్వేషన్ను పెంచాలి. ఈ విధంగా ఒక జాతీయ సమగ్రమైన ప్రణాళిక తీసుకువచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. కొంతమంది నాయకులను మాత్రమే అడ్డం పెట్టుకొని ప్రధాని మోదీ వర్గీకరణ గురించి మాట్లాడటం హాస్యాస్పదం. బడుగు, బలహీన వర్గాలకు బీజేపీ అనుకూలమని, వారు ప్రతి ఎన్నికల ముందు చేసే ఔట్రీచ్ ప్రోగ్రాంలో భాగమే అని చెప్పడానికి మాత్రమే ఇటీవల జరిగిన విశ్వరూప సభ తెలియజేస్తున్నది. కులగణన చేయనిదే వర్గీకరణ అసాధ్యమన్న సంగతి సైతం మోదీకి తెలుసు. ఉదాహరణకు మన రాష్ట్రంలో డక్కలి, మాదిగ, ఆర్యమాల, ఆది ద్రావిడ, బ్యాగరి, గోసంగి, హొయలు లాంటి 59 ఎస్సీ ఉపకులాలున్నాయి. వీరి ఆర్థిక, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకొని వర్గీకరణ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అన్ని కులాలకు న్యాయం చేసినట్టవుతుంది. వీరి ఆర్థిక, సామాజిక స్థితి తెలుసుకోవాలంటే కులగణన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కులగణన చేసి వర్గీకరణకు సంబంధించి కార్యాచరణను, సమగ్రమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న దళితులందరు ఇలాంటి బీజేపీ జిమ్మక్కుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. వర్గీకరణను సమగ్రంగా, సరైన ప్రణాళికతో బీజేపీ నిర్వహిస్తే అన్ని పార్టీలు మద్దతు తెలుపుతాయి. కానీ, కమిటీల పేరుతో కాలయాపన చేస్తే రాజకీయ పార్టీలతో సహా ప్రజలు కూడా ఉపేక్షించరనే విషయాన్ని తెలుసుకోవాలి.
-కన్నో జు శ్రీహర్ష
89851 30032