‘క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే’. దాన వీర శూర కర్ణ సినిమాలో దుర్యోధనుడి వేషం కట్టిన ఎన్టీఆర్‌కు చప్పట్లు కురిపించిన ఫేమస్ డైలాగ్ ఇది. కర్ణుడిని సూతపుత్రుడు అని అవహేళన చేయ డంపై మండిపడే దృశ్యం లోనిది. కులవివక్ష పోవాలని కోరుకోని ఆధునికులెవరూ ఉండరు ఈ రోజుల్లో. అదే సమయంలో కాలం చెల్లిన ఆధిపత్య భావజాలంతో విర్రవీగే వెర్రి సన్నాసులూ ఉంటారు. నిచ్చెనమెట్ల సమాజం అంటారు మనది. అలాంటి సమాజంలో శ్రామిక వర్గానికి చెందిన కొన్ని కులాల పేర్లు తిట్లుగా ఉపయోగించడం గతంలో ఉండేది. కానీ ఇప్పుడు అలా చేసేవారు బహు అరుదు. ఏ మాట జారితే ఎవరి మనసు గాయపడుతుందోనని! కానీ, ‘ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది మరోదారి’ అన్నట్టు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఇలాంటి మంచిమ ర్యాదలు ఏవీ ఉన్నట్టు లేవు.
రేవంత్ రెడ్డి గతంలో యాదవులను ఉద్దేశించి వెర్రిమొర్రి వ్యాఖ్యలు చేస్తే ఆ సామాజిక వర్గానికి చెందినవారు భగ్గుమన్నారు. దున్నపోతులతో నిరసన ప్రదర్శనలు జరిపి ఆయనకు గడ్డిపెట్టారు. ఆయన స్థాయి ఏందో చూపెట్టారు. అయినా ఆయనకు బుద్ధి రాలేదు. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్టు ఆ తర్వాత కూడా కొన్ని ఇతర కులాల పేర్లను తిట్లుగా ఆయన వాడారు. ఆత్మాభిమానం కలిగిన ఆయా కులాల వారు తిట్ల వర్షం కురిపించారు. ‘దున్నపోతుపై వర్షం’ సామెత ఇక్కడ గుర్తుకు రావడం తప్పు కాదు! అయితే, ఆయన ధోరణి ఇప్పటికీ మారలేదు. మారే సూచనలూ లేవు. పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన బీసీలపై గుండుగుత్తగా అక్కసు వెళ్లగక్కారు. బీఆర్ఎస్లోని బీసీ నేతలను లక్ష్యం చేసుకొని విషం చిమ్మారు. వారేదో ఊడిగం చేస్తున్నారంటూ, అలవాటు ప్రకారం సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారు.
సహజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని బీసీ మంత్రులు, నేతలు రేవంత్‌కు గట్టిగా సమాధానమిచ్చారు. తమ జోలికి వస్తే ఖబడ్దార్ అని ముక్తకంఠంతో హెచ్చరించారు. ‘నోరు మంచిదైతే ఊరు మంచిది అయితద’ని సామెత. బడాబాబులకు కొమ్ముకాసే అలవాటు తనది. అలవాటులో పొరపాటుగా అందరికీ అదే అంటగట్టాలని చూసి అభాసుపాలయ్యారు. అవాకులు చెవాకులు పేలితే ప్రజలు మెచ్చరు. అందలం ఎక్కించరు. రాతికిరాత్రే ఏదో అయిపోదామంటే కుదరదు. రేవంత్ తన నిస్పృహకు నోటి దురదను, దురుసును జత చేస్తున్నారు. ఇంతకూ రేవంత్‌కు ఇప్పుడు నిస్పృహ ఎందుకు? మూడు గంటల కరెంటు గురించి తన మనసులోని మాట బయటపెట్టుకొని అడ్డంగా దొరికిపోయారు. కాంగ్రెస్‌కు సెల్ఫ్‌గోల్ చేసిపెట్టి నాలుక కరుచుకున్నారు. ప్రభుత్వాన్ని గద్దె దించాలనే దుగ్ధ తప్ప ప్రజలకు ఏమి చేస్తారో చెప్పే దమ్ము లేని నేత ఇంతకన్నా ఏం చేయగలడు?