– రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమంలో నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ బానోత్ సరోజ
బూర్గంపహాడ్, సెప్టెంబరు 03 : గ్రామ స్థాయిలో పాలనను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలంటే ప్రజా ప్రతినిధులకు అందించే శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ బానోత్ సరోజ అన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన మూడు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణలో ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి రాష్ట్రస్థాయి శిక్షణకు ఇద్దరు మహిళా సర్పంచులు మాత్రమే ఎంపిక కాగా ఒకరు కొత్తగూడెంలోని లోతువాగు పంచాయతీ సర్పంచ్ అజ్మీరా లాలి కాగా మరొకరు బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ బానోత్ సరోజ కావడం విశేషం.
శిక్షణ ముగింపు కార్యక్రమంలో సరోజ మాట్లాడుతూ.. జిల్లాలో బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ నుండి ఎంపికైన వారిలో తాను ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ శిక్షణలో పంచాయతీల్లో ఘన వ్యర్ధాల నిర్వహణ, మత్తు పదార్ధాల నివారణ, బాలలపై వేధింపుల నివారణ, మహిళా నాయకత్వం, మహిళలపై హింస నివారణ, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఆత్మవికాసం, ప్రమాదాలు, వివాదాల నిర్వహణ, నాయకత్వంలో పారదర్శకత, నైపుణ్యాల అభివృద్ధి తదితర వాటిపై కీలక అంశాలపై శిక్షణ అందించడం గొప్ప విషయమన్నారు. అందించిన ఈ శిక్షణతో గ్రామ స్థాయిలో పాలనను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమానికి ఎంపిక కావడానికి డీపీవో అనూష, ఎంపీడీవో జమలారెడ్డి పూర్తి సహకారం అందించారన్నారు. అనంతరం శిక్షణ పూర్తికావడంతో శిక్షణా పత్రాన్ని నిర్వాహకులు సర్పంచులకు అందజేశారు.

‘సమర్ధవంతమైన గ్రామ పాలనకు శిక్షణ దోహదం’