‘తిండి కలిగితే కండ కలదోయ్’ అన్న మహాకవి మాట తినడానికి నోచుకోని నాటి కాలానికి సంబంధించినది. ఆహార ఉత్పత్తులలో స్వయం సమృద్ధి సాధించిన నేపథ్యంలో ‘నాణ్యమైన తిండి కలిగితేనే కండ కలదోయ్!’ అనే మాట నేడు సార్థకమవుతుంది. ప్రామాణికమైన ఆహార పదార్థాలతోనే ఆరోగ్యం సంతరించుకుంటుంది.
Food Safety | నేను ఒకసారి అమెరికా వెళ్లేటప్పుడు లండన్‌లోని హీత్రో విమానాశ్రయంలో విమానం మారవలసి వచ్చింది. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానని గ్రహించిన పాస్‌పోర్ట్ తనిఖీ అధికారులు.. ‘మరోసారి వచ్చేటప్పుడు హైదరాబాద్ బిర్యానీ తేగలరా’ అని అభ్యర్థించారు. మన హైదరాబాద్ బిర్యానీకి పర్యాయపదంగా మారిపోయిందని నాకు అప్పుడు అర్థమైంది. ఎక్కడో ఖండాంతరాలకు చేరుకుంటున్న హైదరాబాద్ బిర్యానీ ఘుమఘుమలు మనకు మాత్రం సుదూరమే. ఇప్పుడు అసలుసిసలైన హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్‌లోనే దొరికే పరిస్థితి లేదు. ఏ వంటకం చూసినా కల్తీమయం కావడమే అందుకు కారణం.
వంటలలో రారాజులాంటిది హైదరాబాద్ బిర్యానీ. కోడిగుడ్లు, మాంసం, నెయ్యి, కూరగాయలు, ఇతర దినుసులు వాడటం వల్ల ఇది ఆరోగ్యాన్ని ప్రసాదించే వంటకంగా తయారవుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. హైదరాబాద్ బిర్యానీలో పసుపు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, కుంకుమపువ్వు లాంటి అనేక పదార్థాలు కలుపుతారు. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాదు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లితో వంటకం రుచికరంగా తయారవుతుంది. వీటిలో సల్ఫర్ సమ్మేళనాలు, మెగ్నీషియం, విటమిన్ బీ6, విటమిన్ సీ ఉంటాయి.
అయితే బిర్యానీలో ఎన్ని పదార్థాలున్నా ఏం ప్రయోజనం.. ఆహార కల్తీ కారణంగా అసలు సిసలు హైదరాబాద్ బిర్యానీ కనుమరుగవుతున్నది. ఆహా.. అని తింటే తప్పక దవాఖానకు వెళ్లాల్సిన పరిస్థితి. నగరవాసులను ఆహార కల్తీ అంత తీవ్రంగా కలవరపెడుతున్నది. హోటళ్లు, రెస్టారెంట్లలో తాజా ఆహారంలో కుళ్లిపోయిన ఆహారాన్ని కలిపి వడ్డిస్తుండటం ఆందోళనకరం. చేపలు, మాంసం, కూరగాయలను తాజాగా ఉంచడానికి రెస్టారెంట్ల యాజమాన్యాలు కొన్ని రసాయనాలను ఉపయోగిస్తుండటంతో కల్తీ జరుగుతున్నది. బేకరీ ఉత్పత్తులలో కలిపే రసాయనాలు విష పదార్థాలుగా ప్రభావం చూపుతాయి. బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు హానికరమైన రసాయనాలు చేరి ఆహార పదార్థాలు కలుషితం అవుతున్నాయి. సరైన పరిశుభ్రత పద్ధతులు పాటించకపోవడం, పురుగు మందుల వినియోగం, రుచి కోసం వాడే రసాయనాలు ఇందుకు దారితీస్తున్నది.
యూరోపియన్ యూనియన్ ఫుడ్ సేఫ్టీ అధికారుల నివేదిక ప్రకారం.. మన దేశంలో సుమారు 527 రకాల ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక ఇథలీన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంది. వీటిలో నిత్యం మనం వాడే పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, గుడ్లు వంటివెన్నో ఉన్నాయి. ఇక, సరిగా ఉడకని మాంసం, సీఫుడ్‌లో ఉండే సాల్మొనెల్లా, కాంపీలోబాక్టర్, ఈ-కోలీ వంటి బ్యాక్టీరియాలు జీర్ణాశయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఆహార పదార్థాలను ఎక్కువకాలం నిల్వ చేయడం వల్ల తేమతో వచ్చే బూజు (అప్లాటాక్సిన్) కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంది. కాడ్మియం, సీసం వంటి లోహాలు ఒంట్లో చేరితే.. కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిని రోగ నిరోధక వ్యవస్థ కుంటుపడుతుంది. ఇవన్నీ మహిళల పునరుత్పత్తి సామర్థ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. కల్తీ ఆహారంతో అతిసారం, అలర్జీలు, అస్తమా, అజీర్తి, అల్సర్, క్యాన్సర్ రుగ్మతలు వస్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదేశాలతో సంబంధిత శాఖాధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో కొలువుదీరిన టాస్క్‌ఫోర్స్ బృందం కొన్ని రోజులుగా నగరంలోని హోటళ్లలో తనిఖీలు చేస్తున్నది. అయితే తనిఖీ నివేదికపై వ్యాపారులు సంతకం చేసేందుకు నిరాకరించే పరిస్థితి ఉందంటే ఆహార కల్తీ, అపరిశుభ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో కల్తీ రాజ్యమేలుతున్న తరుణంలో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. అనారోగ్యాలకు గురవుతూ దవాఖానలకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో కల్తీకి పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
1976 ఆహార భద్రత చట్టం ప్రకారం.. కల్తీ వ్యాపారులకు నోటీసులు జారీ చేసి శిక్షించాలి. అంతేకాదు, వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా ప్రభు త్వం, స్వచ్ఛంద సంస్థలు బాధ్యత తీసుకొని కల్తీ ఆహార పదార్థాలపై అవగాహన కల్పించాలి. కల్తీని సులభతరంగా గుర్తించే పరీక్షలను ఆమోదించాలి. పాఠ్య ప్రణాళికలో ఆహార కల్తీ అంశాన్ని చేర్చడం తక్షణ చర్య. ప్రభుత్వం రూపొందించిన టాస్క్‌ఫోర్స్ క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం, ప్రజలను అప్రమత్తం చేయడం ఇప్పుడు అత్యవసరం.
(వ్యాసకర్త: రసాయన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు, ఉస్మానియా యూనివర్సిటీ)
– పార్థసారథి తీగుళ్ల