16 నెలల సుదీర్ఘ విచారణ అనంతరం, వంద మందికి పైగా సాక్షులను విచారించి జస్టిస్ పీసీ ఘోష్ జూలై 31న తన 650 పేజీల నివేదికను సమర్పించారు. అంతటితో తన పాత్ర ముగిసిందని ప్రకటించి సొంతూరు కలకత్తాకు వెళ్లిపోయారు. ఆ నివేదికను అధ్యయనం చేసి ఒక నోట్‌ను తయారు చేసి ఆగస్టు 4న జరిగే క్యాబినెట్ సమావేశానికి సమర్పించాలని ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. సీల్డ్ కవర్లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై క్యాబినెట్లో చర్చించకముందే కొన్ని పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుల అవకతవకలకు, డిజైన్, నిర్మాణ, నిర్వహణ లోపాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యులని కమిషన్ తేల్చినట్టు ఆ కథనాలు పేర్కొనాయి. కొన్ని చానళ్లలోనూ ఇదే తరహాలో కథనాలు ప్రసారమయ్యాయి. నాలుగో తేదీన క్యాబినెట్ సమావేశానికి ముందే ఇదంతా జరిగినా, ఇది మంత్రివర్గం ప్రివిలేజెస్కు భంగకరమైనా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. మూడో తేదీన కమిషన్ సంక్షిప్త నివేదిక (Executive Summary) పేరిట ఎవరి సంతకాలు లేని ఒక ఆరు పేజీల రిపోర్టును పత్రికలకు విడుదల చేశారు. అది కమిషన్ వారి సంక్షిప్త నివేదికనా లేక అధికారుల కమిటీ తయారు చేసిన నోటా? అన్నది స్పష్టం చేయలేదు.
ఆగస్టు 4న క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, సాగునీటిపారుదల శాఖ మంత్రి, మంత్రివర్గ సభ్యులు పత్రికా సమావేశం నిర్వహించారు. సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సుదీర్ఘమైన 60 పేజీల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. అంతకుముందు రోజు విడుదల చేసిన ఆరు పేజీల నోట్లో ఉన్న అంశాలే దాదాపుగా ఈ ప్రెజెంటేషన్‌లో చోటుచేసుకున్నాయి. తేడా ఏమిటంటే ఇందులో కమిషన్ నివేదికలోని వాక్యాలను కోట్స్‌లో ఉటంకించారు.
ఆరు పేజీల నోట్ చదివిన తర్వాత, ఈ 60 పేజీల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చదివిన తర్వాత నా లాంటి వారికి వెంటనే తోచిన విషయం ఏమిటంటే.. ఒక నీతి నిజాయితీ కలిగిన జడ్జిగా, అనేక కీలక తీర్పులు ఇచ్చిన జడ్జిగా, మొదటి లోక్‌పాల్‌గా పని చేసిన జస్టిస్ పీసీ ఘోష్ ఇంతటి ఏకపక్ష, వక్రీకరణలతో, తప్పుడు అన్వయాలతో కూడిన నివేదికను తయారు చేస్తారా? అన్న అనుమానం కలగకమానదు. వెంటనే నాకు తెలంగాణ ఉద్యమ కాలంలో 2010 డిసెంబర్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదిక గుర్తుకువచ్చింది.
ఆయన కూడా జస్టిస్ పీసీ ఘోష్ లాగానే నీతి నిజాయితీలకు, బొంబాయి పేలుడు కేసుల్లాంటి ఘనమైన తీర్పులు వెలువరించిన న్యాయమూర్తిగా పేరు గడించినవారే. ఆ నివేదికతో ఆయన పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. ఆయన నివేదికను తెలంగాణ సమాజం మొత్తంగా తిరస్కరించింది. అది తెలంగాణ ప్రజల పట్ల విశ్వాసఘాతుకంగా తెలంగాణ సమాజం భావించింది. ఇది కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదికలా ఒక ఫార్స్‌గా మిగిలిపోతుందా? అన్నది పూర్తి నివేదికను అధ్యయనం చేసిన తర్వాత గానీ చెప్పలేం.
60 పేజీల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రకారం జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో చెప్పిన కొత్త విషయాలేమీ ఉన్నట్టు అనిపించలేదు. గత రెండేండ్లుగా కాళేశ్వరం విమర్శకులు చెప్పిన విషయాలే కనిపించాయి తప్ప, కొత్త అంశాలు ఏమీ కనిపించలేదు. అందుకే కమిషన్ పూర్తి నివేదిక చూస్తే గానీ అసలు విషయం బోధపడదు.
నిజానికి ప్రభుత్వం నివేదికని వెంటనే ప్రజల ముందుపెట్టి నిజాయితీగా చర్చకు ఆస్కారం ఇవ్వాల్సింది. కానీ, ప్రభుత్వం ఏ ప్రయోజనాలను ఆశించో ఈ మార్గాన్ని ఎంచుకున్నది? పూర్తి నివేదికను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచుతారో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాల మేరకు చర్యలు తీసుకుంటామని మాత్రమే పేర్కొన్నారు. అంతవరకు 6 పేజీల నోట్, 60 పేజీల ప్రెజెంటేషన్ ఆధారంగా ఎవరైనా విశ్లేషణ చేయవలసిందే తప్ప, మరో మార్గం లేదు.
ఆరు పేజీల నోట్, 60 పేజీల ప్రెజెంటేషన్ చదివిన తర్వాత కొన్ని అంశాలపై కమిషన్ ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా అనిపించిది. 1. సీడబ్ల్యూసీ నీళ్లున్నాయని చెప్పినా.. లేవని తప్పుడు అన్వయం చేసి బ్యారేజీని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడమన్నది సహేతుకంగా లేదు. ఆ నిర్ణయంలో చిత్తశుద్ధి, నిజాయితీ లేదని కమిషన్ అభిప్రాయపడింది. 2. ప్రభుత్వమే నియమించిన కమిటీ నివేదికను కావాలని తొక్కిపెట్టారు. వారి సిఫారసులను పరిగణించలేదు. వారు మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టవద్దని చెప్పినా వినకుండా అక్కడే నిర్మించాలని నిర్ణయించారు.
3. బ్యారేజీల నిర్మాణానికి క్యాబినెట్ అనుమతులు తీసుకోకుండా నిర్మాణ పనులు ప్రారంభించారు. 4. బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చినప్పుడు కన్సల్టింగ్ సంస్థ వాప్కోస్ను సంప్రదించలేదు. 5. బ్యారేజీల నిర్మాణానికి ముందు అవసరమైన భూభౌతిక పరీక్షలు నిర్వహించలేదు. ప్రాజెక్టు ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ తదితర సమస్త అంశాల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే నిర్ణయాలు తీసుకున్నారు. 6. ప్రాజెక్టు కాంట్రాక్టులను టర్న్ కీ పద్ధతిలో కాకుండా లంప్ సమ్ పద్ధతిలో ఇచ్చారు. 7. బ్యారేజీలను డైవర్షన్ స్ట్రక్చర్లుగా కాకుండా స్టోరేజీ స్ట్రక్చర్లుగా వాడినందున కుంగుబాటు జరిగింది. ఇట్లా.. ఇవన్నీ గతంలో కాళేశ్వరం విమర్శకులు లేవనెత్తిన అంశాలే తప్ప, ఏవీ కొత్తవి కావు.
వీటన్నిటికి అనేక మార్లు సాక్ష్యాధారాలతో వివరణలు ఇచ్చాను. మే నెలలో ‘కాళేశ్వరం ప్రాజెక్టు: ప్రశ్నలు-విమర్శలు-వక్రీకరణలు-వివరణలు’ శీర్షికతో ప్రచురితమైన నా పుస్తకంలో పైన పేర్కొన్న అంశాలను సాక్ష్యాధారాలతో వివరించాను. మాజీ మం త్రి హరీశ్‌రావు, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాష్ కూడా కమిషన్‌కు అన్ని ఆధారాలను జత చేస్తూ అఫిడవిట్లు సమర్పించా రు. కమిషన్ ఈ పత్రాలను అసలే పరిగణనలోకి తీసుకున్నట్టు లేదని అనుమానం కలుగుతున్నది.
తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసింది. 2014లోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖనే దానికి నిదర్శనం. తొలుత నాటి సాగునీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మహారాష్ట్రలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. 2015 ఫిబ్రవరిలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో చర్చలు జరిపారు.
మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల వద్ద బ్యారేజీ నిర్మాణానికి ససేమిరా ఒప్పుకోలేదు. 148 మీటర్లకు తగ్గించుకుంటే తప్ప, బ్యారేజీని అనుమతించలేమని స్పష్టం చేసింది. ఇక మహారాష్ట్రతో చర్చలు అంటే కాలయాపన తప్ప ప్రయోజనం లేదని అర్థమైంది. అదే సమయంలో నిర్దేశిత ప్రాంతంలో తగినంత నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ 18.02.2015, 04.03.2015 నాడు రాసిన లేఖల్లో తుమ్మిడిహట్టి వద్ద భవిష్యత్తులో నికరంగా నీటి లభ్యత ఉండదని హెచ్చరించడమే కాదు, ప్రాజెక్టు అధికారులు బ్యారేజీ నుంచి తరలించే నీటి పరిమాణాన్ని పున:సమీక్షించుకోవాలని సూచించారు. ఇదే విషయాన్ని నాటి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి 13.03.2015న నాటి సాగునీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు రాసిన లేఖలో కూడా పేర్కొన్నారు. ఉమాభారతి లేఖ కమిషన్ వద్ద ఉంది.
అయినా ఆయన ఆ లేఖ మొదటి పేజీని మాత్రమే చదివినట్టున్నారు. సంపూర్ణంగా చదివినట్టు లేదు. సింగూరు, శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 148 మీటర్ల వద్ద తుమ్మిడిహట్టి వద్ద లభ్యమయ్యే 44 టీఎంసీల నీటిని ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు వినియోగించుకొని మిగతా జిల్లాల అవసరాల కోసం తగినంత నీరు లభ్యమయ్యే ప్రత్యామ్నాయ స్థలాన్ని వెతకాలని వాప్కోస్ సంస్థను ప్రభుత్వం కోరింది. వారు గోదావరి నది మొత్తాన్ని లైడార్ సర్వ్ ద్వారా జల్లెడ పట్టి మేడిగడ్డ స్థలాన్ని ఎంపిక చేశారు. సీడబ్ల్యూసీ సూచనలను ప్రభుత్వం పాటిస్తే చిత్తశుద్ధి, నిజాయితీ లేదని చెప్పడం హాస్యాస్పదం.
ఇక ఇంజినీర్ల కమిటీ నివేదికను తొక్కిపెట్టారని, వారు మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని వద్దన్నా, వారి సిఫారసును పక్కనబెట్టి మేడిగడ్డ వద్దనే బ్యారేజీని నిర్మించారన్న ఆరోపణను పరిశీలిద్దాం. వాప్కోస్ ఎంపిక చేసిన మేడిగడ్డ స్థలాన్ని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ కూడా బలపరిచింది. వారి నివేదికలో పేజీ 6లో ఈ అంశాన్ని స్పష్టంగా వెల్లడించారు కూడా. దీన్ని కమిషన్ పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరం.
మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా నీటిని తరలించడం సాధ్యం కాదని మాత్రమే రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం సూచించింది. ప్రభుత్వం వారి సిఫారసును అంగీకరించింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించడానికి నదీ మార్గాన్ని ఎంచుకున్నది. ఈ విషయాన్ని స్వయంగా వారే కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక వారి నివేదికను తొక్కిపెట్టారని, పక్కనపెట్టారని నిర్ధారించడం విచిత్రం కాదా! దీన్ని బట్టి కమిషన్ తనకు అందిన అఫిడవిట్లను సమగ్రంగా పరిశీలించలేదని తేటతెల్లం అవుతున్నది.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాలను కూడా వ్యాప్కోస్ లైడార్ సర్వే ద్వారా ఎంపిక చేసినట్టు రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ తమ అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొన్నది. బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని కేసీఆరే ఎంపిక చేశారన్న కమిషన్ నిర్ధారణ కూడా నిరాధారమని తేలిపోయింది. బ్యారేజీల నిర్మాణ స్థలాల ఎంపిక, భూభౌతిక పరీక్షలు జరపడం, డిజైన్లు రూపొందించడం, కట్ ఆఫ్ పైల్స్ వేయడం, నిర్మాణం, నాణ్యతా ప్రమాణాలు లాంటివి పూర్తిగా సాంకేతికపరమైన అంశాలు. పైన పేర్కొన్న సాంకేతికాంశాలను నిర్ధారించడానికి పూర్తి అధికారాలు దఖలుపరుస్తూ ప్రభుత్వం ఉన్నతస్థాయి ఇంజినీర్లతో కూడిన హై పవర్ కమిటీని (హెచ్పీసీ) ఏర్పాటు చేసింది.
వారే అన్ని సాంకేతిక నిర్ణయాలు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేవారు. ఆ కమిటీ నిర్ణయాలను ప్రభుత్వం ఆమోదించింది. కన్సల్టింగ్ సంస్థ వాప్కోస్, ప్రభుత్వ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు సమష్టిగా చూసుకోవలసిన సాంకేతిక అంశాల్లో ప్రభుత్వ పెద్దల జోక్యం చాలా చాలా పరిమితమైనది. అంతిమంగా ప్రభుత్వమే ఆ నిర్ణయాలను ఆమోదించినా అవి ముఖ్యమంత్రికో, మంత్రికో ఆపాదించడం సరైనది కాదు. రాజకీయ నాయకులు ఏవైనా స్థూలమైన సూచనలు చేయగలుగుతారు కానీ, సూక్ష్మమైన సాంకేతికాంశాల్లో వారి పాత్ర పరిమితమైనది. ఉదాహరణకు ఇంజినీర్లు రూపొందించిన తొలినాటి ప్రాణహిత ప్రాజెక్టు తుమ్మిడిహట్టి వద్ద మొదలై శామీర్‌పేట వద్ద ముగుస్తుంది. నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రాజెక్టును చేవెళ్ల వరకు పొడిగించాలని సూచించారు.
అప్పుడు అది ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుగా మారింది. దీన్ని రాజశేఖర్‌రెడ్డికి ఆపాదించడం మూర్ఖత్వమే అవుతుంది. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ఒక స్థూలమైన సూచన అది. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో కూడా కేసీఆర్ పాత్ర ఇటువంటిదే. ప్రతీ ఒక్క ప్రతిపాదనను క్షేత్రస్థాయి సాధ్యాసాధ్యాలతో బేరీజు వేసి తుది నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ నుండి నేరుగా మిడ్ మానేరుకు నీటిని తరలించగలమా, లేదా? అన్న అంశాన్ని అధ్యయనం చేయాలని రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ వేశారు. వారు క్షేత్రస్థాయిలో వాప్కోస్ ప్రతినిధులతో కలిసి అధ్యయనం చేసి వీలుకాదని స్పష్టం చేశారు. దాన్ని కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో ఏకపక్ష నిర్ణయం జరిగిందెక్కడ? పీసీ ఘోష్ కమిషన్ కావాలనే వీటన్నింటిని పక్కనబెట్టినట్టు కనబడుతున్నది.
బ్యారేజీల నిర్మాణానికి ముందస్తు క్యాబినెట్ అనుమతులు లేవని చెప్పడం మరో ప్రహసనం. మొదట పాలనాపరమైన అనుమతులు జారీచేసి క్యాబినెట్ నుంచి రాటిఫికేషన్ పొందడం ప్రభుత్వ బిజినెస్ రూల్స్‌లో భాగమే. ప్రస్తుత ప్రభుత్వం కూడా కొడంగల్ లిఫ్ట్ పథకం విషయంలో ఇదే పద్ధతిని అనుసరించింది. గతంలో వైఎస్సార్ ప్రభుత్వం కూడా జలయజ్ఞంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులకు ఇదే పద్ధతిలో అనుమతులు జారీచేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణాలకు క్యాబినెట్ అనుమతులే కాదు, లెజిస్లేటివ్ అనుమతులు కూడా ఉన్నాయి. ఈ పత్రాలను కమిషన్‌కు తాను స్వయంగా అందజేసినట్టు ఆగస్టు 5న మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నారు. సాక్ష్యాలు కూడా ప్రజల ముందుంచారు. కమిషన్ ఈ సాక్ష్యాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? నీతి, నిజాయితీలకు పేరుగాంచిన జస్టిస్ నేతృత్వంలోని కమిషన్ చిత్తశుద్ధిని శంకించడం ఎట్లా? కమిషన్ పూర్తి రిపోర్టు వెలుగులోకి వస్తే తప్ప అసలు వాస్తవం బయటపడదు.
బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చడానికి హెచ్పీసీ నిర్ణయం తీసుకున్నప్పుడు వాప్కోస్ను సంప్రదించలేదన్నది మరో ఆరోపణ. 22.10.2016న జరిగిన హెచ్పీసీ సమావేశంలో వాప్కోస్ ప్రతినిధి, కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి హెడ్‌గా వ్యవహరించిన శంభు ఆజాద్ ఆహ్వానితుడిగా హాజరయ్యారు. సమావేశపు మినిట్స్ మొదటి పేజీలోనే అందులో పాల్గొన్న సభ్యుల పేర్లు ఉన్నాయి. అందులో శంభు ఆజాద్ పేరు కూడా ఉన్నది. ఇది కమిషన్ దృష్టిలో లేకపోవడం ఏమిటి? నాటి హెచ్పీసీ సమావేశంలో తీసుకున్న అనేక సాంకేతిక నిర్ణయాల్లో అన్నారం, సుందిళ్ల బ్యారేజీ స్థలాల మార్పు కూడా ఒకటి.
మరి వాప్కోస్ను సంప్రదించలేదని అనడం సరైనదేనా? కాంట్రాక్టుపై సంతకం చేసినప్పటికీ ఆ నాటికి పనులు మొదలుకాలేదు కాబట్టి, ఏజెన్సీలు మార్పులను అంగీకరించాయి. ప్రాజెక్టు అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు జరపడం సాధారణ విషయమే. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన కంతనపల్లి బ్యారేజీ నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో ఆదివాసీ గ్రామాలను ముంపు బారిన పడకుండా బ్యారేజీ స్థలాన్ని ఎగువన తుపాకులగూడెంకు మార్చారు.
నిర్మాణ సంస్థ కూడా అందుకు అంగీకరించింది. అది సమ్మక్క బ్యారేజీగా నిర్మాణం పూర్తి చేసుకొని దేవాదుల ప్రాజెక్టుకు వరదాయినిగా రూపుదాల్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రాజెక్టుల నిర్మాణ స్థలాన్ని మార్చిన సందర్భాలు ఉన్నాయి. కుస్తాపురం గ్రామం వద్ద ప్రతిపాదించిన గోదావరి ప్రాజెక్టు విలీనం తర్వాత దిగువన పోచంపాడుకు మారింది. ఏలేశ్వరం వద్ద ప్రతిపాదించిన కృష్ణా ప్రాజెక్టు విలీనం తర్వాత నందికొండ వద్దకు మారింది. కాబట్టి అనేక సాంకేతిక, రాజకీయ కారణాల రీత్యా ప్రాజెక్టుల నిర్మాణ స్థలం మారడం అసాధారణమేమీ కాదు. బ్యారేజీలను డైవర్షన్ స్ట్రక్చర్లుగా కాకుండా స్టోరేజీ స్ట్రక్చర్లుగా వాడినందున ప్రమాదం సంభవించిదని కమిషన్ నిర్ధారించినట్టుగా చెప్తున్నారు. దీనికి శాస్త్రీయ ప్రమాణం ఏమిటో కమిషన్ నివేదికలో ఉందా?
కాళేశ్వరం బ్యారేజీలను పర్మియబుల్ ఫౌండేషన్లపైనే నిర్మించడానికి డిజైన్ చేశారు. కేంద్ర జలసంఘం, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్లాండర్డ్స్ సంస్థలు జారీచేసిన కోడ్స్, మ్యానువల్స్, మార్గదర్శకాల ఆధారంగానే బ్యారేజీలను డిజైన్ చేశామని సీడీవో ఇంజినీర్లు ధ్రువీకరించారు. పర్మియబుల్ పునాదుల మీద నిర్మించడానికి కేంద్ర సంస్థలు జారీచేసిన కోడ్స్, మ్యానువల్స్, గైడ్‌లైన్స్‌లో ఎలాంటి పరిమితులు విధించలేదని డిజైన్ ఇంజినీర్లు చెప్తున్నారు. అలాంటి నిబంధనలు లేనందునే ప్రాజెక్టు అవసరాల మేరకు స్టోరేజీని అనుమతించామని డిజైన్ ఇంజినీర్లు అంటున్నారు. దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ ప్రాంతంలో కట్టే బ్యారేజీలను, మైదాన ప్రాంతంలో ఉన్న ఏపీలో కట్టే బ్యారేజీలను ఒకే గాటన కట్టడం సరైంది కాదు.
ప్రకాశం, కాటన్ బ్యారేజీలో అయితే గ్రావిటీ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. అక్కడ నీటి నిల్వ తక్కువగా ఉన్నప్పటికీ నీటిని కాలువల్లోకి మళ్లించే అవకాశం ఉంది. కాళేశ్వరం బ్యారేజీలు దిగువ నుంచి ఎగువకు ఎత్తిపోసేందుకు నిర్మించిన బ్యారేజీలు కాబట్టి, పంప్ హౌజ్‌లకు నీళ్లు మళ్లించాలంటే తప్పనిసరిగా నీటిని నిల్వ చేయాలి. బ్యారేజీలు మళ్లింపు పథకాలన్న మూస భావన తెలంగాణ ప్రాంతంలో నిర్మించే బ్యారేజీలకు వర్తించదు. పైన చెప్పిన దాని ప్రకారం.. దిగువ నుంచి ఎగువకు ఎత్తిపోసే బ్యారేజీలు కావడంతో స్టోరేజీ అనేది ప్రాజెక్టుకు అవసరం. యాసంగి పంటలకు నీరివ్వాలంటే స్టోరేజీ లేకుంటే పంపింగ్ చేయడం అసాధ్యం.
ఎన్ని మీటర్ల ఎత్తున నిల్వ ఉంటాయో లెక్క గట్టిన తర్వాతనే ఆ నీటి బరువును పరిగణించి ర్యాఫ్ట్ మందం, కటాఫ్ లోతు వంటివి డిజైన్ చేస్తారు. డిజైన్ లోపాలు ఉండి ఉంటే బ్లాక్ 7లోనే ఎందుకు కుంగుబాటు సంభవించింది? మొత్తం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలోని అన్ని బ్లాకులు ఎందుకు ప్రమాదానికి గురికాలేదు? గోదావరి నదికి 500 ఏండ్లకు ఒకసారి వచ్చే వరదను కూడా 2022లో బ్యారేజీలు తట్టుకున్నాయి. 2020- 23 మధ్యన నాలుగు వరుస భారీ వరదలను తట్టుకున్నాయి. కుంగుబాటు జరిగిన తర్వాత కూడా 2024లో 15 లక్షల క్యూసెక్కుల వరదను మేడిగడ్డ బ్యారేజీ సేఫ్‌గా కిందకు పంపించింది. చిన్న కుంగుబాటును మొత్తం డిజైన్ లో పంగా ఎందుకు ఆపాదించడం? ప్రకృతి వైపరీ త్యం వల్ల కూడా కుంగుబాటు సంభవించి ఉండవచ్చనే కోణంలో కమిషన్ పరిశీలించినట్టు లేదు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టులను ఈపీసీ పద్ధతిలో కాకుండా ఎల్ఎస్ పద్ధతిలో పిలవడం కూడా అభ్యంతరకరం ఎట్లా అవుతుంది? దశాబ్దాలుగా అన్ని ఇంజినీరింగ్ శాఖల్లో ఈ పద్ధతి అమల్లో ఉన్నది. ఎంత పని జరిగితే అంతకు మాత్రమే బిల్లు చెల్లించే పద్ధతి తప్పెట్లా అవుతుంది? ఈపీసీలో నిధుల దుర్వినియోగం ఎక్కువగా ఉందని ప్రభుత్వం ఆ పద్ధతిని వదిలేసి ఎల్ఎస్ పద్ధతికి మారింది. కాలపరీక్షకు నిలబడిన ఎల్ఎస్ పద్ధతిని కూడా కమిషన్ తప్పు బట్టడం ఏమిటో అర్థం కావడం లేదు.
ఇలా.. మరెన్నో అంశాల్లో కమిషన్ పరిశీలనలో లోపాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. పూర్తి నివేదిక బయటకు వస్తే మరింత సమగ్రంగా విశ్లేషణ జరపడానికి ఆస్కారం ఉంటుంది. ఏదేమైనా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మరో శ్రీకృష్ణ కమిటీ నివేదికగా చరిత్రలో నిలుస్తుందా? అన్నది వేచిచూడవలసిందే!
కన్సల్టింగ్ సంస్థ వాప్కోస్, ప్రభుత్వ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు సమష్టిగా చూసుకోవలసిన సాంకేతిక అంశాల్లో ప్రభుత్వ పెద్దల జోక్యం చాలా చాలా పరిమితమైనది. అంతిమంగా ప్రభుత్వమే ఆ నిర్ణయాలను ఆమోదించినా అవి ముఖ్యమంత్రికో, మంత్రికో ఆపాదించడం సరైనది కాదు.
-వ్యాసకర్త: విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్) శ్రీధర్‌రావు దేశ్‌పాండే