మారింది… అవును, రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఎనిమిదేండ్లలో ‘పర్యాటకుల గమ్యస్థానం’గా తెలంగాణ మారింది. కోటలు.. పేటలు.. అందాల వరుసల అడవులు.. మల్లెల తీర్థాలు.. కృష్ణానదీ జలసవ్వడుల పసిడి మెరుపుల సిద్ధేశ్వరాలు.. వేములవాడ రాజన్న ఆలయ శిఖరాలు.. ఇలా చెప్పుకొంటూ పోతే యాదాద్రి నర్సన్న, భద్రాద్రి రామన్న నుంచి ప్రకృతి రమణీయ గుడి గోపురాళ్ల మైలురాయి రామప్ప దాకా అన్నీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక స్థలాలే.
మన తెలంగాణ ఇప్పుడు ‘టెంపుల్ టూరిస్ట్ స్పాట్’గా మారిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు తెలంగాణ. బుద్ధుని ఆనవాళ్ల నుంచి క్రీస్తుపూర్వం నాటి ఆలయాల వరకు ఉన్నాయిక్కడ. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతీ చెరువూ ఓ దర్శనీయ స్థలమే. తెలంగాణలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఏ దిక్కు వెళ్లినా ఓ పర్యాటక ప్రదేశం దర్శనమిస్తుంది. అవి గుడులు కావచ్చు, అడవిపూల అందా లు అల్లుకున్న కుంటాల, కొప్పెర, బొగత జలపాతాలూ కావొచ్చు. ఇక డ్యాంల విషయానికి వస్తే నాగార్జునసాగర్, సింగూర్, జూరాల, శ్రీరాంసాగర్, నిజాంసాగ ర్, కడెం ఇలా.. ఎన్నో సాగరాలు వరద సిరులను ఒడిసిపట్టిన నిండుకుండల్లా మారాయి. పురివిప్పి ఆడే నెమలి నాట్యమల్లే చెంగుచెంగున దూకే ఈ జలసిరులు పర్యాటకులకు ఎంత నేత్రానందాన్ని కలిగిస్తాయో మాటల్లో చెప్పలేం.
హుయాన్సాంగ్, ఫాహియాన్ గత వెయ్యేండ్ల తెలంగాణ వైభవ ప్రాంతాల గురించి రాస్తే చదివాం. ఓహో ఇట్లా ఉండేదా నాటి దక్కన్ ప్రాంతమని అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తున్నాం. గోదావరి జలసిరుల మురిపాలే కాదు, బంగారు వర్ణపు వరి చేల మీదుగా వీచే పిల్లగాలుల ఉత్పత్తి కేంద్రాలైన ప్రాజెక్టులు కూడా ఇప్పుడు అతిపెద్ద దర్శనీయ కేంద్రాలు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ స్కీంగానే కాదు, ప్రాణహిత.. గోదావరుల సంగమ క్షేత్రం, శివ మహిమాన్వితమైన సుందర ప్రదేశంగా ‘కాళేశ్వరం’ చరిత్రకెక్కింది. ఆ ప్రాజెక్టు అందాలను చూసేందుకు రానున్న రోజుల్లో యావత్ ప్రపంచమే రాబోతుందనడంలో సందేహం లేదు.
తీరొక్క వర్ణాల ఉదయపు, సాయంత్రాల అందాల హరివిల్లు బుద్ధవనం. కొండకోనల నడుమ వయ్యరాలు వొలికించి, మనస్సును పులకింపజేసే కృష్ణానదీ. ఆ అందాలను వీక్షించేందుకు పర్యాటకులు వస్తూనే ఉన్నారు. అనంతగిరులు, వెయ్యి స్తంభాల చారిత్రక వెలుగులు, కుతుబ్షాహీల సమాధులు, గోల్కొండ కోట, చార్ సౌ సాల్ చార్మినార్, వీటికి సరికొత్త హంగులు అద్దిందీ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే అన్నికాలాల్లోనూ జనాలు విపరీతంగా హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం గల ఈ హైదరాబాద్ నుంచి బస్సు, రైలుమార్గాల ద్వారా అన్ని పర్యాటక ప్రాంతాలకు సురక్షితంగా చేరుకునేలా ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పించింది. సింగోటం లక్ష్మీనారసింహుని దర్శనం నుంచి కురమత్రాయుడి మహా జాతరను, మన్యంకొండపై వెలిసిన వెంకన్న తీర్థం నుంచి కిన్నెరసాని కిలకిల రావాల దాకా అన్నీ చూడవచ్చు.
విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి రంగాలకు ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదిగిన మన రాష్ట్రం పర్యాటక రంగంలో కూడా సత్తా చాటుకున్నది. లోకం మెచ్చేలా.. ప్రపంచం కదిలివచ్చేలా ప్రభుత్వం రాష్ర్టాన్ని తీర్చిదిద్దింది. అందుకే మన రాష్ట్ర టూరిజం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నది. గత రెండు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు హోటల్స్, బోటింగ్ ద్వారానే రూ.11.40 కోట్ల ఆదాయం వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు పర్యాటకుల సంఖ్య ఏ స్థాయిలో పెరిగిందో. ఇలాగే ఏటా పర్యాటకుల సంఖ్య పెరగాలి, తెలంగాణ పర్యాటకరంగం పరిఢవిల్లాలి.
– ఆస్కాని మారుతీసాగర్, 90107 56666