ఏ సమాజానికైనా తాత్వికత ఒక పునాది వంటిది. అటువంటి స్థితిలో భారతదేశం తన చిరకాలపు సామాజిక, ఆర్థిక తాత్వికతను బీజేపీ పాలనలో ప్రమాదకరంగా కోల్పోతున్నది. ఈ సువిశాల వైవిధ్య దేశంలో బహుజన సుఖాయ – బహుజన హితాయ దృక్పథంతో సామరస్య తాత్వికత చరిత్రలో భాగమైంది. ఇందుకు కొనసాగింపుగానే స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలలో, తదనంతరం రూపొందిన రాజ్యాంగంలో ఇదే దృక్పథం ప్రతిఫలించింది.
మనవంటి సామాజిక సంస్కృతికి, వర్ధమా న ఆర్థిక సమాజానికి వర్తమానంలో, భవిష్యత్తులో కూడా ఇదే సరైన తాత్వికత అవుతుందని వేరే చెప్పనక్కరలేదు. కానీ ఈ తాత్వికతను బీజేపీ త న విధానాలతో క్రమంగా ధ్వంసం చేస్తున్నది. దీన్ని ప్రజలు చైతన్యవంతులై నిరోధించడం, దేశం కోల్పోతున్న తాత్వికతను తిరిగి నిలబెట్టుకోవడం ఒక తప్పనిసరి అవసరం.
అందుకు ఏ విధంగా అవకాశం ఉన్నదనేది ఇపుడు సీరియస్‌గా ఆలోచించాల్సిన ప్రశ్న. పైన ప్రస్తావించిన తాత్వికతను కోల్పోతుండటం పట్ల ఆందోళన చెందుతున్నవారు దేశంలో చాలామంది ఉన్నారు.అటువం టి వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది కూడా. కానీ ఏం చేయాలన్నది వారికి తోచడం లేదు. ఇటువంటి వర్గంలో రెండు విధాలైన వారున్నారు. ఒక వర్గంపై సోషలిస్టు లేదా కమ్యూనిస్టు ఆలోచనా ప్రభావం, మరొక వర్గంపై ప్రగతిశీల, ప్రజాస్వామిక ఆలోచనల ప్రభావాలున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినది మొదలు ఈ రెండు వర్గాలు కూడా తమ తమ ఆలోచనలు గల రాజకీయ పార్టీలది ఆధిపత్యం కాగలదని, తాము ఆశించిన పరిపాలనలు రాగలవని ఆశించారు. కానీ ఈ రెండు విధాలైన ఆలోచనల మధ్య దేశ వ్యవస్థ అటు ఇటుగా మారుతూ చివరకు రెండూ ఒకేలా విఫలమై నిలదొక్కుకోలేదు.ఇది ఇన్నేండ్ల చరిత్ర త ర్వాత ఎదురుగా కనిపిస్తున్న రాజకీయ సారాంశం. అటువంటి స్థితిలో ఈ రోజున ఏమి చేయాలన్నది ఆలోచనాపరుల ఎదుట మిగిలిన ప్రశ్న. ఇందులో సినిసిజానికి తావుండరాదు.ఆదర్శాలన్నవి ఆచరించలేని విధంగా మారినా, పరిస్థితి సానుకూలం కాకున్నా అటువంటి అన్వేషణ కన్నా మార్గాంతరమూ లేదు.
అయితే అందుకు మొదట అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రగతిశీల ప్రజాస్వామిక ఆలోచనలు గల పరిపాలన అన్నది మొదట దేశ వ్యా ప్తంగా నెహ్రూతో మొదలై ఆయనతోనే అంతమైంది. ఆ తర్వాత ఇందిరాగాంధీ తన అధికార పరిరక్షణకు ఏమి మాట్లాడి, ఏమి చేసినా తన పొలిటికల్ ఎకాన మీ మాత్రం స్వదేశ, విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా నడిచింది. రాజకీయ ఒడిదొడుకులకు లోనై తన పార్టీ క్షీణతకు దారులు వేసింది. దేశ తాత్వికత కూడా అందుకు సమాంతరంగా అప్పటినుంచే భంగపడటం మొదలైంది.ఆలోచనాపరుల ఆందోళన సైతం అదే కాలం నుంచి మొదలైంది. ఎందుకంటే అభివృ ద్ధి, సంక్షేమాలు ఒక ఎత్తవుతే అందుకు మూలంగా ఉండే తాత్వికత అంతకు మించిన ఎత్తవుతుంది.
ఇందిర కాలంలో కొంత, ఆ తర్వాత కాలంలో మరికొంత తమవి కూడా దేశ తాత్వికతకు అనుగుణమైన ప్రగతిశీల ప్రజాస్వామిక పార్టీలు లేదా ఐక్య సం ఘటనలు అనే హామీని ఇస్తూ కొందరు ప్రజల ముం దుకు వచ్చారు. అందులో కొన్ని జాతీయ పార్టీలు కా గా, కొన్ని ప్రాంతీయమైనవి. మరికొన్ని భిన్నమైన సామాజిక, ఆర్థిక ప్రాతిపదికలు గలవి. ఇంచుమించు వాటన్నింటికీ, అప్పటి పరిస్థితుల ప్రభావంతో కొంత, కాంగ్రెస్ విఫలమైన శూన్యంలో ప్రజలకు ఆశలు కల్పి స్తూ వస్తుండటం వల్ల కొంత, ప్రగతిశీల అభ్యుదయ లక్షణాలు కొద్దిపాటి స్థాయిలో కన్పించాయి. కానీ చివరకు అవి ఎట్లా, ఎందుకు విఫలమయ్యాయో తెలిసిందే గనుక మళ్లీ చెప్పుకోనక్కర లేదు. మొత్తానికి కాంగ్రెస్ తర్వాత ఈ శక్తులు కూడా విఫలం కావడం ఆలోచనాపరుల ఆందోళనను మరింత పెంచింది. ఈ శక్తుల పాలనలో చెదురుముదురుగా కొంత మంచి ఉండినప్పటికీ అసలు మౌలికంగా వారి ఆలోచనలో, విధానాలలో ఒక సమగ్ర తాత్వికత అంటూ లేకపోవడం, ఇతర లోపాల వల్ల కనీసం ఆ మాత్రపు వేదికలైనా నిలవక కూలిపోవడం ఈ ఆలోచనాపరులను తీవ్రంగా నిరాశపరచింది. దీనంతటికీ సమాంతరంగా సోషలిస్టు/కమ్యూనిస్టు భావజాలాలు సాగాయి.
తొలుత స్వాతంత్య్రానంతరం హిందీ రాష్ర్టాలలో కొంత ఉండిన సోషలిస్టు భావజాలం, కమ్యూనిస్టులు కూడా అపుడపుడు అధికారానికి వచ్చినా, బెంగాల్‌ను దీర్ఘకాలం పాలించినా, కేరళ, త్రిపురలలో తగినంత కాలం పాలి ంచినా చివరకు వచ్చేసరికి పైన ప్రస్తావించిన ఆలోచనాపరులకు నిరాశనే మిగిల్చారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాలు నక్సలైట్లను నమ్మగా, వారి స్థితి కూడా అంతే అయింది. మొత్తానికి 75 సంవత్సరాలు గడిచే సరికి ప్రగతిశీల ప్రజాస్వామిక ధోరణు లు, సోషలిస్టు, కమ్యూనిస్టు మార్గాలు, పార్టీలు అన్నీ గణనీయంగా బలహీనపడి, ఒక సమగ్ర శూన్యత ఆవరించింది. దీని నుంచి తరుణోపాయం ఏమిటన్నదే తోచని స్థితిలో దేశవ్యాప్తంగా ఆలోచనాపరులు ఆందోళన చెందుతున్నారు. అది చాలదన్నట్లు వారిపై బీజేపీ రాక పిడుగుపాటుగా మారింది. ఈ దేశానికి ఇతర సమస్యలనేకం ఒక స్థాయిలో కొనసాగుతూనే ఉండ గా, అసలు భారతదేశ సమాజపు సామాజిక, ఆర్థిక తాత్వికతనే బీజేపీ ధ్వంసం చేస్తున్న ప్రమాదకర స్థితి ని చూసి వీరి ఆందోళన పతాక స్థాయిని చేరుతున్నది.
అందుకు సమాధానం ఏమిటన్నదే ఇపుడు వీరి ముందున్న ప్రశ్న. ఆ సమాధానంలో కన్పించవలసింది కేవలం బీజేపీని ఓడించడం కాదు. ఎవరెవరి ఇన్నేండ్ల వైఫల్యాల వల్లనైతే శూన్యం ఏర్పడి బీజేపీకి అవకాశం లభించిందో, తిరిగి అవే పార్టీలు అవే లోపాలతో మళ్లీ గెలిచినా జరిగేది ఏమిటి? తిరిగి విఫలం కావడం, మళ్లీ బీజేపీకి అధికారాన్ని అప్పగించటం. కనుక ఈ దేశ చరిత్ర, సమాజాల గురించి, వర్తమాన భవిష్యత్తుల గురించి, సమగ్రమైన అవగాహన కలిగి, ఇంత వరకు ఏ ఒక్క పార్టీ కూడా ప్రదర్శించని దార్శనిక లక్ష్యాలతో, ఈ సమాజం కోల్పోతున్న తన చిరకాల తాత్వికతను పునరుద్ధరించగల అవకాశాన్ని ఆలోచనాపరులు భారత రాష్ట్ర సమితికి(బీఆర్ఎస్) ఇవ్వడమే మార్గంగా కనిపిస్తున్నది. ఇతరత్రా ఎవరి హామీలు ఏవైనా, ఈ తాత్వికత పునరుద్ధరణే దేశానికి మౌలికావసరం.