అవమానాల మధ్య ఆత్మగౌరవాన్ని రగిలింపచేసిన రోజు.. అరవై ఏండ్ల చీకటి పాలనకు, అహంకారానికి చరమగీతం పాడిన రోజు.. అరవై ఏండ్ల కల ఇక కలగానే మిగిలి పోనుందా? అనే నైరాశ్యంలో ఉన్నవేళ నెత్తుటి భూమ్మీద ఒక అగ్నిశిఖ రేగింది. ఆ అగ్నిశిఖే కేసీఆర్. అతనే తెలంగాణ సాధకుడు. రాష్ట్రం కోసం రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయం ద్వారానే తెలంగాణ సాధ్యమని ఆచరణలో నిరూపించిన కార్యదక్షుడు. విద్యుత్తు చార్జీలను తగ్గించమని అడిగితే ఆనాటి అధికార టీడీపీ ఆయనను తెలంగాణ వాదిగా ముద్ర వేసింది. తెలంగాణ కన్నీళ్లను ప్రశ్నిస్తే తన పార్టీవారే చులకనగా చూశారు. ఆ సందర్భం కేసీఆర్ హృదయాన్ని కలచివేసింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి పదవికి, శాసన సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రాజీనామా చేశారు. తెలంగాణ దుఃఖం బాధల ముందు పదవులేవైనా తనకు గౌరవప్రదం కాదన్నారు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమవాదిగా జెండా ఎత్తి ఉద్యమ నాయకుడిగా ముందుకు నడిచారు.
ఎవరు కాదన్నా, ఎవరు అవమానించినా, ఎగతాళి చేసినా, కించపర్చినా తన అంతిమ లక్ష్యం రాష్ట్ర సాధనే. రాజకీయ ప్రక్రియ ద్వారానే ముందుకు నడిచి నెత్తురు బొట్టు చిందకుండా ఉద్యమ పార్టీని నడిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో 2001 ఏప్రిల్ 27 న జలదృశ్యం జనసంద్రం కాగా తెలంగాణ జాతి అస్తిత్వం కోసం త్యాగాల పునాదిగా టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ కోసం కేసీఆర్ సిపాయిలా ముందుండి పోరాటం చేశారు. తెలంగాణ వాదాన్ని లక్ష్యాన్ని భావవ్యాప్తి కోసం తానే స్వయంగా కవియై ఉద్యమ గీతాన్ని రాశారు. జలదృశ్యం దగ్గర జెండా ఎగరేసి జై తెలంగాణ అని గర్జించి కదిలారు. అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి కర్తవ్య దీక్ష పూనారు.
2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తూ టీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలో కేసీఆర్ చేసిన ప్రసంగంలోని మాటలు చరిత్రాత్మకమైనవి. అవేటంటే ‘ఉద్యమ పంథా వీడను. ప్రాణం పోయినా బిగించిన పిడికిలి విడువను. ఎత్తిన జెండా దించ ను. కచ్చితంగా రాష్ట్రం సాధిస్తా, ఒకవేళ నేను పెడమార్గం పడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి. నేను దృఢమైన సంకల్పంతోని, కచ్చితంగా రాష్ర్టాన్ని సాధించాలనే సదుద్దేశంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నా. ఇంటికి ఒక్క యువకుడిని నాకు అప్పచెప్పండి. వంద శాతం తెలంగాణ రాష్ట్రం సాధిస్తా’ నంటూ తన ప్రస్థానానికి పదును పెట్టుకున్నారు. అప్రతిహతంగా ఉద్యమాన్ని కొనసాగించారు.
టీఆర్ఎస్ బలపడుతుందేమోనని అక్కసుతో చంద్రబాబు ప్రభుత్వం జలదృశ్యంలోని కార్యాలయ విధ్వంసానికి చేసిన రచన నేటికీ మదిలో మెదులుతూనే వుంది. ఆ చంద్రబాబే తదనంతర కాలంలో మూటా ముల్లె సర్దుకొని తన ప్రాంతానికి పారిపోయారు.
2001 మే 17న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభ ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పలు మార్పులకు బీజం వేసింది. దారి పొడవునా డాక్టర్లు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, వివిధ గ్రామాలు, పట్టణాల ప్రజలు కాన్వాయ్‌ని ఆపి కేసీఆర్‌కు, ప్రొఫెసర్ జయశంకర్‌కు వీర తిలకాలు దిద్దారు. అడుగడుగునా జై తెలంగాణ నినాదాలు మారుమోగాయి.
కరీంనగర్ సింహగర్జనకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నాయకత్వంలో తొలి దశ ఉద్యమకారులు, దోస్తులతో కలిసి పులిహోర పొట్లాలు కట్టుకొని మండుటెండలో సభకు వెళ్లాం. ఆ సాయంత్రం సమైక్య సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యాన్ని మేం చూశాం. చంద్రోదయ వేళ కేసీఆర్ ఉపన్యాసం ప్రచండ తాపంలా సాగింది. తెలంగాణ నుడికార యాసబాషలతో ప్రవాహమై సాగింది. భాషపై మక్కువతో ఒక్కొక్క పలుకు సీమాంధ్ర పాలకుల, పెట్టుబడిదారుల గుండెల్లో ఫిరంగులై మోగాయి. ప్రజల భాషతో వ్యంగ్య సామెతలు, పిట్ట కథలు, ఉదాహరణలతో ప్రసంగం జలపాతంలా ఉద్విగ్నభరితంగా సాగింది. నాటి నుంచి నేటి వరకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నిర్వహిస్తున్న సభలన్నింటిలోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నాం.
తెలంగాణల ప్రజల ఆర్తిని, కడగండ్లను, తెలంగాణ అస్తిత్వానికై నా కలాన్ని ఝళిపిస్తూ ప్రయాణిస్తున్నాను. అందులో భాగంగా వొల్లెడ, (సకల జనుల సమ్మె), మశాల్ (తెలంగాణ మహోద్యమ దీర్ఘకావ్యం), ఊరచెరువు,(మిషన్ భగీరథ) తడి, జనశంకరుడు (ప్రొఫెసర్ జయశంకర్), కుర్చీ, తెలంగాణ తేనె పలుకులు లాంటి దీర్ఘకవితలతో సీమాంధ్ర ఆధిపత్య కుట్రలను వంచనలను, నిరసిస్తూ, తెలంగాణ పోరాట పటిమను కవిత్వీకరిస్తున్నాను.
తెలంగాణ సాధన ఉద్యమం అనేక అంశాల చరిత్రను ముందుకు తీసుకువచ్చింది. తెలంగాణ సమాజమంతా ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగను ప్రజా ఉద్యమంగా మార్చడం, బోనాలు, పీర్లు, దసరా, దీపావళుల పండుగలను రాష్ట్ర సాధనకై వాడుకొంది. ఉద్యమ సమయంలో ప్రజలు పండగలన్నీ తెలంగాణ సంబరాలుగా జరుపుకున్నారు. అస్తిత్వ ఆకాంక్షలకు ప్రతిరూపంగా తెలంగాణ తల్లి ఆవిర్భవించింది. ఊరూరా ఉద్యమ బతుకమ్మ ఆవిష్కరణలు జరిగాయి. చరిత్ర నిర్మాణాన్ని రాజకీయ ఉద్యమంగా మలిచి ఆధిపత్య శక్తులపై బాణం ఎక్కుపెట్టి నూటికి నూరుపాళ్లు కేసీఆర్ విజేతగా నిలిచారు. తెలంగాణ సాధన నినాదాన్ని ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చేయడానికి 2006లో తెలంగాణ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నమస్తే తెలంగాణ దినపత్రికతో పాటు, టీ న్యూస్ చానల్‌ను ప్రారంభించి ఆత్మగౌరవ స్వరాన్ని ఎలుగెత్తి చాటారు. తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దాడుతానన్నారు. అలయ్ బలయ్లతో, అహింసా మార్గంలో శాంతియుతంగా పయనించారు.
2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీతో పొత్తులతో ఎన్నికలకు పోవటాన్ని అనేక సంఘాలు, మేధావులు దెప్పిపొడిచారు. కేసీఆర్ ఏది చేసినా తెలంగాణ కోసమేనని నిరూపించారు. సమైక్యాంధ్ర పార్టీలతో జై తెలంగాణ అనిపించిన ఘనత కేసీఆర్‌దే. రాజీనామాలు, ఉప ఎన్నికలు తెలంగాణ ఉద్యమంలో భాగమేనని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్దే గెలుపని నిరూపించారు. తెలంగాణకు అనుకూలంగా దేశమంతా తిరిగి 36 పార్టీలతో ఏకాభిప్రాయంగా ఒప్పించి సేకరించి మద్దతు లేఖలు ఇవ్వడంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ విశేష కృషి చేసింది. తెలంగాణ విముక్తి కోసం కేంద్రాన్ని కదిలించడానికి అయితే జైత్రయాత్ర కాదంటే నా శవయాత్ర అంటూ 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. ఉద్యమ నెగడు ఆరకుండా ఉద్యమ జేఏసీని ఏర్పాటు చేసి సకల జనుల సమ్మెలు, మిలియన్ మార్చ్‌లు, సడక్ బంద్‌లు, సాగర హారాలు, రైల్‌రోకోలు, ఆర్టీసీ బంద్‌లు, విద్యా సంస్థల బంద్‌లు, నిరాహార దీక్షలు, వంటా వార్పులు, మానవ హారాలతో ఉద్యమం మహోగ్ర రూపమెత్తింది. ఈ కార్యక్రమాలన్నింటికీ ముత్యాలకు దారంలా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అండగా నిలిచింది. తెలంగాణ మలి దశ ఉద్యమానికి కేసీఆర్ కేంద్ర స్థానమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం విజయం సాధించి జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం మా లాంటి వాళ్లకు మరింత సంతోషకరమైన విషయం. తెలంగాణ ప్రజల కలలు నిజమయ్యాయి త్యాగాలు ఫలించాయి. పోరాటాలు సార్థకమయ్యాయి. తెలంగాణరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, 2018 లో రెండవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పదేండ్ల పరిపాలనలో స్వ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పయనించింది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లను, అడ్డంకులను చవి చూసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా, జాతీయ స్థాయిలో విస్తరించేందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. ఈ ఇరవై ఐదేండ్లలో ఎన్ని అవస్థలో, ఎన్నెన్ని ఎగుడు దిగుడులో చూసింది పార్టీ. ఎన్నో కష్టనష్టాలను, ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. బీఆర్ఎస్ మళ్లీ పూర్వ వైభవంలోకి రావాలని కోరుకుంటూ.. రజతోత్సవం వైపు పరుగులు తీస్తున్న బీఆర్ఎస్కు శుభాకాంక్షలు.