ప్రతి సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి కార్యక్షేత్రం, ప్రేరణ క్షేత్రం ఓరుగల్లు పోరుగడ్డ. నాటి సాయుధ రైతాంగ పోరాటంలోనైనా, 1969 విద్యార్థి ఉద్యమంలోనైనా, నక్సలైట్ పోరాటంలోనైనా, ఆ తర్వాత ఉవ్వెతున్న ఎగిసిన మలిదశ ఉద్యమంలోనైనా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల భాగస్వామం లేకుండా ఒక్క పోరాటం సాగలేదు. షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య, ఠాన్ నాయక్‌ల అమరత్వం నాడు సాయుధ పోరాటానికే కేంద్రం బిందువుగా నిలిచింది. ఆ తర్వాత కాళోజీ, సంగంరెడ్డి సత్యనారాయణ, ప్రొఫెసర్ బియ్యాల జనార్ధన్‌రావు, ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక రాష్ట్రం కోసం పడిన తపన అమోఘమైనది. వారి కృషిని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదు. ఇలా ఒకటా, రెండా ఎన్నో పోరాటాలకు ఓరుగల్లు వేదికైంది.
60 ఏండ్ల వివక్ష, అణచివేతకు పద్నాలుగేండ్ల పోరాటంతో కేసీఆర్ చరమగీతం పాడారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఆవిర్భవించి, బీఆర్ఎస్గా రూపాంతరం జరిగిన ఈ 25 ఏండ్ల కాలంలో అనేక చారిత్రక ఘట్టాలకు కేసీఆర్ జీవం పోశారు. స్వరాష్ట్రం, స్వయంపాలన కోసం కేసీఆర్ చేపట్టిన పోరాటం సుదీర్ఘంగా సాగింది. గాంధీజీ అందించిన అహింసా నినాదం, అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కులకు అనుగుణంగా తెలంగాణ అమరుల స్ఫూర్తితో అనేక పోరాటాలు చేశారు. యావత్ తెలంగాణ సమాజం స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొనేలా ప్రజలను కేసీఆర్ సమాయత్తం చేశారు. అందుకోసం అనేక రూపాల్లో ఉద్యమ పంథాను ఎంచుకున్నారు. నాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అజెండాలో తెలంగాణ అంశం పెట్టేలా ఒత్తిడి తేవడమే గాక, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో తెలంగాణను ఏర్పాటు చేస్తామని హామీ ఇప్పించారు.
2004 నుంచి 2012 వరకు మహోన్నత పోరాటాన్ని తెలంగాణలో కేసీఆర్ ఆవిష్కరించారు. మొండికేసిన కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్రంపై ప్రకటన చేయించేందుకు ప్రతి పల్లెను కదిలించారు. పదవులను త్యజించి కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. జేఏసీని ఏర్పాటు చేయించి, అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమంలోకి వచ్చేలా చేశారు. రాస్తారోకోలు, రైలురోకోలు, వంటావార్పులు, నిరసనలు, ధర్నాలు, పెన్ డౌన్, సమ్మెలను నిత్యకృత్యం చేశారు. ఉద్యోగ, నిరుద్యోగులతో మహోన్నత ఉద్యమాన్ని నిర్మించారు. కేంద్ర సర్కార్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. కేసీఆర్ అవిశ్రాంత పోరాటం, నిశ్చలమైన నాయకత్వంతో 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిజమైంది. స్వరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.
ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వ ఫలాలు ప్రతి వర్గానికి అందాలంటే అద్భుత పథకాల సృష్టి జరగాలి. పథకాల రూపకల్పనతోపాటు వాటిని నిజాయితీగా, నిబద్ధతతో అమలుచేయగల నాయకుడు కావాలి. ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తెలిసిన నాయకుడు కేసీఆర్. అటువంటి ఉన్నత ఆలోచనలు కలిగిన వ్యక్తి కాబట్టే.. దేశం గర్వించదగిన పథకాలకు కేసీఆర్ ప్రాణం పోశారు. అంతేకాదు, ఆ పథకాలను కూడా ఒక ఉద్యమంలా అమలుచేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పోరాట పంథాలో పాలన సాగించారు. ఆ యజ్ఞంలో భాగంగా రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశంలో ఆదర్శంగా నిలిచిపోయాయి. అనేక రాష్ర్టాలు తెలంగాణ పథకాలను అమలు చేశాయి.
ఇవాళ తెలంగాణ ఒక విపత్కర పరిస్థితుల్లో ఉంది. పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో మళ్లీ దోపిడీ నిత్యకృత్యంగా మారింది. దేశానికి దిక్సూచిగా నిలిచిన తెలంగాణలో నేడు అరాచక పాలన సాగుతున్నది. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా, మహిళలకు రక్షణ ఇవ్వలేక, విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయలేక, ఉద్యోగులకు భరోసా ఇవ్వలేక, కార్మికులకు అండగా ఉండలేక అచేతనమై కాంగ్రెస్ సర్కార్ పాలన అందిస్తున్నది. ఈ నేపథ్యంలో ఒక నిశ్చలమైన, నికార్సైన, తెలంగాణ సమాజం పట్ల సోయి ఉన్న నాయకత్వాన్ని నేడు ప్రజలు కోరుకుంటున్నారు. అందుకు కేసీఆర్‌కు మద్దతుగా నిలిచేందుకు ఎల్కతుర్తికి జనహోరై కదులుతున్నారు. 33 జిల్లాల నుంచి ఓరుగల్లు సభకు హోరెత్తి రావాలని పిలుపునిస్తున్నాం. తెలంగాణ హక్కులను కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి రక్షించుకోవడానికి ఎల్కతుర్తి వైపు జన జాతరై కదలండి! కేసీఆర్ నాయకత్వానికి బలమై నిలవండి! తెలంగాణను కాపాడుకోండి!
(వ్యాసకర్త: శాసనసభ్యులు, జనగామ)
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి