శాసన సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల్ని ప్రకటించింది. కాగా బీజేపీ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో పాటు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రచారం చేస్తున్నది. అధికార బీఆర్ఎస్ మాత్రం ఈ రెండు జాతీయ పార్టీలు ఒకే నాణేనికి ఉండే బొమ్మ-బొరుసు లాంటివని, వీటిని నమ్ముకుంటే మిగిలేదేం లేదని ఎద్దేవా చేస్తున్నది. అన్ని రాజకీయ పార్టీలు విజయం తమదంటే తమదని భుజాలు చరుచుకుంటూ హేమాహేమీలతో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నాయి.
గత ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికం గా 76.50 శాతం ఓటింగ్ నమోదు కాగా హైదరాబాద్‌లో అత్యల్పంగా 50 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది. నియోజకవర్గం పరంగా వరంగల్ జిల్లా లోని నర్సంపేట్ లో 84 శాతం ఓటింగ్ నమోదు కాగా హైదరాబాద్‌లోని యాకుత్‌పురలో కేవలం 45 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 అర్బన్ స్థానాల్లో కేవలం 40 నుంచి 55 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. తక్కువ పోలింగ్ శాతానికి ప్రధానంగా పట్టణ ప్రాంత విద్యాధికుల నిర్లిప్తతే కారణం.
కార్పొరేట్, ఐటీ, ఇతర రంగాల్లో పని చేసే చాలా మంది ఉద్యోగస్తులు పోలింగ్ రోజును కేవలం ఒక సెలవు దినంగా పరిగణించి సరదాగా సమయం గడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా భారత రాజ్యాంగం ద్వారా తమకు సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకోవటంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వారు ప్రభుత్వాలను నిందించటం తప్ప వ్యవస్థ బాగు కోసం తమలాంటి వారి సహకారం అవసరమన్న విషయాన్ని గుర్తించకపోవడం విడ్డూరం. విద్యావంతులు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగిస్తే పరిస్థితి తప్పకుండా ఆశాజనకంగా మారుతుంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుం డా, ఏమాత్రం దూరదృష్టి లేకుండా కేవలం అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే ల క్ష్యంగా కొందరు రాజకీయ నా యకులు తమకు తోచిన విధంగా వాగ్దానాలు గుప్పిస్తున్నారు. సా మాజికంగా వంచనకు గురైన అట్టడుగు వర్గాలను, అర్హులైన పేదలను వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. అయితే ఆ పథకాలు లబ్ధ్దిదారులను స్వావలంబన దిశ గా పయనింపచేసి, వారిలో ఆత్మవిశ్వాసం పాదుకొల్పి, రాష్ర్టాభివృద్ధిలో భాగస్వాములను చేసేలా ఉండాలి. అంతే తప్ప సోమరిపోతులుగానో, జీవితాంతం పరాన్నజీవులుగానో మిగిలిపోయేలా చేయకూడదు.
కాంగ్రెస్ చెప్పిన హామీలు అమలు కావాలంటే ఏటా రూ.50 లక్షల కోట్ల బడ్జెట్ కావాలి. ఇప్పుడున్న తెలంగాణ బడ్జెట్ కేవలం 3 లక్షల కోట్లే. ఆ పార్టీ ప్రకటించిన వాగ్దానాలు అమలు కావాలంటే 30 ఏండ్లు పట్టవచ్చని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్ తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యను విజ్ఞులైన ఓటర్లు గమనించాలి.
రాజకీయ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీ ఓటర్ల నిర్ణయమే శిరోధార్యం. చైతన్యవంతులైన ఓటర్లే ప్రజాస్వామ్యానికి ఆ యువుపట్టు. ప్రలోభాలకు ఏ మా త్రం లొంగకుండా నిర్భీతితో ఓటుహక్కును వినియోగించుకుని దేశం లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా తమ బాధ్యతను నిర్వర్తించాలి. ప్ర జాస్వామ్య స్ఫూర్తికి పట్టం కట్టాలి.
– యేచన్ చంద్ర శేఖర్ 88850 50822