అంటే.. చెట్లు సత్పురుషుల వలె తాము ఎండలో ఉంటూ ఇతరులకు నీడనిస్తాయి. ఇతరుల కోసం ఫలాలు ఇస్తాయి. నీతిశాస్త్రంలో చెప్పిన ఈ శ్లోకం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు అతికినట్టు సరిపోతుంది.
లేదంటే ఎప్పుడో మన పూర్వీకులు చెప్పిన ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే మాటను ఆచరించేందుకు లక్షల మందిని కదలించడం, కోట్ల మొక్కలు నాటించడం… అందుకోసం నిరంతరం అకుంఠిత దీక్షతో పరిశ్రమించడాన్ని ఇంతకంటే మనం ఎలా అర్థం చేసుకోగలం. ఒక గొప్ప వ్యక్తికి, ప్రముఖ వ్యక్తికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుది. గొప్ప వ్యక్తి ఎప్పడూ సమాజ సేవ కోసం సిద్ధంగా ఉంటాడని అంబేద్కర్ అంటారు. అందు కే ఈ దేశంలో లక్షల మంది నాయకులున్నప్పటికీ ఎవ రూ చేయని గొప్ప కార్యక్రమాన్ని వ్యక్తిగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న గొప్ప నాయకుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్. బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో స్వాతంత్య్రానంతరం ఒక సామాజిక ఆశయం కోసం ఇంతమంది ప్రజలను మమేకం చేసిన కొద్దిమంది నాయకుల్లో సంతోష్‌కుమార్ ఒక్కరనడంలో సందేహం లేదు.
2018, జూలై 17న ‘హరా హైతో బరాహై’ అనే నినాదంతో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ పురుడు పోసుకొని ఐదేండ్లు నిండి, ఆరవ ఏట అడుగుపెట్టడం అభినందనీయం. సమాజం కాలుష్యం కోరల్లో చిక్కి అనారోగ్యం బారినపడి కుటుంబాలకు కుటుంబాలు ఆర్థిక శైథిల్యంలోకి జారుకుంటున్నప్పటికీ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆవేదన నుంచి పుట్టిందే ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఇది ఇంతింతై వటుడింతై అన్నట్టు ఇవ్వాళ ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచంలోని అన్ని ఖండాల్లో మొక్కలు నాటించిన ఏకైక ఉద్యమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ అనే ప్రశంసలు పొందింది ఈ ఉద్య మం. ఎవరో చెప్పినట్టు ప్రపంచంలోని ఎత్తయిన 10 పర్వతాలపై గ్రీన్ ఇండియా జెండా ఎగరడం భారతీయులుగా గర్వపడాల్సిన విషయం. అంటే ఎంత కృషి జరిగి తే ఇది సాధ్యమవుతుంది. ఒకవైపు ఇంత కృషి జరుగుతున్నప్పటికీ మరింత విస్తృతంగా జరగాలని వారు భావించారు. అందుకే, వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద మొక్కలు నాటకుండా… మన పూర్వీకులు, మన పెద్దలు చెప్పిన మంచిని అర్థం చేయించాలి, మొక్కలు నాటే తత్వాన్ని విపులీకరించాలనే ఆశయంతో సంతోష్‌కుమార్ ముద్రించిన ‘వృక్షవేదం’ టేబుల్ బుక్ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నది. అందులో హిందీలో, సంస్కృతం లో, తెలుగులో, ఇంగ్లీషులో నాలుగు భాషల్లో మొక్కల విశిష్టతను వివరించిన తీరు అనేకమందిలో ఆలోచనను రేకెత్తించింది. మొక్కలు నాటేలా స్ఫూర్తిని రగిలించింది.
ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి సూపర్స్టార్ల వరకు, ఆధ్యాత్మిక గురువుల నుంచి గ్లోబల్ లీడర్ల వరకు ఎందరో ప్రముఖులు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్నారు. అందరూ తమ వంతుగా దాని గొప్పతనాన్ని వివరించారు. కారణం, అందులో ఉన్న నిజాయితీ ఈ మధ్య ఒక సంఘటన నా హృదయాన్ని కదిలిచింది. జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కో దారి. అందులో మొక్కలు నాటాలి, నేల బాగుండాలి, ప్రకృతిని కాపాడాలనుకునే వారిది అభ్యుదయమైన మనస్తత్వం. అందుకోసం వారు ఎంతదూరమైనా వెళ్తారు. జీవితంలో ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అలా జోగినిపల్లి గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆశయాన్ని గుండెల్లో నింపుకొన్న ఇద్దరు యువకులే ప్రముఖ సైక్లిస్ట్ మోహిత్ నిరంజన్, దివ్యాంగ గ్రీన్ ఎంటర్ ప్రెన్యూర్ చంద్రకాంత్ సాగర్. గ్రీన్ ఇండియా చాలెంజ్ నుంచి స్ఫూర్తి పొందిన మోహిత్ ‘సేవ్ సాయిల్ సైస్టెనబిలిటీ’ అనే థీమ్‌తో దేశమంతా దాదాపు 6,300 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం అద్భుతమైన విషయం. అలాగే.. దివ్యాంగ గ్రీన్ ఎంటర్ప్రెన్యూర్ చంద్రకాంత్ సాగర్ కూడా ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఆశయాన్ని పుణికిపుచ్చుకొని ‘ప్లాస్టిక్ రహిత సమాజం కోసం’ అవిశ్రాంతంగా ప్రయత్నించడం. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎందరో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆశయాన్ని సమున్నతం చేస్తున్నారు. వీరేకాదు, వనజీవి రామయ్య, సాలుమరద తిమ్మక్క, జాదవ్ పయాంగ్తో పాట బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థ స్థాపకులు, నోబెల్ శాంతి బహుమతి విజేత కైలాష్ సత్యార్థి, బ్రహ్మకుమారీ సమాజం, సద్గురు జగ్గీవాసుదేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ వంటి ఎందరో ప్రకృతి ప్రేమికులు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఆశయాన్ని విశ్వవ్యాప్తం చేశారు. వీరే కాదు, కాకతీయ వైభవ సప్తాహంలో కాకతీయుల 22వ వారుసుడైన కమల్‌చంద్ర భంజ్‌దేవ్ సైతం వెయ్యి స్తంభాల గుడిలో మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కీర్తిని ఇనుమడింపజేశారు.
‘ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటాలి. మరో ముగ్గురితో మొక్కలు నాటించాలి’ అనే ఒక చిన్న ప్రయత్నం రికార్డులను తిరగరాసే హరిత ఉద్యమస్థాయికి చేరుకోవడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల అపార కృషిని నిక్షిప్తం చేసే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు చోటు లభించడం అరుదైన విషయం. ఆదిలాబాద్ జిల్లా, దుర్గానగర్‌లో 2021, జూలై 4న ఒక గంట సమయంలో 16,900 మంది భాగస్వామ్యంతో 3,54,900 మొక్కలు నాటించడం ద్వారా లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో జోగినిపల్లి చోటు సంపాదించారు. ఇవేకాదు, నిరంతరం మొక్కలు నాటే విశిష్టమైన వ్యక్తులకు.. తిమ్మక్క ఇంటర్నేషనల్ ఫౌండేషన్, సిద్ధార్థ మఠం అందించే వృక్షమాత సాలుమరద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు వరించింది. ఇక రాజస్థాన్‌లో జరిగిన వృక్ష మిత్ర సమ్మాన్ సమారోహ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఐరాస పర్యావరణ విభాగం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలిమ్, ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా విష్ణు లాంబా చేతుల మీదుగా వృక్షమిత్ర అవార్డు అందుకున్నారు. ఇవేకాదు అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు.
-సంజివల్ల రాఘవేందర్ యాదవ్
98669 58883