‘నేను తప్పులు చేస్తూ వెళ్తా.. మీరు చూస్తూ నోరు మూసుకోవాలి’ అన్న చందంగా ఉంది తెలంగాణలో నేటి పరిస్థితి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే సమైక్య పాలనలో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయటానికి అడుగడుగునా నిర్బంధాలు చేసిన రోజులు యాదికొస్తున్నాయి. నాడు ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులను కాలు బయటపెడితే చాలు అరెస్టు చేశారు. రోడ్డెక్కితే దాడులు చేశారు. అలాంటి విష సంస్కృతే మళ్లీ తెరమీదికొచ్చింది.
Telangana | స్వరాష్ట్రంలో గత పదేండ్లలో ఎన్నడూ లేని పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొన్నది. ప్రశ్నించినవారిపై దాడులు, స్వయంగా ముఖ్యమంత్రే బూతుపురాణాన్ని అం దుకోవడాన్ని చూస్తుంటే ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎంత అసహనంతో ఉన్నాయో అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి హుందాగా ప్రవర్తించాల్సిందిపోయి, ‘పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లు పీకి గోలీలు ఆడుతా’ అంటూ వికృత భాషను ప్రయోగిస్తుండటాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
కాంగ్రెస్ సర్కార్ కొలువైన నాటినుంచీ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నది. కక్ష సాధింపు రాజకీయాలే లక్ష్యంగా పాలన సాగుతున్నది. హామీల అమలుపై నిలదీసినా, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించినా, లోపాలను ఎత్తిచూపినా అసభ్య పదజాలంతో దూషించడమో, అరెస్టు చేసి నిర్బంధించడమో పరిపాటిగా మారింది. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నల ధాటిని తట్టుకోలేక.. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డే బూతుపురాణం అందుకున్నారు. ‘వెంటనే బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షలు తెచ్చుకోండి. మేం రాగానే డిసెంబర్ 9న మాఫీ చేస్తాం’ అని ఎన్నికల ముందు రేవంత్ డంబాచారాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీ, రైతుభరోసాలను మర్చిపోయారు. పార్లమెంట్ ఎన్నికలు రాగానే మళ్లీ ఆయనకు రైతులు యాదికొచ్చారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని ఊరూరా దేవుళ్లపై ఒట్లు వేసి మాట తప్పారు. ఓవైపు రుణమాఫీ అవ్వని రైతులు రోడ్డెక్కడం, మరోవైపు హరీశ్‌రావు నిలదీస్తుండటంతో అసహనంతో ఆయన క్యాంపు కార్యాలయంపై దాడి చేయించారు. మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షాశిబిరంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రశ్నించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అసెంబ్లీ సాక్షిగా అవమానించారు. హామీలు ఇవ్వడం, అమలు చేయలేక చేతులెత్తేయడం, ప్రశ్నించినవారిపై దాడులకు తెగబడటం.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం.
రాష్ట్రంలో నిర్బంధకాండకు రేవంత్ సర్కార్ తెరతీసింది. రైతు రుణమాఫీపై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టులపై స్వయంగా ముఖ్యమంత్రి స్వగ్రామంలో దాడికి పాల్పడటం, సినీ ఫక్కీలో వారిని చేజింగ్ చేయటమే అందుకు నిదర్శనం. యూట్యూబ్ చానళ్లను అడ్డుపెట్టుకుని గెలిచిన రేవంత్.. నేడు యూట్యూబ్ జర్నలిజంపై వెకిలిగా మాట్లాడటం అవకాశవాద రాజకీయం కాదా? అంతేకాదు, డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతంను అక్రమంగా అరెస్ట్ చేశారు. న్యాయస్థానం చివాట్లు పెట్టడంతో చేసేదేం లేక వదిలేశారు. మరోవైపు సమైక్య పాలకులు అనుమతులిచ్చిన ఇండ్లను హైడ్రా పేరిట కూల్చి పేదలను కాంగ్రెస్ సర్కార్ రోడ్డున పడేస్తున్నది. ఇదెక్కడి దౌర్జన్యమని ప్రశ్నించిన బాధితులపైనే కేసులు పెడుతుండటం బాధాకరం.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో హైకోర్టు చీవాట్లు పెట్టినా కాంగ్రెస్ బుద్ధి మారడం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టి ఫిరాయింపులను పరాకాష్ఠకు తీసుకెళ్లింది. ఈ అంశంపై బీఆర్ఎస్ నిలదీయడంతో ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్ మళ్లీ డైవర్షన్ రాజకీయాలకు తెరలేపింది. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ గాంధీ డ్రామా మొదలుపెట్టారు. ఆయన మాటలకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కౌంటర్ ఇవ్వడంతో కాంగ్రెస్ బరితెగించింది. కౌశిక్‌రెడ్డిని ఇంట్లోనే నిర్బంధించి, అరికెపూడి గాంధీకి మాత్రం ఎర్ర తివాచీ పరిచింది. ఎస్కార్ట్ ఇచ్చి మరీ కౌశిక్‌రెడ్డి ఇంటిమీదకు దాడికి పంపింది. దాడి సందర్భంగా గాంధీ మాట్లాడిన బూతులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. అంతేకాదు, దాడి చేయడమే కాకుండా బాధితుడిపైనే కేసు నమోదు చేయడం హేయం. ఇదేంటని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రంతా వారిని ఇబ్బందులకు గురిచేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలపై లాఠీలు ఝుళిపించారు. హరీశ్‌రావు అరెస్టును చూసి రాష్ట్రమంతా ఎలా స్పందించిందో, ఊరు ఊరు ఎలా కదిలిందో పాలకులు గుర్తెరగాలి. అది ఉద్యమ చైతన్యం. ఉద్యమంలో సమైక్య పాలకులు నిర్బంధించినా, జైలులో పెట్టినా వెన్నుచూపక పోరాడింది గులాబీ దళం. కేసీఆర్ నాయకత్వంలో పోరు నడిపి తెలంగాణను సాధించింది.
పదేండ్ల పాటు తెలంగాణలో ఎలాంటి అలజడి లేదు. ఇలాంటి విష సంస్కృతికి కేసీఆర్ ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. మొన్నటివరకు కుక్కిన పేనులా పడున్నవారు నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ రౌడీయిజానికి పాల్పడుతున్నారు.
ఈ నిర్బంధాలు తెలంగాణ సమాజానికి కొత్తకాదు. నిర్బంధాలు, దాడులతో నిజాలను దాచాలనుకోవడం మూర్ఖత్వమే. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎంతో కాలం పాలన కొనసాగించలేరు. నిర్బంధపు కంచెలు తెంచడం ప్రజలకు, బీఆర్ఎస్కు కొత్తకాదు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ. ఎదురుదెబ్బ తగిలిన ప్రతీసారి ఫీనిక్స్ పక్షిలా రెట్టింపు వేగంతో పైకి లేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని ఈ పీఆర్ స్టంట్లను బంద్ చేయాలి. పరిపాలనపై దృష్టిపెట్టి హామీలను అమలుచేయాలి. లేదంటే ప్రజా తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుంది.