గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 2.04 శాతం ఓట్లతోనే ఓడిపోయింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలన తర్వాత తెలంగాణ ప్రజలు 39 సీట్లు ఇచ్చిండ్లు. జాతీయ అంశాలు డామినేట్ చేయటం వల్ల లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు సాధించలేదు. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ… బీఆర్ఎస్ పని అయిపోయింది. ‘తెలంగాణలో ఇక మేమే ఉంటం’ అని ప్రచారాన్ని మొదలుపెట్టాయి. కానీ, గత ఏడాదిగా జరుగుతున్న పరిణామాలను, పర్యవసానాలను గమనిస్తే తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు ఆదెరువు, ఆదరణ మళ్లీ బీఆర్ఎస్ అనే స్పష్టమవుతున్నది.
బీఆర్ఎస్ మాయమైపోతదనుకున్న వాదనను పటాపంచలు చేస్తూ ఈ గడ్డ తమదని, ఈ గడ్డ ప్రజల మద్దతు తమకే ఉన్నదని ఈ ఏడాదిలో బీఆర్ఎస్ నిరూపించుకున్నది. ఒకరకంగా చెప్పాలంటే ప్రజల ఆవేదనను తీర్చటంలో, ప్రజల సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించటంలో బీఆర్ఎస్ అధికార పాత్ర పోషిస్తుం టే.. కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్పై విమర్శలతో కాలం గడుపుతూ ప్రతిపక్ష పాత్ర నుంచి బయటకు రాలేదన్న అభిప్రాయాలూ అదే స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఏడాది కాకముందే ‘ఈ ప్రభుత్వం మళ్లీ రాదు. కేసీఆర్ అయితేనే తెలంగాణకు న్యాయం చేస్తడు’ అనే అభిప్రాయం ప్రజల్లో బహిరంగంగానే వ్యక్తమవుతుండటం తెలంగాణ గడ్డకు, బీఆర్ఎస్కు ఉన్న అవినాభా వ సంబంధాన్ని నిరూపిస్తున్నది. ‘మేమే ప్రధాన ప్రతిపక్షం’ అని అనుకున్న రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్‌తో కుమ్మక్కై, కాంగ్రెస్ విధానాలకు వంత పా డుతూ ఉంటే బీఆర్ఎస్ మాత్రం మొక్కవోని దీక్ష, పట్టుదలతో పోరాటం చేస్తున్నది. ఎక్కడ ప్రజా సమస్యలుంటే అక్కడ బీఆర్ఎస్ నేతలు రెక్కలు కట్టుకొని వాలిపోతున్న సందర్భాలు ఏడాది కాలంగా తెలంగాణ ప్రజా జీవితంలో భాగమైపోయాయి.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇటు శాసనసభలో, అటు ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నామమాత్రపు పాత్ర పోషిస్తున్నదా? అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ప్రజల మధ్య దోషిగా నిలబెడుతున్నదా? ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అనివార్యతలు సృష్టిస్తున్నదా? ముందూ వెనుకా ఆలోచించకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటి పర్యవసానాలను అంచనా వేసి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నదా? తత్ఫలితంగా ప్రభుత్వాన్ని భూ మార్గం పట్టిస్తున్నదా? వంటి అనేకానేక ప్రశ్నలకు ఏడాది కాలంగా బీఆర్ఎస్ ఆచరించిన కార్యాచరణతో ప్రభుత్వం దిగివచ్చిన సందర్భాలు అనేకం కండ్ల ముందున్నాయి. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పడావుబడ్డ భూముల్లో బంగారం పండేలా వ్యవసాయరంగాన్ని స్థిరీకరించింది. విద్యుత్తు సాధన విషయంలో అచ్చెరువొందే వెలుగు బావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. ప్రజల మనసుల్లో చెరగని సంతకం చేసిన విషయమూ తెలిసిందే.
అధికారం కోసమే బీఆర్ఎస్ పుట్టలేదని చెప్పడానికి పద్నాలుగేండ్ల ఉద్యమ ప్రయాణమే నిదర్శనం. అంతేకాదు, కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసింది. ప్రజల బాగోగులే తనకు ప్రాణప్రదమని ఆచరించి చూపింది. దేశంలో రాష్ర్టాన్ని ముందువరుసలో నిలిపింది.
తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ గరిమ నుంచి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ దూరం కాలేదని ఏడాది కాలంగా ప్రతీ సందర్భంలో నిరూపిస్తూనే ఉన్నది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కట్టిన హామీల వంతెన ఆ పార్టీకి కత్తుల వంతెనగా రూపాంతరం చెందిందని గడిచిన సంవత్సర కాలంగా జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చీరాగానే కృష్ణా నదీజలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ రైతాంగానికి అశనిపాతం ఎలా కాబోతున్నదో బీఆర్ఎస్ బట్టబయలు చేసింది. నల్లగొండ గడ్డ మీద కేసీఆర్ బహిరంగసభ సాక్షిగా ధర్మాగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగా కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేయాల్సిన అనివార్యతను బీఆర్ఎస్ పార్టీ సృష్టించింది. సర్కార్ తీసుకున్న ప్రతీ ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల్లో ఉంటూ బీఆర్ఎస్ ఎండగడుతూనే ఉన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యక్తిగత, రాజకీయ కక్షసాధింపుల చర్యలను తిప్పికొడుతూ, వాటిని ఎదుర్కొంటూనే ప్రజాక్షేత్రంలో అధికార పార్టీపై పైచేయి సాధించింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరిని బాహాటంగానే వ్యతిరేకించడం, ఒక రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన న్యాయ నిపుణుడితో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ చైర్మన్ అనుసరించిన వైఖరిని తప్పుబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్లడం, ఏకంగా ఆ కమిషన్ చైర్మన్ తప్పుకొనేలా చేయటం బీఆర్ఎస్ సాహసోపేత చర్యగా నిలిచింది.
ఇక పదేండ్లుగా పైసా కూడా విద్యుత్తు చార్జీలు పెంచకపోవటమే కాకుండా రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వటం, నాయీ బ్రాహ్మణులు, లాండ్రీలకు 250 యూనిట్ల దాకా ఉచిత కరెంట్ ఇవ్వటం, పరిశ్రమలకు పవర్ హాలీడేలు లేకుండా చేయటం వంటి విద్యుత్తు విజయాలను బీఆర్ఎస్ లిఖించుకున్నది. అలాగే విద్యుత్తు చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపేందుకు సర్కార్ సిద్ధపడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టింది. ప్రభుత్వ తీరును ఎండగట్టింది. సర్కారు ప్రతిపాదనను తిరస్కరించేలా విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ వద్ద బలమైన వాదనలు వినిపించింది. దీంతో విద్యుత్తు ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వం దిగొచ్చేలా చేసిన ఘనత బీఆర్ఎస్ సొంతమైంది.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి దాటవేసిన కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని బీఆర్ఎస్ ఎండగట్టింది. శ్వేతపత్రాల పేరుతో తెలంగాణపై మోయలేని అప్పులున్నాయని, ఆ పాపం బీఆర్ఎస్దే అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అదే పనిగా దుష్ప్రచారం చేస్తూ రైతులను మోసం చేస్తున్నదని గ్రహించిన గులాబీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. ఊరూరా నిరసనలు చేపట్టాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమకు చేసిన నమ్మకద్రోహాన్ని రైతాంగానికి నివేదించటంలో బీఆర్ఎస్ తన కార్యాచరణ ద్వారా సఫలీకృతమైంది. బీఆర్ఎస్కు దగ్గరైన రైతాంగం దృష్టిని తనవైపు మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కోసం ‘దేవుళ్ల’ను ఆశ్రయించింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దశలవారీ రుణమాఫీని చేపట్టాల్సిన అనివార్యతను బీఆర్ఎస్ సృష్టించింది. ఇప్పటికీ రూ.2 లక్షల రుణమాఫీ హామీ సంపూర్ణం కానేలేదు. లగచర్ల, దిలావర్పూర్ ఉదంతాలు రైతు, బీఆర్ఎస్ ఉద్యమస్ఫూర్తికి ప్రతిబింబాలుగా చెప్పుకోవచ్చు. రైతుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటున్నదని బీఆర్ఎస్ నిరూపించింది. లగచర్ల ఉదంతం విషయంలో గిరిజన రైతుల కోసం ఢిల్లీ దాకా వెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్ మెట్లు ఎక్కి వారికి బాసటగా నిలిచింది. ఫలితంగా లగచర్లలో ప్రతిపాదిత ఫార్మా కంపెనీల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. (కొత్తగా ఇండస్ట్రియల్ క్లస్టర్ అని చెప్తున్నది).
మూసీ సుందరీకరణ, హైడ్రా పేర్లతో సాగుతున్న సర్కారు కూల్చివేతలపై బీఆర్ఎస్ సమరం చేస్తున్నది. గూడు కోల్పోయిన పేదల తరపున ఒకవైపు న్యాయపోరాటం, మరోవైపు ప్రజాపోరాటం చేస్తూ నిరాశ్రయులైనవారికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా తమ గోడును విని, అందుకు సరైన పరిష్కార మార్గం చూపే వేదికగా ప్రజలు తెలంగాణ భవన్‌ను చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్నివర్గాల బాధలను తన బాధలా స్వీకరించినట్టే తెలంగాణ భవన్ ఏడాది కాలంగా ప్రతీ వర్గం కన్నీటిని తుడిచే నేస్తమైంది. నాయకత్వంపై వ్యక్తిగత కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నా బాధ్యతాయుత ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన పాత్రను పోషిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నదని ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక అంశాల్లో నిరూపించింది.
స్వచ్ఛబయో, అమృత్ పథకం టెండర్ల గోల్మాల్, బియ్యం కొనుగోళ్లలో వేల కోట్ల అవినీతి వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ అసలు నీతిని ఎండగడుతున్నది. అదానీతో కాంగ్రెస్ ప్రభుత్వం అంటకాగుతున్న వైఖరిని ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ బయట పెట్టడంతో స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని వెనక్కి ఇవ్వాల్సిన అనివార్యతను బీఆర్ఎస్ సృష్టించింది. మొత్తంగా తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ‘తెలంగాణలో ఇక మేమే ఉంటం’ అని స్వీయ ప్రచార పటాటోపంతో పోటా పోటీగా చెలరేగిపోయిన కాంగ్రెస్, బీజేపీ ఆటలు సాగవని గడచిన ఏడాది కాలంలో ప్రతీ సందర్భంలోనూ నిరూపించింది. తెలంగాణ ప్రజలకు ఆదెరువు, ఆదరణ మళ్లీ బీఆర్ఎస్ అనేది కండ్లముందు కనిపిస్తున్న కఠోర సత్యం.
– నూర శ్రీనివాస్