నాలుగు దశాబ్దాల కింద ఎన్టీఆర్ తెలుగు వాడి ఆత్మగౌరవం గురించి ఎలుగెత్తి చాటారు. అందరూ భేష్ అన్నారు. అన్నకు అధికారం కట్టబెట్టారు. గతాన్ని వర్తమానంలో ఇప్పటికీ కొందరు గుర్తుచేస్తూ ఉంటారు. ఈ విషయంలో తొలి స్థానంలో మీడియా ఉంటుంది. కొన్ని టీవీలు, పత్రికలు సమయం చిక్కిన ప్రతీ సందర్భంలో ఆత్మగౌరవం గురించి చాలా లోతుగా విశ్లేషణ చేస్తాయి. ఇంకా టీడీపీ విషయంలో ఆ పార్టీ కార్యక్రమాల విషయంలో తెలుగు వారికి అది చేసిన మేలు గురించి గొంతు చించుకొని దిక్కులు పిక్కటిల్లేలా చెప్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. కానీ, ఎందుకో తెలంగాణ విషయంలో దానికి భిన్నంగా వ్యవహరిస్తాయి.
తెలుగు వాడి ఆత్మగౌరవంలో తెలంగాణకు స్థానం లేదా? అస్సలు ఆ విషయం గురించి సోయి ఎందుకు ఉండటం లేదు? అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా అంతే. ఈ భిన్న ధోరణి ఎందువల్ల వచ్చింది? వీటికి గల కారణాలేమిటనే విషయాలను లోతుగా చర్చించాలి. తరచిచూడాలి. ఈ విషయం గురించి విశ్లేషణ ఇప్పుడే ఎందుకు చేయాలి? అనే సందేహం సహజంగానే వస్తుంది. దానికి కారణం లేకపోలేదు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ, సందర్భాలే దీనికి నేపథ్యం.
తెలుగు నేలపై బీఆర్ఎస్ (టీఆర్ఎస్) సరికొత్త చరిత్రను రికార్డు చేసింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ స్థానం ప్రత్యేకమైనది. ఉద్యమ పార్టీ ఆవిర్భవించిన అనంతరం ఎందరినో భాగస్వామ్యులను చేసి అసాధ్యమనుకున్న స్వరాష్ట్ర కాంక్షను సుసాధ్యం చేసి స్వయం పాలనను సాధించింది, చూపించింది. తెలంగాణ ఇప్పట్లో తేలేదీ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదనుకున్న వాళ్ల అనుమానాలు పటాపంచలు చేసింది. దశాబ్దాల కలను నిజం చేసింది. అంతేకాదు, తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పునకు పునాదులు వేసింది.
అలాంటి పార్టీ 24 వసంతాలు పూర్తిచేసుకొని 25వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా రజతోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో మీడియా ఏం చేసింది? ఈ పార్టీ గురించి, ఈ పార్టీ చారిత్రకాంశాల గురించిన చర్చోపచర్చలు టీవీల్లో ఎందుకు లేవు? పత్రికల్లో మూడురోజుల పాటు ఓ పేజీ కేటాయించి అచ్చేసిన పరిస్థితి తెలుగు ప్రధాన స్రవంతి పత్రికల్లో ఎందుకు రాలేదు? యూట్యూబ్‌లలో పచ్చళ్ల పంచాయితీల గురించి, ఏపీలో జరుగుతున్న గ్రామ పంచాయితీ స్వల్ప ఘర్షణలకు ఇచ్చిన ప్రాధాన్యం తెలంగాణ రాజకీయ పార్టీకి ఎందుకివ్వలేదు? ఇవ్వడానికి వారికి మనస్సు ఎందుకు అంగీకరించలేదు? ప్రస్తుతం ఈ ప్రశ్నలు తెలంగాణ సమాజంలో తలెత్తుతున్నాయి.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి అస్సలు విలువే లేదని కొన్ని మీడియా సంస్థల వాళ్లు భావించినట్టున్నారు. తెలంగాణ అంటే తమ దృష్టిలో వలస ప్రాంతం అనే భావనలో నుంచి ఇంకా వారు బయటకు రానట్టే ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగానే ప్రధాన స్రవంతి మీడియా నడుస్తున్నది. సీమాంధ్రకు సంబంధించిన మీడియా హడావుడే ఇప్పటికీ ఎక్కువగా ఉంటుంది. సదరు మీడియా సంస్థలకు, బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి పెద్ద దూరం కూడా ఏమీ లేదు. అయినా, ఈ ప్రాంతంలో జరుగుతున్న రజతోత్సవ వేడుకల హడావుడి గురించిన అలికిడి వీళ్ల చెవులకు విన్పించినట్టు లేదు. వినాలని కూడా వారు అనుకున్నట్టు లేదు.
తెలుగు వారందరూ ఒక్కటే అనుకున్నప్పుడు, తెలంగాణ ప్రజలంతా సమానంగా ఎదగాలని కోరుకున్నప్పుడు తెలంగాణ అస్తిత్వపు నమూనా అయినా బీఆర్ఎస్ గురించి, చరిత్రలో అది పోషించిన పాత్ర గురించిన చర్చలు టీవీల్లో ఎందుకు రాలేదు. పత్రికల్లో ఆయా రంగాల నిపుణుల చేత వ్యాసాలు ఎందుకు రాయించలేదు. అంటే తాము పట్టించుకోదలచుకోలేదు. తమకు సంబంధించిన అంశం కాదనే ధోరణి వారిదనే ఆరోపణలు తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి టీఆర్ఎస్ పద్నాలుగేండ్లకుపైగా ఉద్యమించింది. పదేండ్ల పాటు రాష్ర్టాన్ని పాలించింది. ఉద్యమ ట్యాగ్‌లైన్ అయిన నీళ్లు, నిధులు, నియామకాలను పరిపూర్తి చేయడంలో సఫలమైంది. తెలంగాణ ప్రజలూ పాలించుకోగలరని నిరూపించింది. అంతేకాదు, పంజాబ్‌తో పోటీ పడి ధాన్యం ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు తయారుచేసి, అమలుచేసింది. దేశంలోనే అతి తక్కువకాలంలో తలసరి ఆదాయం పెంచుకున్న రాష్ట్రంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచింది. హైదరాబాద్ నగర ఖ్యాతిని ఇనుమడించింది. దేశానికే సరికొత్త దారి చూపించింది. యావత్ దేశ ప్రజలకు ఉపాధి కేంద్రంగా తెలంగాణను తయారుచేసింది. ఇన్ని సానుకూలంశాలున్న పార్టీ గురించి చర్చించాలనే, ప్రచురించాలనే విషయాన్ని తెలుగు ప్రధాన స్రవంతి మీడియా పట్టించుకోలేదనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి.
ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాల గురించి గ్రామీణ తెలంగాణ ప్రజలు సైతం తెలుసుకునేలా వార్తలు ముద్రిస్తారు. టీవీల్లో చూపిస్తారు. ఇది చాలదన్నట్టు టీవీల్లో చర్చలు పెట్టేస్తారు. గంటల కొద్ది సమయం వాటికి కేటాయిస్తారు. అదీ కాకపోతే సినిమా రంగంలోని రంగులను, హంగులను ప్రజల ముంగిట్లోకి తెచ్చి.. వినోదం కుమ్మరిస్తున్నామని చెప్పుకొంటారు. అంతా ఒక్కటే.. అందరం ఒక్కటే అనే ట్యాగ్లైన్లు తగిలిస్తారు. కానీ, తెలంగాణ రాజకీయ పార్టీ గురించిన పట్టింపును విస్మరిస్తారు. ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ర్టాలు రెండైనా ఒక్కటే అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇంకా చెప్పాలంటే.. తెలుగు జాతి మనది, రెండుగ వెలుగు జాతి మనదని తెలంగాణ ప్రజల భావన ఇది. తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసిన, చేస్తున్న పార్టీల గురించిన విషయాలను నిష్పక్షపాతంగా ప్రజలకు చెప్పాలి, చూపించాలి. అప్పుడే, తెలుగు వారి మధ్య మరింత ఐక్యత, సఖ్యత పరిఢవిల్లుతుంది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
– అస్కాని మారుతీ సాగర్
9010756666