వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే పట్టభద్రులకు మేలు జరుగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27న జరగనున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఐదు నెలలు పూర్తయ్యాయి. గత ప్రభుత్వ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీ కండ్ల ముందే ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలను తాము ఇచ్చినట్టు కాంగ్రెస్ చెప్పుకొంటున్నది. ఈ వాస్తవాన్ని విజ్ఞులైన పట్టభద్రులు గమనించాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే గ్రాడ్యుయేట్లు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి. బీఆర్ఎస్తోనే యువతకు మేలు జరుగుతుంది. ఉద్యోగుల భర్తీ కోసం కాంగ్రెస్ సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి. శాసనమండలిలో ప్రశ్నించే గొంతుక అవసరం. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి శాసనమండలిలో పోరాడేందుకు పట్టభద్రుల ప్రతినిధిగా ఏనుగుల రాకేష్‌రెడ్డి ఉంటేనే పట్టభద్రుల సమస్యలు పరిష్కారమవుతాయి.
నిరుద్యోగులకు, యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యేలా రాష్ట్ర సర్కార్‌ను నిలదీసేందుకు పెద్దల సభలో ఎవరు ఉండాలనేది పట్టభద్రులే ఆలోచించుకోవాలి. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అయితేనే మన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుంది. అదే అధికార పార్టీ అభ్యర్థికో, మరొకరికో అవకాశం ఇస్తే మొదటికే మోసం వస్తుంది. ప్రభుత్వ పెద్దలకు వినతిపత్రాలు, ప్రభుత్వం కార్యక్రమాలపై పొగడ్తలు తప్ప పనులు కావు. అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకనే శాసనమండలికి పంపిద్దాం.
గత ఐదు నెలల కాంగ్రెస్ పాలన మన కండ్ల ముందుంది. విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు గత బీఆర్ఎస్ పాలనను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకుని ఒక్కసారి ఆలోచించండి. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకునేందుకు ఒక్క మెతుకును చూస్తే చాలు. అలాగే కాంగ్రెస్ పరిపాలన గురించి ఓ నిర్ణయానికి వచ్చేందుకు ఈ ఐదు నెలలు సరిపోతాయి. నీళ్లు లేక ఎండిపోయిన పంటలు, కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు, నేతన్న చావులు, ఆటో డ్రైవర్ల బలవన్మరణాలు ఇలా ఒక్కటా, రెండా ఎన్నో సమస్యలు మన తెలంగాణను మళ్లీ చుట్టుముట్టాయి. అమాయక ప్రజలను మోసం చేయవచ్చేమో కానీ విజ్ఞులైన విద్యావంతులను మోసం చేయలేరని నిరూపిద్దాం. చరిత్రలో నిలిచిపోయేలా తీర్పు ఇద్దాం.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికీ, ఎప్పటికీ తెలంగాణ పక్షపాతే. సంక్షేమ సారథే. ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల బాగు కోసమే పరితపిస్తారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన బస్సుయాత్ర ద్వారా ఈ విషయం తెలంగాణ సమాజానికి స్పష్టమైంది. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అనే విషయం అవగతమైంది. కేసీఆర్ ప్రశ్నించినందుకే రైతుబంధు ప్రక్రియ ముందుకుసాగింది. కేసీఆర్ ప్రశ్నించినందుకే నిలిచిపోయిన ఒక నెల పెన్షన్ వచ్చింది. కేసీఆర్ పర్యటించిన తెల్లారే ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. నీళ్లు అందాయి. ఆయన రోడ్డెక్కాకే వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతమ య్యాయి. ‘వడ్లకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమాయె’ అని కేసీఆర్ గొంతెత్తిన తర్వాతే కాంగ్రెస్ సర్కార్ నోరు విప్పింది. సన్న వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పి అసలు విషయాన్ని బయటపెట్టింది. లేదంటే ఇంకా సాగదీస్తూనే ఉండేది.
తాము ఏం చేసినా నడుస్తుందని కాంగ్రెస్ సర్కార్ అనుకుంటున్నది. అందుకే ఒక్క ఉద్యోగమైనా భర్తీ చేయకుండానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చేశామని పట్టపగలే అబద్ధాలు చెప్తున్నది. ఈ నేపథ్యంలో పట్టభద్రులు మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తమను మళ్లీ మళ్లీ మోసం చేయలేరని చాటిచెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి)
– గుండమల్ల సతీష్ కుమార్
94931 55522