పదేండ్ల క్రితం 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినప్పుడు.. తలసరి ఆదాయంలో 10వ స్థానం, భౌగోళిక విస్తీర్ణంలో 11వ స్థానం, జనాభాలో 12వ స్థానంలో ఉన్నది. దశాబ్ద కాలంలో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. కరెంట్ ఎప్పుడో పోతదో తెలియనిస్థితి నుంచి రెప్పపాటు కూడా సరఫరా నిలిచిపోని నిరంతర వెలుగు దివ్వెగా మారింది. పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పనలో గణనీయమైన ప్రగతిని సాధించింది. తలసరి ఆదాయంలో చిన్నరాష్ర్టాల్లో అగ్రస్థానానికి చేరింది. దేశ జనాభాలో 2.7 శాతం ఉన్న తెలంగాణ జీడీపీ వృద్ధి దేశ సగటును మించిపోయింది. పెద్ద రాష్ర్టాలను విభజిస్తే కలిగే ప్రయోజనాలకు తెలంగాణ అభివృద్ధి ఓ మాడల్.
Telangana | కొత్త రాష్ట్రమైనప్పటికీ పదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది. దేశంలో మరిన్ని కొత్త రాష్ర్టాల ఏర్పాటుకు ఓ సక్సెస్ఫుల్ మాడల్‌గా తెలంగాణ నిలిచింది. కేసీఆర్ ప్రగతిశీల పాలనలో చిన్న రాష్ట్రమైనప్పటికీ అన్నిరంగాల్లో తెలంగాణ ఉరకలేసింది. తలసరి ఆదాయం, జీఎస్డీపీ, స్థాపిత విద్యుత్తు సామర్థ్యం, ఐటీ ఉద్యోగాలు-ఎగుమతులు ఇలా పలు అంశాల్లో గడిచిన పదేండ్లలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించింది. ఇదెవరో చెప్పిన మాట కాదు. 180 ఏండ్ల నుంచి నిరంతరాయంగా ప్రచురణలు కొనసాగిస్తూ.. ప్రపంచ ప్రఖ్యాత పత్రికల్లో అగ్రస్థానంలో నిలిచిన బ్రిటిష్ వీక్లీ మ్యాగజీన్ ‘ది ఎకానమిస్ట్’ తేల్చిచెప్పిన వాస్తవం.
తెలంగాణ తలసరి ఆదాయం ఇలా..: 2014లో తలసరి ఆదాయం రూ. 93,151గా ఉంటే, 2023 నాటికి రూ. 3,12,398 చేరుకున్నది. అంటే 235 శాతం పెరిగింది.
కేసీఆర్ పాలనలో పదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని ‘ది ఎకానమిస్ట్’ తన కథనంలో వెల్లడించింది. కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో రాష్ట్రం పురోభివృద్ధి సాధించినట్టు వెల్లడించింది. తలసరి ఆదాయం, జీఎస్డీపీ, స్థాపిత విద్యుత్తు సామర్థ్యం, ఐటీ ఉద్యోగాలు-ఎగుమతులు ఇలా పలు అంశాల్లో గడిచిన పదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని కొనియాడింది. దేశంలో మరిన్ని కొత్త రాష్ర్టాల ఏర్పాటుకు ఓ సక్సెస్ఫుల్ మాడల్‌గా తెలంగాణ నిలిచిందని ప్రశంసించింది. చిన్న రాష్ర్టాల ఏర్పాటుతో పెద్ద లాభాలు కలుగుతాయనే వాదనకు నిలువెత్తు నిరూపణే తెలంగాణగా అభివర్ణించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కృషిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘ది ఎకానమిస్ట్’ ఏయే రంగాలపై ఏం వ్యాఖ్యానించింది? ఆయా రంగాల్లో జరిగిన అభివృద్ధి ఏమిటో సమగ్రంగా విశ్లేషిద్దాం.
పదేండ్లలో తెలంగాణ జీఎస్డీపీ పెరిగిందిలా..: 2014లో జీఎస్డీపీ రూ. 3.79 లక్షల కోట్లు ఉంటే అది 2023 నాటికి రూ. 13.28 లక్షల కోట్లు అయింది. అంటే 251 శాతం పెరిగింది. తెలంగాణ తలసరి ఆదాయం ఇలా..: 2014లో తలసరి ఆదాయం రూ. 93,151గా ఉంటే, 2023 నాటికి రూ. 3,12,398 చేరుకున్నది. అంటే 235 శాతం పెరిగింది.
జీడీపీ-తలసరిపై ‘ది ఎకానమిస్ట్’ ఏమన్నదంటే..?: దశాబ్దం కిందట 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. అప్పుడు జనాభా పరంగా దేశంలో తెలంగాణది 12వ స్థానం. విస్తీర్ణంపరంగా 11వ స్థానం, తలసరి ఆదాయంపరంగా 10వ ర్యాంకు. అయితే, కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో విశేష ప్రగతిని సాధించింది. తలసరి ఆదాయంలో దశాబ్దం కిందట పదో స్థానంలో ఉన్న తెలంగాణ.. 2023 నాటికి దేశంలోనే అగ్రస్థానానికి ఎగబాకింది. అంతేకాదు, దేశ జనాభాలో 2.7 శాతం మాత్రమే వాటా కలిగిన ఈ రాష్ట్రం జీడీపీలో 4.9 శాతం వాటాను కలిగి ఉన్నది. కొత్త రాష్ట్రమైనప్పటికీ పదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది.
స్థాపిత విద్యుత్తు సామర్థ్యంపై…: తెలంగాణ ప్రాంతానికి ఏండ్ల తరబడి సమస్యలుగా మారిన విద్యుత్తు, నీళ్లు, నిధులపై అధికారంలోకి రాగానే కేసీఆర్ దృష్టి సారించారు. విద్యుదుత్పత్తిలో స్వావలంబన సాధించాలన్న ఉద్దేశంతో స్థాపిత విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 7,778 మెగావాట్లుగా (7.8 గిగావాట్లు) ఉన్న స్థాపిత విద్యుత్తు సామర్థ్యం.. కేసీఆర్ దూరదృష్టితో తొమ్మిదిన్నరేండ్లలోనే 150 శాతం వరకూ పెరిగి సుమారు 19,464 మెగావాట్ల (19.5 గిగావాట్ల)కు చేరుకున్నది.
తొమ్మిదేండ్లలో ఐటీ అభివృద్ధి ఇలా…: ఐటీ ఎగుమతులు 4 రెట్లు పెరిగి, 2023నాటికి ఐటీ ఎగుమతుల విలువ 29 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదేవిధంగా ఈ పదేండ్లలో ఐటీ ఉద్యోగాల కల్పన 3 రెట్లు పెరిగి.. 2023 నాటికి ఐటీరంగంలో 9 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు లభించాయి.
ఐటీ ఎగుమతులు, ఉద్యోగాలపై ‘ది ఎకానమిస్ట్’ ఏమన్నదంటే?: కేసీఆర్ పాలనలో ఐటీరంగం గణనీయమైన ప్రగతి సాధించింది. 2014 నుంచి 2023 వరకు తొమ్మిదేండ్లలో ఐటీ ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయి. తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ ప్రస్తుతం 29 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. పదేండ్లలో ఐటీరంగంలో మూడు రెట్ల మేర ఉద్యోగాలు పెరిగి 9 లక్షలకు చేరాయి. రాజధాని హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారింది. ఏటా లక్షలాది మంది ఈ నగరానికి ఉద్యోగాల కోసం క్యూ కడుతున్నారు. 1995-2004 మధ్య ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో సైబర్ టవర్ నిర్మించి ఐటీపై అవగాహన ఉన్న నేతగా పేరు సంపాదించుకున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం టెక్ వ్యూహాన్ని రెట్టింపు చేసింది. అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ను తమ పెట్టుబడులకు కేంద్రంగా మార్చుకున్నాయి.
అనుమానాలు పటాపంచలు: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిపై తొలుత చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని అయితే కేసీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన నూతన సంస్కరణలు రాష్ర్టాభివృద్ధికి బాటలు వేశాయని ‘ది ఎకానమిస్ట్’ కథనంలో పేర్కొన్నది. ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు, పరిశ్రమలు, ఇండ్ల అనుమతులు, ఇతర విషయాల్లో పారదర్శంగా ఉండేందుకు కేసీఆర్ సర్కారు ఆన్లైన్ విధానాలను తీసుకొచ్చినట్టు గుర్తుచేసింది. వ్యాపార అనుమతులకు సింగిల్ విండోలో అనుమతి ఇచ్చే పద్ధతిని తీసుకొచ్చి.. ఎక్కడా ఎలాంటి అవినీతికి తావులేకుండా, సమయం వృథా కాకుండా వెంటనే 15 రోజుల్లోనే అనుమతి వచ్చేలా ఆన్లైన్ విధానాన్ని రూపొందించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తవించింది.
స్థాపిత విద్యుత్తు సామర్థ్యం: తెలంగాణ ఏర్పడిన నాటికి స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7.8 గిగావాట్లు మాత్రమే ఉండగా అది కేసీఆర్‌పాలనలో పదేండ్లలో 19.5 గిగావాట్లకు పెరిగింది.