ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై మీరు చేసిన ప్రసంగంలో ‘మహిళలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలనే పోరాటం దశాబ్దాలుగా కొనసాగుతున్నది.. ఎంతో మంది మహిళలు ఈ అంశాన్ని నా ముందు ప్రస్తావించారు. ఎందరో అక్కచెల్లెళ్లు నాకు లేఖలు రాశారు’ అని పేర్కొన్నారు. ఈ దశాబ్దాల పోరాటం మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. మోదీ గారు.. మహిళా రిజర్వేషన్ల కోసం మీరు కూడా కృషి చేశానని చెప్పుకున్నారు. ఇన్నేండ్లుగా మహిళల పోరాటంలో మీ నుంచి ఎప్పుడూ, ఎలాంటి మద్దతు లేదు.
మహిళల దుఃఖాన్ని పంచుకుంటున్నానని, మహిళా రిజర్వేషన్‌కు ఉన్న ప్రతీ అడ్డంకిని తొలగిస్తానని మీ ప్రసంగంలో హామీ ఇచ్చారు. మీ దుఃఖాన్ని తొలగించేందుకు, మహిళా రిజర్వేషన్‌కు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు నేనొక సలహా ఇస్తున్నాను. 2023లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి, 106వ రాజ్యాంగ సవరణలో మీరొక అంశాన్ని పొందుపర్చారు. మహిళా రిజర్వేషన్లతో జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టారు. ఇదొక అడ్డంకిగా నిలుస్తున్నది. కాబట్టి, ఆ అడ్డంకిని మీరు తొలగిస్తే రేపట్నుంచే మహిళా రిజర్వేషన్లను అమలు చేయవచ్చు. కానీ మీరు అలా చేయరు. ఎందుకంటే మీకు నిబద్ధత లేదు.
మీరు 2014లో ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. అప్పుడు మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తామని మీ పార్టీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికలో మహిళా బిల్లును చేర్చడానికి మీరు అంగీకరించలేదు. 2017లో పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో మహిళా బిల్లును కార్యాచరణలో చేర్చాలని అప్పటి సీపీఎం రాజ్యసభ సభ్యుడు సీతారామ్ ఏచూరి డిమాండ్ చేశారు. కానీ మీరు ఎందుకు నిరాకరించారు? 2018లో లోక్‌సభలో సీపీఎం ఎంపీ పీకే శ్రీమతి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆ విజ్ఞప్తిని మీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో మహిళలు రిజర్వేషన్ హక్కు పొందలేదు. ఇది మీ మొదటి ద్రోహం.
2019లో మీరు రెండోసారి గెలిచారు. మీరు కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. మీ మెజారిటీతో రైతులకు వ్యతిరేకమైన మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. అదే మెజారిటీతో మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేదు? మీ అధికారం పూర్తయ్యే సమయంలో లోపభూయిష్టమైన మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు తీసుకొచ్చారు? ఆ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు ఎందుకు సమయం ఇవ్వలేదు? 2023లో మీరు ‘నారీ శక్తి వందన్ అధినియం’ పేరుతో బిల్లును తీసుకొచ్చారు. అందులో 334ఏ అనే సెక్షన్‌ను ప్రవేశపెట్టారు. అందులో జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతనే మహిళా రిజర్వేషన్ అమలు జరుగుతుందని పొందుపర్చారు. దీన్ని మేం అప్పుడే వ్యతిరేకించాం. మహిళా రిజర్వేషన్‌కు, డీలిమిటేషన్‌కు సంబంధమే లేదని చెప్పాం.
మీరు మహిళా రిజర్వేషన్లకు, జనగణన, డీలిమిటేషన్‌కు లింక్ పెట్టకపోయి ఉంటే, 2010లో మీ పార్టీ కూడా మద్దతు తెలిపిన నాటి బిల్లును ఆమోదించి ఉంటే ఇప్పుడు లోక్‌సభలో 180 మంది మహిళా ఎంపీలు ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య కేవలం 74గా మాత్రమే ఉన్నది. ఈ సంఖ్య 2019 నాటి మహిళా ఎంపీల సంఖ్య కంటే తక్కువ. ఇటీవల 10 రాష్ర్టాల ఎన్నికలు జరిగాయి. అందులో గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 10 శాతంగా ఉన్నది. మీ రాష్ట్రం గుజరాత్లో 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 182 సీట్లలో గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు 15 మంది, అంటే 8 శాతం మంది మాత్రమే. పార్లమెంట్లో మెజారిటీ ఉన్నప్పటికీ తక్షణమే అమలు చేయడానికి వీలైన బిల్లును మీరు అమోదించలేదు. ఇది మీరు చేసిన రెండో ద్రోహం.
ముఖ్యమైన రాష్ర్టాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో మీరు ఏప్రిల్ 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ అంశానికి కొత్త రాజ్యాంగ సవరణ చేయడానికి యత్నించారు. ప్రతిపక్ష పార్టీలతో ముందస్తుగా చర్చించలేదు. మహిళా సంఘాలతో సంప్రదింపులు జరపలేదు. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు సభలో ఓడిపోయింది. 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను ముందుకు తీసుకురావాలన్న మీ ఎజెండాను, మహిళా రిజర్వేషన్లతో ముడిపెట్టాలన్న మీ వ్యూహం విఫలమైంది. మీరు ఈ చర్యను ప్రణాళికబద్ధంగానే రూపొందించారని, అందుకే జనగణన ప్రక్రియను ఉద్దేశపూర్వకంగానే ప్రారంభించలేదని ఇప్పుడు స్పష్టమైంది. ఇది మీ మూడో ద్రోహం, మోదీజీ.
మీరు లోక్‌సభ సీట్లను 543 నుంచి 850కి పెంచాలని అనుకున్నారు. మీ ప్రసంగంలో మీరు ఏచెప్పారు. నారీ శక్తి వందన్ సవరణ అనేది ఎవరి నుంచి ఏదీ తీసుకునే బిల్లు కాదని. ఇది అందరికీ కొంత ఇవ్వడానికి ఉద్దేశించిన బిల్లు అని పేర్కొన్నారు. మీ పార్టీలోని సామంత, కులవాద నాయకులతో రాజీపడ్డారు. మీలో మనువాద భావన స్పష్టంగా కనిపించింది. 2011 నాటి జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవడం ద్వారా దళిత, ఆదివాసీ మహిళల హక్కుగా రావాల్సిన రిజర్వ్ సీట్ల వాటాను దూరం చేయాలని అనుకున్న మాట వాస్తవం కాదా?
ఇక చివరగా లోక్‌సభ సీట్ల పునర్విభజన అంశానికి వస్తే, ఇది ప్రత్యేకంగా చర్చించాల్సిన అంశం. రాష్ర్టాల జనాభా అనేది సీట్ల కేటాయింపునకు ప్రాతిపదిక కాకూడదు. ఇలా చేస్తే అభివృద్ధి చెందిన రాష్ర్టాలను శిక్షించినట్టుగా ఉంటుంది. మరి ఏ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉండాలి? ఆ విషయంపై చర్చించాలి, సంప్రదింపులు జరపాలి. ఏది ఏమైనా పునర్విభజన వ్యవహారంతో మహిళా రిజర్వేషన్‌కు ఎలాంటి సంబంధంలేదు.
మహిళా రిజర్వేషన్‌ను తప్పుదోవ పట్టించేలా మీరు ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడం పట్ల మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక మీరు మా కోసం కన్నీళ్లు కార్చొద్దు మోదీ గారు. మీరు 2014లో ఏం చెప్పారో, ఆ హామీని నెరవేర్చండి. ఇతర అంశాలతో లింక్ పెట్టకుండా, షరతులు విధించకుండా వచ్చే సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టండి. అప్పుడు వచ్చే ఎన్నికల నాటి నుంచి రిజర్వేషన్లను అమలు చేయవచ్చు. కాబట్టి, మేం కోరుకునేది ఆచరణ, నాటకీయత కాదు.
– ఇట్లు
బృందా కారత్ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు