తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే దాదాపు రెండేండ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు విషప్రచారం చేస్తున్నారని; ఉభయ తెలుగు రాష్ర్టాల మధ్య నదీ జలాల పంపకాల విషయంలో అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పార్లమెంట్ మాజీ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖామాత్యులు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా..
రాష్ట్ర నీటిపారుదల శాఖామాత్యులు గౌరవనీయ శ్రీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి గారికి, కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం మంగళవారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరిగిన సమయంలో మీరు అక్కడే ఉన్నట్టు, ట్రిబ్యునల్ ముందు విచారణకు హాజరైనట్టు వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ట్రిబ్యునల్ ముందు వాదనల తర్వాత మీరు మీడియాతో మాట్లాడింది కూడా నేను విన్నాను. ఈ సందర్భంగా కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. కృష్ణా జలాల పంపకాల్లో మార్పుల కోసం, తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం ఈ రోజు ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వం వాదనలను వినిపిస్తున్నదంటే దానికి కారణం కేసీఆర్ సర్కారే. అంతర్రాష్ట్ర నదీ జలాలు-వివాదాల చట్టంలోని సెక్షన్-3 కింద కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని, కృష్ణా జలాల పంపకాల్లో మార్పులు చేయాలని, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు నీటి కేటాయింపులను పున:నిర్వచించాలని 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నెల రోజుల్లోనే కేంద్రప్రభుత్వానికి కేసీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు.
అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ కోసం లేఖ రాస్తే.. ఆ లేఖ రాసిన ఏడాదిలోపే ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. అది కేంద్రప్రభుత్వం బాధ్యత. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాది గడిచినా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయకపోవడంతో అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుల సూచనలతో.. కేంద్రం నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరాం. ఆ సందర్భంలో కేసీఆర్ నియమించిన సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, రవీందర్రావులే ఇప్పుడు కూడా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నారు. నాడు తెలంగాణ ప్రభుత్వానికి ఎంత వాటా రావాలని కేసీఆర్ డిమాండ్ చేశారో.. ఆ లెక్కల ప్రకారమే ఇప్పుడూ వాదిస్తున్నారు.
కానీ, మీరు మాత్రం.. కేసీఆర్ ప్రభుత్వం గతంలో 299 టీఎంసీల నీటి వాటాకు ఒప్పుకొందని, అందువల్ల తెలంగాణ నష్టపోతోందని మీడియాతో చెప్పారు. ఇది పూర్తి అవగాహనారాహిత్యం మాత్రమే కాదు, స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి నుంచి ఇలాంటి సత్యదూరమైన వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం కూడా. నాడు కేసీఆర్ రాసిన లేఖ, ఆయన చేసిన విజ్ఞప్తులు, కృష్ణా రివర్ బోర్డు ముందు చేసిన వాదనలు, 2020 అక్టోబర్‌లో జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ సెక్షన్-3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటుకు పట్టుబట్టిన రికార్డులు ఇప్పటికీ ఉన్నాయి.
కేసీఆర్ ఒత్తిడి మేరకే నాటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సెక్షన్-3 కింద ట్రిబ్యునల్‌కు అదనపు టీవోఆర్‌ను నివేదిస్తామని హామీ ఇచ్చారు. ఆయన తన హామీని నిలబెట్టుకొని కృష్ణా ట్రిబ్యునల్‌కు సెక్షన్-3 కింద అదనపు టీవోఆర్‌ను నివేదించారు. ఇది కదా వాస్తవం. మీరు ఈ విషయంలో కేసీఆర్ కృషిని ఎంత కప్పిపుచ్చాలని చూసినా అది సాధ్యం కాదు. మీరు క్యాబినెట్ మంత్రి. మీరు, మీ అధికార యంత్రాంగం ద్వారా ఆ మినిట్స్‌ను తెప్పించుకొని చూడండి. నేను కూడా ఈ లేఖతో వాటిని జతపరుస్తున్నాను.
కృష్ణా జలాల పంపకాలపై వెంటనే ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని, చారిత్రకంగా తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లే వస్తున్నాయని, ఈ ఒక్క ఏడాదికి మాత్రమే దీనికి ఒప్పుకొంటున్నామని, పరీవాహక ప్రాంతం ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీళ్లు ఇవ్వాల్సిందేనని, నీళ్ల పంపకాలను మళ్లీ చేపట్టాల్సిందేనని కేసీఆర్ స్పష్టంగా డిమాండ్ చేశారు. ఈ నిజం తెలిసినప్పటికీ మీరు, సీఎం రేవంత్‌రెడ్డి రెండేండ్లుగా ఒక అబద్ధాన్ని వందసార్లు మాట్లాడితే నిజమైపోతుందన్న కుటిల బుద్ధితో కేసీఆర్ 299 టీఎంసీల నీటి వాటాకు ఒప్పుకొని తెలంగాణకు అన్యాయం చేశారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.
1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీకి కృష్ణాలో 811 టీఎంసీల వాటా ఉంది. అందులో తెలంగాణ ప్రాంతానికి ఎన్ని నీళ్లు వస్తున్నాయన్నదానిపై లెక్క లేదు. ఉమ్మడి ఏపీలో 299 టీఎంసీలే వస్తున్నాయంటూ సమైక్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తెలియజేసింది. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో కేసీఆర్ ‘ఒక్క 2015 ఏడాదికి మాత్రమే’ అని ప్రత్యేకంగా చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ లేఖ రాసే వరకు మీ పార్టీకి తెలంగాణ గురించి సోయే లేదు. అలాంటిది ఇప్పడు ఆ లేఖను పట్టుకొని అబద్ధాలు ప్రచారం చేయడం దారుణం. ఉమ్మడి ఏపీలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది మీ పార్టీనే, కేంద్రంలో అధికారంలో ఉన్నదీ మీ పార్టీయే. తెలంగాణపై అంత ప్రేమ ఉంటే మీ పార్టీ ప్రభుత్వాలు తెలంగాణ కోసం కృష్ణా నదిపై ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదు. కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకొన్నారంటున్న మీరు.. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దశాబ్దాల తరబడి అన్నే నీళ్లు వచ్చాయన్న వాస్తవాన్ని ఎలా విస్మరించారు. అప్పుడు మీరే కదా అధికారంలో ఉన్నది? మరి అప్పుడు ఏం చేశారు? తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది? 60-70 ఏండ్లు అధికారంలో ఉండి ప్రాజెక్టులు కట్టకుండా.. ఇప్పుడు కేసీఆర్ వల్లే నీళ్లు రాలేదని ప్రచారం చేయడం కన్నా విడ్డూరం ఇంకేమైనా ఉందా? ఇక నుంచైనా మహాకవి గురజాడ చెప్పిన్నట్టు.. ‘వట్టి మాటలు కట్టిపెట్టండి.. తెలంగాణకు గట్టి మేలు తలపెట్టండి’.
కృష్ణా జలాలపై కేసీఆర్ వేసిన పునాదులపైనే ఇప్పు డు వాదనలు జరుగుతున్నాయన్న నిజాన్ని మర్చిపోకం డి. ఇకనైనా అబద్ధాలు, వక్రీకరణలు మానండి. మీరు అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నది. ఇకనైనా బురదజల్లే రాజకీయాలు మాని రాష్ర్టానికి, రాష్ట్ర రైతాంగానికి మేలు చేసే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. మేడిగడ్డకు కూడా వెంటనే మరమ్మతులు చేయండి. పాలమూరు- రంగారెడ్డి, డిండి, సీతమ్మసాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయండి. మంత్రిగా ఉన్నత స్థానంలో ఉన్న మీలాంటి వాళ్లు ఇలా పదేపదే అబద్ధాలు మాట్లాడటం భావ్యం కాదని గుర్తుచేయడానికే నేను మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.
(పార్లమెంట్ మాజీ సభ్యులు)
– బోయినపల్లి వినోద్ కుమార్