బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో మూడు రోజులు పర్యటించిన తర్వాత ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, గతంలో వేర్వేరు పదవుల్లో ఉండిన వాడూ అయిన ఒకరిని ఈ విషయమై అడిగినప్పుడు, ఆయన చేసిన వ్యాఖ్య ఈ విధంగా ఉన్నది. తామర పువ్వు ఎడారిల పూస్తదా?. ఆయన ఇంకా ఓ మాట కూడా అన్నాడు. మావోళ్లు ఏవో కలలు కంటుంటరు. అన్నీ పగటి కలలు. అందుకు తగ్గట్టు ఇక్కడ జరిగేది లేదు పెట్టేది లేదు, అని వ్యాఖ్యానించాడు.
గతంలో జరిగిందేమిటి, జరగనిది ఏమిటి, రాగల రోజుల్లో ఏమి జరగవచ్చు, ఏమి జరగకపోవచ్చుననే మాటలు కూడా కొంత సేపు సాగాయి. అవన్నీ ఇక్కడ పేర్కొనటంలేదు. ఆయన చెప్పిన వాటి సారాంశం మాత్రం, ఒకప్పటి జనసంఘ్ కాలంలో గాని, తర్వాత వాజపేయి పాలించినప్పుడు గాని, ఇప్పుడు పన్నెండేండ్లుగా మోదీ హయాంలో గాని, ఈ ప్రాంతంలో తమ పార్టీ ఒక స్థాయికి మించి ఎప్పుడూ పైకి పోలేదు. ప్రస్తుత పరిస్థితులను చూసినా, పార్టీ పనితీరును చూసినా, భవిష్యత్తు మీద ఆశలేమీ కలగటంలేదు. రాగల కాలంలో అద్భుతాలేమన్నా జరిగితే తప్ప.
చర్చలోకి వెళ్లేముందు పార్టీ అధ్యక్షుని పర్యటన వివరాలను చూద్దాము. ఆయన జూన్ 28 నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో ఉన్నారు. లోగడ ఎవరు వచ్చినా ఒకటి రెండు రోజులకు మించి గడపలేదని వార్తలు చెప్పాయి. బిహార్‌కు చెందిన తనకు తెలంగాణతో ప్రత్యక్ష పరిచయం లేనందున, జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన దరిమిలా అటువంటి పరిచయం కోసం ప్రయత్నించటం మంచిదే. ఆయన మూడు రోజులలో పలు కార్యక్రమాలలో పాల్గొని, నాయకుల నుంచి కార్యకర్తల వరకు, బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ బాధ్యుల వరకు అందరినీ కలిశారు. పరిస్థితులు తెలుసుకొని, ఇవ్వవలసిన ఆదేశాలు ఇచ్చి, చేయవలసిన హెచ్చరికలు కూడా చేశారు. పార్టీ తక్షణ లక్ష్యం హైదరాబాద్ మహానగరంలోని మూడు కార్పొరేషన్లలో గెలువటం, తదుపరి లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలు గెలిచి రాష్ట్రం లో అధికారానికి రావటమని దిశానిర్దేశం చేశా రు. ఢిల్లీ నుంచి ప్రధాన మంత్రి, హోంమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు వచ్చివెళ్లినా, పార్టీలో కొత్త జోష్ వచ్చింది అని ప్రకటించటం ప్రతిసారీ ఆనవాయితీగా జరిగేదే గనుక ఈ సారి కూడా అవే మాటలు వినిపించాయి. అంతవరకు అంతా బాగున్నది.
ఇప్పుడు బీజేపీ అధ్యక్షుని పర్యటన జరిగిన సమయంలో గల మూడు విధాలైన పరిస్థితులను ఒకసారి చూడాలి. మొదటిది, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పశ్చిమ బెంగాల్లో సాధించిన ఘన విజయం. రెండు, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో, జాతీయ స్థాయిలో కూడా పరీక్ష పత్రాలు వరుసగా లీకవుతుండటం, అతి ప్రతిష్ఠాత్మకమైన అయోధ్య రామమందిరంలో, మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో భారీ అవినీతి, కుంభకోణాలు బయటపడటం. మూడు సర్ పేరిట జరుగుతున్న ఓటర్ జాబితా సవరణలపై అనుమానాల గందరగోళం ఇంకా కొనసాగటం. ఇవి చాలవన్నట్టు అకస్మాత్తుగా,భారతీయుల పౌరసత్వానికి ఏది గుర్తింపన్న ప్రశ్న తలెత్తి కోట్లాది మంది, ఇంకా చెప్పాలంటే మొత్తం దేశ ప్రజలందరి గుర్తింపును ప్రశ్నార్థకంగా మార్చటం.
ఇవి జాతీయ స్థాయి విషయాలే అయినా తెలంగాణ ప్రజలు ఆసక్తితో గమనించినవి, లేదా ఆందోళనకు గురైనటువంటివి. పరీక్ష పత్రాల లీకేజీ వల్ల నష్టపోయిన యువతీ యువకులు తెలంగాణలోనూ భారీ సంఖ్యలో ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమం జూన్‌లో హైదరాబాద్‌లో జరిగినప్పుడు వారు చాలామంది పాల్గొన్నారు. వారి సోషల్ మీడియా పోస్టింగులు హోరెత్తాయి.
ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పట్టుదలగా సాగుతున్న నిరసనను, ఈ అంశం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ యువత కూడా గమనిస్తున్నది. నీట్ పేపర్ లీకేజీ చాలదన్నట్టు, ఒకవైపు కాక్రోచ్ నిరసనలు జరుగుతుండగానే, ఆ నిరసనలు జరిగిన మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో మరిన్ని పేపర్లు లీకయి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఆ రెండు చోట్ల పాలిస్తున్నది డబుల్ ఇంజిన్ సర్కార్లే.
బెంగాల్ ఘన విజయం గురించి నితిన్ నబీన్ ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పార్టీ శ్రేణులను ఉత్సాహపరచటం ఆయన ఉద్దేశం. కానీ, సర్ మూలంగా ఆ గెలుపు తక్కిన దేశంలో వలె తెలంగాణ ప్రజల దృష్టిలోనూ అనుమానాస్పదంగా మారిన విషయం హైదరాబాద్ పర్యటనలో తన దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. నేపథ్య పరిస్థితి ఇట్లుండగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఆ పర్యటన మరుసటి రోజున మాట్లాడుతూ, తాము బెంగాల్ కన్నా పక్కా ప్రణాళికతో వస్తున్నామనటం గమనించదగ్గది. సరిగా అవే రోజులలో తెలంగాణలో మొదలైన సర్ కార్యక్రమం ఎంత అస్తవ్యస్తంగా సాగుతున్నదో ఇదీ అది అని గాక అన్ని పత్రికలు ప్రతిరోజూ రాస్తున్నాయి. ఇతర రాష్ర్టాల అనుభవాలు, అంతకన్నా పక్కా ప్రణాళిక అనే ప్రకటనలు, మరొకవైపు క్షేత్రస్థాయిలో తెలంగాణ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్న గందరగోళాన్ని బట్టి కలిగే అభిప్రాయం ఏమిటి? మోదీ ప్రభుత్వం గురించి, బీజేపీ గురించి, ఎన్నికల సంఘం గురించి? అనగా, 2028 ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలో తమ ఓటు హక్కుపై, ఆ జాబితా ప్రాతిపదికగా జరగగల ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ప్రజలకు రెండేండ్ల ముందు నుంచే అనుమానాలు ఏర్పడాలన్నమాట. బెంగాల్ ఉదంతం నిరంతరం భయపెడుతుండాలన్నమాట.
నితిన్ నబీన్ పర్యటనకు కొన్ని రోజుల ముం దు బయటపడిన అవినీతి కుంభకోణాలు మొత్తం దేశంతోపాటు తెలంగాణను ఆశ్చర్యపరచాయి. ప్రశ్నపత్రాల లీక్ వలె రామమందిరం ట్రస్ట్ అవినీతి, మధ్యప్రదేశ్ భూకుంభకోణం రెండూ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ల గొడుగు నీడలో జరిగినవే. మధ్యప్రదేశ్‌లోనైతే సాక్షాత్తు ముఖ్యమంత్రి మోహన్యాదవ్పై బలమైన ఆధారాలు బయటకు వచ్చాయి. అయినా తను స్వయంగా పదవి నుంచి వైదొలగకపోవటమే గాక, జాతీయ నాయకత్వం కూడా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. నరేంద్రమోదీ 2014 ఎన్నికల ప్రచారంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వపు అవినీతి కుంభకోణాలపై తీవ్రస్థాయి విమర్శలు చేశారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా అవినీతిని పూర్తిగా అదుపు చేశానని, ప్రధానిగా అవకాశమిస్తే దేశమంతటా అదే పని చేస్తానని పదేపదే నమ్మబలికారు. ప్రజలు ఆ మాట గట్టిగానే నమ్మారు. కానీ అవినీతికి సంబంధించి ప్రపంచంలో ఇండియా ర్యాంక్ 2014లో 175 దేశాల్లో 85 కాగా, 2025లో 182 దేశాల్లో 91కి పడిపోయింది.
ఇతరత్రా అవినీతిని ఏమి అరికట్టారో గాని అది తగ్గినట్టు ప్రజలకైతే ఏమీ అనిపించటంలేదు. పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలకు, వ్యాపార దిగ్గజాలకు తెలివైన రీతిలో దోపిడీ అవకాశాలు కల్పిస్తున్నట్టు పలువురు నిపుణులు ఎత్తి చూపుతున్నారు. అవినీతిపరులపై నిఘా ఏజెన్సీల దాడులు, కేసులు, వారు బీజేపీలో చేరగానే ఆ ఫైళ్లు మాయం కావటం బీజేపీ వాషింగ్ మెషీన్ పేరిట ప్రసిద్ధికెక్కటం తెలిసిందే.
తమ తిరుగులేని అధికారం గురించి బీజేపీ నేతలు సగర్వంగా చాటుకుంటుంటారు. కానీ అధికారంతోపాటు అవినీతి విస్తరిస్తున్నది. ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకొనే కావచ్చు బ్రిటిష్ ఎంపీ లార్డ్ ఆక్టన్ 1887లోనే, అధికారంతో అవినీతి అబ్బుతుంది, సంపూర్ణ అధికారంతో అవినీతి సంపూర్ణమవుతుంది అన్నాడు. ఇటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్‌ను తెలంగాణలో ఆవిష్కరిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నారు. నిజానికి తెలంగాణ బీజేపీ నేతలపై వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు, ఇక్కడ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వారి మిత్రపక్షంగా, అవినీతి ఆరోపణలు బాగానే వినిపించేవి. ఆ పార్టీకి ఇక్కడ విలువ లేకపోవటానికి అది కూడా ఒక కారణం.
నితిన్ నబీన్ ఇక్కడ బహిరంగ కార్యక్రమంలో ఏమి మాట్లాడినా, పార్టీ బాధ్యుల నిష్క్రియాపరత, క్షేత్రస్థాయికి వెళ్లకుండా ప్రజలను కలువకుండా ప్రెస్మీట్లకు పరిమితం కావటం గురించి అంతర్గత సమావేశాల్లో ఆక్షేపించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇవి నిజమని భావించేందుకు తగు కారణాలున్నాయి. 2025 ఎన్నికల ముందుకాలంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తరచు హైదరాబాద్ వస్తూ, లేదా ఇక్కడి నాయకులను ఢిల్లీకి పిలిపించుకొంటూ పార్టీ కార్యకలాపాల గురించి చర్చించేవారు. ఆయనతో సమావేశం అంటేనే తెలంగాణ నాయకులు భయపడుతుండేవారు. అందుకు కారణం ఎల్లప్పుడూ ఒకటే. ఈ నాయకులు అప్పుడు కూడా పని చేసేవారు కాదు. హైదరాబాద్‌లో కూర్చొని కాలక్షేపాలు సాగుతుండేవి. గ్రూపు రాజకీయాలు అందుకు అదనం. అధికారం ఇప్పుడు మరింత పెరుగుతున్నందున లార్డ్ ఆక్టన్ సూత్రీకరణను మరింత నిజం చేస్తున్నారనే మాట వినవస్తుంటుంది.
ఒక నిర్మాణం శిథిలావస్థ కన్నాముందు దశకు చేరినాకొద్దీ బలహీనతలు ఒకదాని వెంట ఒకటి బయటపడుతుంటాయి. విచిత్రమైన రీతిలో సరిగా ఎప్పుడైతే చొరబాటుదారులనే వారిని సరిహద్దుల మీదుగా అవతలికి తోసివేసే కార్యక్రమం మొదలైందో, అందుకు పలువురు చప్పట్లు చరిచి అభినందిస్తున్నారో, సరిగ్గా అదే సమయంలో అసలు భారతీయ పౌరసత్వానికి గుర్తింపు ఏది అనే ప్రశ్న పిడుగుపాటు వలె వచ్చి పడింది. ఓటర్ కార్డు కాదు, ఆధార్ కాదు, పాస్‌పోర్ట్ కాదు, బర్త్ సర్టిఫికెట్ కాదు, ఇంటి నంబర్ కాదు. వీటిలో కొన్ని, లేదా అన్నీ చొరబాటుదారులు కూడా సంపాదించగలరు. మరి ఏది పౌరసత్వం? ఓ మహాత్మా, ఓ మహర్షీ!
ఈ దేశం స్వతంత్రమైన నిండు 79 ఏండ్ల తర్వాత ఇదీ పరిస్థితి. ఇది మొదటిసారి ప్రశ్నగా మారింది మోదీ ప్రభుత్వంలో. నితిన్ నబీన్ మహాశయుడు తెలంగాణ ఎడారిలో తామర పువ్వును పూయించగలమని చేస్తున్న భీకరమైన ప్రతిజ్ఞ, మొదట ప్రస్తావించిన సీనియర్ నాయకునికి కేవలం ఒక పగటి కలగా తోచటం ఎందువల్లనో బహుశా ఇంకా వివరించనక్కరలేదు. వారు తమకు మొదటి నుంచి కొరుకుడుపడని దక్షిణాదికి తెలంగాణను ముఖద్వారం చేసుకుంటామని 2014లో ప్రకటించి 12 ఏండ్లు గడిచాయి. ఈ సారి కొత్త ఆశగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను కలుపుకొని, రేవంత్‌రెడ్డిని రిజర్వ్‌లో ఉంచుకొని ఇప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా తమ నాయకుల ఆశలు కనిపించటంలేదు.
– టంకశాల అశోక్