సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని బీజేపీ, సంఘ్ పరివార్ డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొనని బీజేపీ నాయకులు తెలంగాణ విమోచనం దినం జరుపుకుందాం రండి…అంటూ విష ప్రచారం చేస్తున్నారు. నాటి పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య పోరాటంగా వక్రీకరిస్తున్నారు. తమ పార్టీతో ఏమాత్రం సంబంధం లేని కొమరం భీమ్, చిట్యాల ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి నాయకులకు పూజలు చేస్తున్నారు.
1946లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో హైదరాబాద్ సంస్థానంలో భూస్వామ్య వ్యతిరేక సాయుధ రైతాంగ పోరాటం ఆరంభమైంది. దేశ స్వాతంత్య్రానికి పూర్వమే తెలంగాణలో ఆంధ్ర మహా సభ ఉద్యమం భూస్వామ్య దొరల ఆగడాలకు వ్యతిరేకంగా ఉధృతంగా సాగింది. ఆ పోరాటంలో లక్షలాది మంది ప్రజలు చిత్రహింసలకు గురయ్యారు. రజాకార్లు, దొరల గూండాలు, నిజాం పోలీసుల చేతిలో 1500 మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, నాయకులు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమైన దశలో, అంటే 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యాలు హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించి కమ్యూనిస్టులపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో 2500 మంది కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, సాధారణ ప్రజలు చనిపోయారు. అజ్ఞాతంలో ఉన్న కమ్యూనిస్టు పోరాట యోధుల ఆచూకీ చెప్పాలని లక్షలాది మంది తెలంగాణ ప్రజలను భారత సైన్యం తీవ్ర చిత్ర హింసలకు గురి చేసింది. దేశ సరిహద్దుల్లో శత్రువులతో యుద్ధం చేయాల్సిన భారత సైన్యం, భూస్వామ్య రాచరిక వ్యవస్థకు, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మట్టి మనుషుల మీద అనాగరిక యుద్ధానికి పాల్పడింది.
మరోవైపు నిజాం, దొరల ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్ని అరాచక శక్తులు దారుణంగా హత్య చేశాయి. తన భూమికి సంబంధించిన వివాదంలో షేక్ బందగి అనే ముస్లిం రైతు విసునూరు దేశముఖ్ రామచంద్రారెడ్డి గూండాలు, రజాకార్ల చేతుల్లో హత్యకు గురయ్యాడు. వేలాది మంది ముస్లింలు సైతం హైదరాబాద్ సంస్థానంలో అణచివేతకు గురయ్యారు. కమ్యూనిస్టు నాయకుడు, రచయిత, కవి మగ్దూం మొహియుద్దీన్ నిజాం పాలనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఎందరో ముస్లింలు నాటి నిజాం రాజ్య హింసకు గురయ్యారు. ఇలాంటి పోరాట పరిస్థితులలో నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ విధి లేని పరిస్థితుల్లో హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేశారు.
వాస్తవాలు ఇలా ఉంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో చేరడం సాధ్యమైందని ఆర్ఎస్ఎస్, బీజేపీ చౌకబారు సూత్రీకరణకు పాల్పడుతున్నాయి. మత రాజకీయాల పేరుతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని చరిత్రను వక్రీకరిస్తూ, తెలంగాణ సాయుధ పోరాటాన్ని మత కోణంలో చిత్రిస్తున్నారు. ఇలా చరిత్రను వక్రీకరిస్తూ తమ రాజకీయ భావజాలంతో సంబంధం లేని వ్యక్తుల చిత్ర పటాలకు దండలు వేస్తూ దేశంలోని వివిధ ప్రజా పోరాటాలను తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ కుటిల రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాలి.
భిన్న మతాలు, తెగల సంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలో ప్రతి అంశాన్ని మతం చిచ్చులోకి లాగడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ పాలకులు దేశంలో అలజడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏ ఉద్యమాల్లోనూ వారి భాగస్వామ్యం లేకపోయినా చరిత్ర వక్రీకరణకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో కలిసి 75 ఏండ్లు అవుతున్నా, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా ప్రజల జీవన ప్రమాణాల్లో గొప్ప మార్పేమీ లేదు. ఈ నేపథ్యంలో కుల, మత విద్వేష కుటిల రాజకీయాలను తిప్పి కొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మెరుగైన జీవనం కోసం, ఆర్థిక అసమానతలు అంతం చేయడానికి ఇపుడు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సి ఉంది. అందుకు అన్ని వర్గాల ప్రజలు సన్నద్ధం కావాలి.
సంఘ్ పరివార్ ముస్లిం వ్యతిరేక ప్రచారం చేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను దేవ దేవుడిగా చిత్రిస్తుంది. కానీ, నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ను సర్దార్ పటేలే 1956 అక్టోబర్ 31 వరకు రాజ్ ప్రముఖ్(గవర్నర్ లాగా)గా కొనసాగించారు. పైగా ఆయనకు నష్ట పరిహారాలు, రాజాభరణాలు ఇచ్చే ఒప్పందం కుదుర్చుకున్నారు. రాజ్ ప్రముఖ్ పదవిలో ఉన్నందుకు, ఆ రోజుల్లోనే సంవత్సరానికి రూ.50 లక్షలు చెల్లించారు.
గాంధీని హత్య చేసిన గాడ్సేని సంఘ్ పరివార్ శ్రేణులు పూజిస్తాయి. మరోవైపు బీజేపీ నాయకులు గాంధీ చిత్ర పటానికి వంగి వంగి దండాలు పెడతారు. బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ మేళాలు నిర్వహించడం, కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జయంతులు నిర్వహించడం ద్వారా వాళ్ల పోరాటాలకు తమ పార్టీ ముద్ర వేసుకోవాలని ఆరాట పడుతున్నారు.
– జూలకంటి రంగా రెడ్డి
(వ్యాసకర్త: సీపీఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు)