ప్రజల మనోభావాలను, భావోద్వేగాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం బీజేపీకి పరిపాటిగా మారింది. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ సైతం అందుకు మినహాయింపు కాద ని అంటుండటం ఏమంత దిగ్భ్రాంతిని కలిగించడం లేదు. పుల్వామా, యురి ఉగ్రదాడులకు ప్రతీకారంగా చేపట్టిన సైనిక చర్యలను ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ వాడుకోవడం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం పాక్ ఉగ్రవాద శిబిరాలపై చేపట్టిన వీరోచిత సైనిక చర్య దేశంలో గొప్ప ఉత్తేజాన్ని కలిగించిన మాట వాస్తవమే. దీనిని ఎవరూ కాదనరు.
కానీ, ఆ ఉత్తేజాన్నీ మతంతో కలగాపులగం చేసి ఎన్నికల్లో లబ్ధి కోసం వాడుకోజూడటం తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తున్నది. బీజేపీని అంతోఇంతో సమర్థించేవారికి సైతం ఇది మింగుడుపడటం లేదు. ‘సిందూర్’ పట్ల ప్రజల ఆకాంక్షలు, అంచనాలకు భిన్నంగా, సైనిక చర్య జోరుగా సాగుతుండగానే మోదీ ప్రభుత్వం హఠాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించడం దేశాన్ని విస్మ యానికి గురిచేసింది.
ఇందులో అమెరికా పాత్ర ఉందా లేదా అనే వివాదాన్ని పక్కన పెడదాం. ఉన్నపళంగా సైనిక చర్య నిలిపివేయడంతో ముందుగా ప్రజల్లో వచ్చిన సానుకూలత కాస్త క్రమంగా వ్యతిరేకతగా మారడం మొదలైంది. సిందూర్ లాభనష్టాలపైనా చర్చ మొదలైంది. ఈ పరిస్థితుల్లోనూ రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది.
తన రక్తంలో ‘సిందూర్’ ప్రవహిస్తున్నదని ప్రధాని మోదీ సెంటిమెంటును రెచ్చగొట్టడమే కాకుండా, హనుమంతుడు, మహిళా శక్తి వంటి ప్రతీకల్ని సిందూర్‌కు జోడించే ప్రయత్నమూ చేశారు. ఇదే అదనుగా బీజేపీ ‘హర్ ఘర్ సిందూర్’ అంటూ ఓట్ల వేట మొదలుపెట్టడం విడ్డూరం. ప్రజలు ఇప్పుడిప్పుడే బీజేపీ అసలు రంగును పసిగడుతున్నారు. బీజేపీ నేతలు సిందూర్ పంచేందుకు వెళ్తే మహిళలు తిరగబడుతుండటం గమనార్హం.
ఉత్తరాదిలో సిందూర్ ఆచారం అధికం. అక్కడే హర్ ఘర్ సిందూర్ పేరిట బీజేపీ తలపెట్టిన కార్యక్రమం బెడిసికొట్టింది. ప్రజల సమస్యల గురించి పట్టించుకోకుండా మతపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టడం ఎల్లకాలం చెల్లుబాటు కాదని తేలిపోయింది. ‘సిందూర్’ సెంటిమెంటును రాబోయే బీహార్, బెంగాల్ ఎన్నికల్లో ఓట్లుగా మార్చుకునేందుకు జరిపిన చవకబారు ప్రయత్నంగా ఇది అపఖ్యాతి పాలైంది. ఖంగుతిన్న బీజేపీ ప్లేటు ఫిరాయించింది. అసలు హర్ ఘర్ సిందూర్ కార్యక్రమాన్ని తాము మొదలుపెట్టనే లేదని బుకాయింపులకు సిద్ధమైంది. ఫేక్‌న్యూస్‌కు పెట్టింది పేరైన ‘మోదీ అండ్ కో’ చివరకు ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేయడం వింతల్లోకెల్లా వింత.
దేశ రక్షణలో కీలకపాత్ర పోషిస్తూ భావజాలాలు, సిద్ధాంతాలకు అతీతంగా, భారత ప్రయోజనాలే పరమోన్నత కర్తవ్యంగా సాగే సైన్యంతోనూ బీజేపీ రాజకీయం చేయడం మరో సమస్య. మన దేశం పాకిస్థాన్ కాదు. ఇక్కడ రాజకీయాలకు, సైన్యానికీ మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంటుంది. పైగా మన సైన్యం వృత్తిపరమైన నైపుణ్యానికి, పౌరపాలన పట్ల నిబద్ధతకు పెట్టింది పేరు. ఎంతటి సంక్షుభిత సమయంలోనైనా ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన దూరాన్ని పాటించడం మన సైన్యం ప్రత్యేకత.
మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సైన్యాన్ని రాజకీయాలకు వాడుకోవడంలో అన్ని పరిమితులూ దాటింది. సైనిక విజయాలను ప్రధాని మోదీ వ్యక్తిగత విజయాలుగా చూపడం జరుగుతున్నది. త్రివిధ దళాధిపతులను క్రికెట్ మ్యాచ్‌లకు పిలవడం, కర్నల్ ఖురేషీ కుటుంబ సభ్యులను మోదీ రోడ్‌షోలో కలవడం వంటివి ఈ ధోరణికి పరాకాష్ఠగా చెప్పవచ్చు. ప్రజా వ్యతిరేకతను గుర్తించి అయినా బీజేపీ తన ధోరణి మార్చుకుంటుందా!