కేంద్రంలో పాలనతోపాటు పార్టీని వదలని నేతలు, కార్యకర్తలు ఉన్న పార్టీగా పేరున్న బీజేపీలో పెద్దగా రాజకీయ సంక్షోభాలు కనబడవు. ఢిల్లీ గద్దెనే కాకుండా ఉత్తరభారతంలో అత్యధిక రాష్ర్టాల్లో తమ పాలనను నిలుపుకొంటున్న బీజేపీ.. దక్షిణాదిలో పాగా వేయాలని సుదీర్ఘ కాలంగా కలలు కంటున్నది. గతేడాది ఆంధ్రప్రదేశ్ పాలక కూటమిలో భాగమైనందుకు తెలుగు రాష్ర్టాల బీజేపీ అనుయాయులు మురిసిపోతున్నారు. అదే ఊపులో తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ను ఏర్పాటు చేయాలని వారు ఉబలాటపడుతున్నారు.
నిజానికి రాజకీయ సమీకరణాలు కుదరక, కాంగ్రెస్ తప్పిదాల వల్ల తెలంగాణలో బీజేపీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో చెప్పుకోదగ్గ స్థానాలు సాధించగలిగింది తప్ప, ఇప్పటికీ ఈ నేలకు చెందిన ఓటర్ల మనస్సుల్లో ‘ఇది మా పార్టీ’ అన్న ముద్రను వేయలేకపోయింది. పార్టీలో ఉన్న నేతలతో పాటు తమ రాజకీయ అవసరాల కోసం చేరిన కొందరు రాజకీయ జీవులు తప్ప కొత్తగా ఆ పార్టీకి బలం చేకూరేలా జరిగిన పరిణామాలేవీ లేవు. ఎన్నికల సమయంలో గాలివాటం లాభం తప్ప జనం ఆ పార్టీ వెంట ఉన్నారని చెప్పడానికి రుజువులేమీ కానరావు. ఆ పార్టీ నాయకుల వెంబడి ఎప్పుడూ ఉండే కాషాయ తలపాగాల పాత ముఖాలే తప్ప కొత్తవేవి కానరావు.
అయితే కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి, తెలంగాణను కూడా బుట్టలో వేసుకొనే విద్య ఏదో వారి దగ్గర ఉంటుందనే ఆశ ఆ పార్టీ నాయకుల్లో ఉంది. తెలంగాణలో ఎటూగాని నేతలకు ఆశ్రయంగా పనికి రావడంతో ఆ పార్టీ నాయకుల సంఖ్య కూడా పెరిగింది. అయితే, ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక సమయంలో ఆ పార్టీ కొంత కుదుపులు ఎదుర్కోవలసి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా కొందరు నేతలు తమ అసంతృప్తిని బహిరంగ చర్చకు తెచ్చారు. ఆ పదవిని ఆశించినవారిలో ఈటెల పేరు కూడా వినవచ్చింది. తనకు పదవిని కట్టబెట్టనందుకు ఆయన అలకబూనినట్టుగా వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే నిస్పృహలో జారుకున్నట్టుగా తెలుస్తున్నది. పార్టీ లైన్ను దాటి బహిరంగంగా ఎవరూ నోరు జారవద్దన్న అధిష్ఠానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఓ సీనియర్ నేతపై పరోక్షంగా మాటల దాడికి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఆ పార్టీలో నేతల మధ్య సఖ్యత కొరవడిందని చెప్పేందుకు నిదర్శనం. నిజానికి ఈటెలను బీజేపీ రాజకీయంగా ఎంతగానో కాపాడింది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా మేడ్చల్ పార్లమెంట్ సీటిచ్చి గెలిపించుకుంది. బీఆర్ఎస్ను వదిలిపెట్టిన తర్వాత ఆయన ఓ రాజకీయ శూన్యంలోకి కూరుకుపోయారు. తన చుట్టూ భూకబ్జాల కేసులు చుట్టుముట్టాయి. ఆ సమయం లో బీజేపీ శరణుజొచ్చి బతికి బయటపడ్డారనవచ్చు. ఆయన కూడా బీజేపీని తప్పుబట్టడమంటే అది అత్యాశే.
అధ్యక్ష పదవి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చినవారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన కరుడుగట్టిన హిందూత్వవాది. ఓల్డ్ సిటీలో బీజేపీకి ఆయన బలమైన నాయకుడు. 2014 నుంచి వరుసగా మూడుసార్లు కమలం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. అయితే వ్యక్తిగా ఆయన వివాదాస్పదుడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరైనా నామినేషన్ వేయవచ్చని ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ నామినేషన్ వేయడానికి సిద్ధపడ్డారు. అయితే, నామినేషన్ పత్రంపై సంతకాలు చేసేందుకు మద్దతుదారులు దొరకకుండా చేసి తనను పోటీలో లేకుండా చేశారని పార్టీపై ఆయన అభియోగం. ఒకే నామినేషన్ రావడం వల్ల రామచందర్రావు ఎంపిక ఏకగ్రీవమైంది.
ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిన కుట్ర అని రాజాసింగ్ అం టున్నారు. అంతటితో ఆగకుండా ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని గవర్నర్కు సిఫారసు చేయాలని పార్టీకి లేఖ కూడా రాశారు. పార్టీకి, హిందూత్వానికి రాజాసింగ్ గట్టి నిబద్ధుడే కానీ, తన దుందుడుకుతనం వల్ల పార్టీకి ఏ కష్టాలు తెచ్చి పెడతారోనని బీజేపీ భయం కావచ్చు. ఆయనలో రాజకీయ పరిపుష్టి కన్నా మతఛాందసమే ఎక్కువ. పాత్రికేయుల ముందు ఎంతో సంయమనం తో మాట్లాడవలసి ఉంటుంది. తమ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడమో లేక ఇప్పటికే ఒక రాజ్యాంగ పదవి ఉందనో పార్టీ ఆయనని పక్కనపెట్టి ఉండవచ్చు. ఆయ న ఇతర పార్టీల కన్నా బీజేపీకే సరిగ్గా సరిపోతారు. ఆ యన రాజీనామా వల్ల అటు తనకు ఇటు బీజేపీకి నష్ట మే. ఏదో సామరస్యమార్గంలో ఇది ముగిసిపోవచ్చు.
బీజేపీని చిక్కుల్లో పెడుతున్నవారిలో ఇప్పుడు సొంత పార్టీకే చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చేరిపోయారు. ఏడవ తేదీన వికారాబాద్లో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో పార్టీ కార్యకర్తలపై ఆయన విరుచుకుపడ్డారు. కేవలం హిందూత్వం కోసం పని చేయాలనుకుంటే పార్టీని వదిలి ఆరెస్సెస్, భజరంగ్దళ్లో చేరాలని కార్యకర్తలకు సూచించారు.
‘పార్టీ ఉన్నది ఎన్నికల్లో గెలిచేందుకే. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అనేవారు విశ్వహిందూ పరిషత్లో చేరి సమాజసేవ చేయండి. బీజేపీలో ఉండాలనుకుంటే గ్రామాల్లో తిరిగి పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు అందించండి. కేవలం హిందూత్వ భావన ఉంటే పదవులు దక్కవు’ అని గట్టిగా మందలించారు. మరో చోట కార్యకర్తల కోరికను నిరాకరించడంతో ‘మీకు కార్యకర్తలు అవసరం లేదా!’ అని వారు ఆయన్ని నిలదీశారు. ‘అవసరం లేదు. నాకు పార్టీయే ముఖ్యం’ అని ఆయన సమాధానమిస్తూ వెళ్లిపోయారు.
అయితే పార్టీ మూల సూత్రాలను ప్రశ్నించిన కొండా మాటలపై బీజేపీ పాతకాపులెవరూ ఇంతవరకు నోరువిప్పలేదు. రాజాసింగ్ బెడదతో తికమక పడుతున్న పార్టీ ఇప్పుడే ఈ వ్యవహారంలో తలదూర్చ దలుచుకోలేదేమో. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల నేతల చేరిక వల్లనే బీజేపీ బలపడి పాలనాపరంగా విస్తరించింది. మడి కట్టుకొని ఉంటే ఈ విజయాలు సాధ్యపడేవి కాదు. ఇదే సూత్రం ఇక్కడ కూడా పాటించాలనుకుంటే ఆ పార్టీ తెలంగాణ నేతల పట్ల కూడా ఉదాసీనంగా ఉండక తప్పదు.
– బద్రి నర్సన్ 94401 28169