మనుషులను ప్రేమించడం మానవత్వం. మట్టిని ప్రేమించడం మహోన్నత తత్వం. తెలంగాణ జీవితాలను లోతుగా అధ్యయనం చేస్తే.. మట్టిని ప్రేమిస్తూ, మనుషుల కోసం పరితపిస్తూ, నవీన సమాజ నిర్మాణం కోసం, మానవీయ విలువల ఆవిష్కరణల కోసం, ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగధనుల వారసత్వాన్ని అందిపుచ్చుకొని ముందుకుసాగే వీరులు ప్రతి తరంలోనూ మనకు కనిపిస్తారు.
జీవన సంఘర్షణల్లోంచి మొలకెత్తి, మొగ్గ తొడిగిన వేలాది భావాలకు కార్యాచరణను ఇచ్చి, ఆయా కాలాల్లో సాగించిన పోరాటాల స్ఫూర్తి, అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా సాగించే ఉద్యమాలకు చోదకశక్తిగా పనిచేస్తున్నది. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు సాగిన పోరు బిడ్డల త్యాగాలకు గల కారణం ఒక్కటే! నేలతల్లి విముక్తి కోసం కనే కల సాకారం కావాలని, పర పీడన లేని స్వయం పాలన సాధించాలని, ఆత్మగౌరవ పెనుగులాటలో అంతిమ విజయం సాధించాలని.
ఆ త్మగౌరవ, అస్తిత్వ పెనుగులాటల్లోంచి ఉద్యమ ప్రభంజనమై ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మహోన్నత ఉద్యమ కెరటం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. 2001 నుంచి దశాబ్దకాలంగా కొనసాగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో నెలకొన్న స్తబ్దతను తొలగించి, క్రియాశీలరూపంగా మార్చడానికి తీసుకున్న త్యాగపూరిత, భావోద్వేగ నిర్ణయమే… ‘తెలంగాణ వచ్చుడో-కేసీఆర్ సచ్చుడో’. ‘తెలంగాణ జైత్రయాత్రనా, కేసీఆర్ శవయాత్రనా?’ ఏదో ఒక్కటి తేలిపోవాలనీ, చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం.
ఇదంతా ఒకెత్తయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వెంటనే జరిగిన ఎన్నికల్లో, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న సొంత రాష్ట్రంలో ఇంటి పార్టీగా భావించిన టీఆర్ఎస్ అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చిన కేసీఆరే నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలనీ తెలంగాణ సమాజమంతా కోరుకున్నది. అధికారాన్ని బాధ్యతగా, ప్రజలకు సేవ చేసే సాధనంగా భావించిన ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం వినియోగిస్తూ, ప్రజల నుంచి వచ్చిన డబ్బును (ఆదాయాన్ని) ప్రజల కోసం ఖర్చుచేస్తూ సంపద పెంచుతూ, ప్రజలకు పంచుతూ, ప్రజలే కేంద్రంగా ప్రజా సమస్యలే ఇతివృత్తంగా, అత్యంత పారదర్శకంగా పరిపాలన సాగించారు కేసీఆర్. పల్లెల నుంచి పట్టణాల వరకు, ఇరిగేషన్ నుంచి ఇంటర్నెట్ వరకు, సమగ్ర సమీకృత, సమతుల్య, సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తూ, దశాబ్ద కాలంలోనే శతాబ్ది అభివృద్ధిని సాధించిన ఘనత, నిబద్ధత కేసీఆర్‌ది.
ఇదంతా అభివృద్ధికి సంబంధించినది. అయితే, తెలంగాణకు ఇప్పటికింకా సంపూర్ణ స్వాతంత్య్రం సిద్ధించలేదు. ఎప్పుడూ ఎవరో ఒకరి ఆధీనంలో పరాధీనంగా ఉండిపోతున్నది. తెలంగాణకు, వలసవాదులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. వలసవాదుల అవశేషాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న రెండు జాతీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వాల రూపంలో సీమాంధ్రుల రహస్య ఆధిపత్య ఎజెండాల రచనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ సమాజమంతా ఇప్పుడొక నిర్ణయాత్మకమైన ఆలోచన చేయాలి. ఈ ఎన్నికలే రేపటి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, సుస్థిరతను, ప్రశాంతతను, భవిష్యత్తు అభివృద్ధిని నిర్ణయించబోయేటివి. వీటిని ఎప్పటిలా జరుగుతున్న సాధారణ ఎన్నికలుగా భావించవద్దు. తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న ఈ మూడోసారి ఎన్నికలు చరిత్రాత్మకమైనవి. దశాబ్దాల గాయాల గత అవశేషాలను మార్చబోయేవి. వేలాది యువకుల రక్త తర్పణంతో ఏర్పడ్డ తెలంగాణ సుస్థిర భవిష్యత్తును సాధించే ఎన్నికలు. ఎందుకంటే నిజాం పాలనకు, వారి తాబేదార్లయిన భూస్వాములు, జాగీర్దారులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసిన తర్వాత విముక్తిని పొందినా, సమైక్యం పేరుతో మన స్వాతంత్య్రాన్ని, స్వావలంబనను కోల్పోయిన పిదప, మళ్లీ మన సొంత రాష్ర్టాన్ని పొందడానికి 60 ఏండ్ల కాలం పట్టింది. ఎన్నో ఉద్యమాలు చేశాం. వేలాది యువకులను దూరం చేసుకున్నాం. అన్నింటికి మించి ఎంతో జీవన విధ్వంసాన్ని అనుభవించాం. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీల, రాష్ట్ర నాయకుల మాటలు, కేంద్ర నాయకుల మాటలు, ప్రకటనల రూపంలో తెలంగాణ వ్యతిరేకుల (వలసవాదుల) రహస్య ఆధిపత్య ఎజెండాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇదంతా కండ్లారా చూస్తూ కూడా వలసవాదుల ఏజెంట్లకే అధికారాన్ని కట్టబెట్టడమా? తెలంగాణలో విధ్వంసమే జరుగలేదంటున్న నేతలకు పునర్నిర్మాణం గురించి ఎలా తెలుస్తుంది? తెలంగాణలోని అణువణువూ ఏదో ఒకవిధంగా గాయపడి ఉన్నది. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన పార్టీలు అధికారం కోసం మతాన్ని అడ్డుపెట్టుకుంటున్న పార్టీలు, తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి మన యువకుల బలిదానాలకు బాధ్యులైన పార్టీలు వీటన్నింటి స్వరూప, స్వభావాలను మనం గమనించి ఉన్నాం. అయినా వీరికే అధికారం కట్టబెడుదామా? లేక తెలంగాణ కోసమే పురుడు పోసుకొని, తెలంగాణ సాధనే ఊపిరిగా చేసుకొని, 10 జిల్లాల ప్రజలను ప్రబల శక్తిగా మలచి, కాలపరీక్షకు నిలవాల్సి వచ్చినప్పుడల్లా పదవీ త్యాగాలకు సిద్ధపడి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, సాధించిన రాష్ట్రంతో, స్థిరమైన రాజకీయ నాయకత్వాన్ని, సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తూ, శాంతిభద్రతలను కాపాడుతూ, మత సామరస్యాన్ని పెంపొందిస్తూ, ప్రశాంత పరిపాలనను అందిస్తూ తెలంగాణ రక్షకుడిగా, సంరక్షకుడిగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మళ్లీ అధికార పీఠంపై కూర్చోబెడదామా? అన్నది ప్రజలు మెలకువతో ఆలోచించాల్సిన ఒక మౌలిక ప్రశ్న.
బీఆర్ఎస్కే ఓటు ఎందుకు వేయాలి? కేసీఆర్ నాయకత్వాన్నే ఎందుకు బలపర్చాలి? అందుకు సవాలక్ష సహేతుకమైన కారణాలున్నాయి? అమెరికా అణుబాంబు దాడిలో సర్వనాశనమైన జర్మన్, జపాన్ దేశాలు, అనతికాలంలోనే ప్రపంచం నివ్వెరపోయే ఆర్థికాభివృద్ధిని సాధించిన ఘనత అంకితభావంతో పనిచేసిన అక్కడి నాయకత్వానికి దక్కుతుంది. తెలంగాణ సత్వరాభివృద్ధికి కూడా అలాంటి నాయకులు కావాలి. తల తెగిపడినా తెలంగాణ తప్ప మరో పదం ఉచ్చరించని కేసీఆర్‌కు మాత్రమే అది సాధ్యం.
ఇప్పుడు తెలంగాణ ‘ఇచ్చింది మేమే’ అని, ‘తెచ్చింది మేమే’నని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి ఇచ్చింది వాళ్లయితే పోగొట్టింది ఎవరో ప్రజలు ఆలోచించాలి. 60 ఏండ్లు అరిగోస పెట్టుకున్నదెవరు? వేలాది యువకుల ఆత్మబలిదానాలకు కారకులెవరు? ఏ పరిస్థితుల్లో ఇచ్చింది? ఏ సమయంలో ఇచ్చింది? ఇచ్చిందా?, ఇవ్వవలసి వచ్చిందా? అంటే ఇవ్వవలసి వచ్చిందనే సమాధానం తెలంగాణ సమాజం అంతా చెప్తుంది. ఆ అనివార్యతను సృష్టించింది కేసీఆర్, తెలంగాణ ఉద్యమం.
ఎన్నికల సమయంలో తెరమీదికి వచ్చి, ఎన్నెన్నో కబుర్లు చెప్పే నాయకులకు, తెలంగాణ ఆత్మను స్పృశించే అవగాహన కానీ, అర్హత కానీ ఎక్కడ ఉంది? పద్నాలుగేండ్లు ఉద్యమంలో కలియదిరుగుతూ, గుండె గుండెలో గూడుకట్టుకున్న విషాదాన్ని కండ్లారా చూసినవాడు కేసీఆర్. భౌగోళికంగా ఉన్న సమస్యలతో పాటు, సామాజిక సమస్యలను సంపూర్ణంగా అవగాహన చేసుకున్నవాడు. భాషా సంస్కృతుల, చారిత్రక విశిష్టతలను ఔపోసన పట్టినవాడు. తెలంగాణ గడ్డనేలిన శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల పరిపాలనలో తెలంగాణలో జరిగిన వికాసాన్ని, విధ్వంసాన్ని భవిష్యత్తు రూపకల్పన నేపథ్యంలో అధ్యయనం చేసినవాడు కేసీఆర్. జన్మనిచ్చిన బిడ్డ సంరక్షణ కోసం, ఎదుగుదల కోసం ఒక తల్లి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, ఎన్ని త్యాగాలకు ఓర్చుకుంటుందో, అలాగ తన చేతుల్లో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర వికాసానికైనా, వినిర్మాణానికైనా, తన జీవితాన్ని అంకితం చేసే అవకాశం ఇప్పుడు ఒక్క కేసీఆర్‌కే ఉంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని, మన కలల తెలంగాణ నిర్మించాలంటే, అందుకు కావలసిన అధికారాన్ని మళ్లీ కట్టబెట్టే బాధ్యత ప్రతి తెలంగాణ వాదిపై, ప్రతి తెలంగాణ పౌరునిపై ఉంది. చేసింది చాలా ఉంది, చేయాల్సిందింకా ఉంది.
బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎన్నికల మ్యానిఫెస్టో పీపుల్స్ మ్యానిఫెస్టోగా ప్రశంసలందుకుంటున్నది. తెలంగాణ భౌతిక వికాసం, మానవీయ విలువలు, అంతస్సూత్రంగా కలిగిన అభివృద్ధి మ్యానిఫెస్టో ఇది. వలసవాదుల అవశేషాలను, కుట్రలను కూల్చాల్సిన సమయం ఆసన్నమైది. అందుకే అన్నివర్గాల ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని మీ అమూల్యమైన తీర్పును ఇవ్వండి. తెలంగాణకు రక్షణ కవచంగా నిల బడండి.
-నారదాసు లక్ష్మణ్‌రావు