కర్ణాటక ఓటరు ఎల్లప్పుడూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను, లోక్‌సభ ఎన్నికలను విభిన్నమైన దృక్పథంతో చూస్తున్నాడు. 1984-85లో రామకృష్ణ హెగ్డే నేతృత్వంలోని అధికార జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా, కొన్ని నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. గత నాలుగు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా వెలువడ్డాయి.
2008లో మెజారిటీకి మూడు సీట్లు తక్కువ కావడంతో ఇండిపెండెంట్ల మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటుచేసింది. మరుసటి ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను 19 గెలుచుకున్నది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చీలిపోయిన కర్ణాటక జనతా పక్ష (కేజేపీ)కి యడ్యూరప్ప నేతృత్వం వహించడంతో బీజేపీలో చీలిక వచ్చింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు యడ్యూరప్ప తిరిగి బీజేపీలో చేరారు. ఆ మరుసటి ఏడాదే 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 17 సీట్లు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడంతో జేడీఎస్, కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి భాగస్వాములుగా పోటీ చేసి చెరో సీటుతో సరిపెట్టుకున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకొని తన అత్యుత్తమ పనితీరును కనబరిచింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2024 లోక్‌సభ బరిలో ఓటర్ల మద్దతును పొందడానికి ఇద్దరు ప్రధాన పోటీదారులు తలపడనున్నారు.
జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్‌తో ఎన్నికల పోటీని ప్రత్యక్ష పోరుగా మార్చాలని బీజేపీ వ్యూహాత్మకంగా నిర్ణయించింది. ఈ పొత్తును రెండు కోణాల్లో చూడాల్సిన అవసరం ఉన్నది. మొట్టమొదటగా ఇది కాంగ్రెస్‌తో ముఖాముఖి పోరుగా మారి రాష్ట్రంలోని అధికార పార్టీకి సవాలు విసురుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయంగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తుండటంతో కర్ణాటకలో వ్యూహాన్ని ఆ కోణంలోనే చూడాల్సిన అవసరం ఉన్నది. రెండోది, జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా, తన మిత్రపక్షానికి చెందిన కీలకమైన వొక్కలిగ ఓట్లను దక్కించుకోవడం ద్వారా పాత మైసూరు ప్రాంతంలో మరింత లోతుగా చొరబడాలని బీజేపీ భావిస్తున్నది. ప్రాంతీయ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడల్లా మిత్రపక్షం నుంచి బీజేపీలోకి ఓటు మార్పిడి సాగుతుందని గతంలో తేలింది.
బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు కర్ణాటక పోటీ కీలకం. ‘విజన్ 370’ను చేరుకోవాలంటే కర్ణాటకను నిలుపుకోవడం బీజేపీకి కీలకం. కర్ణాటకలో గట్టిపోటీ ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ భవిష్యత్తుకు కీలకం. ఈ ఎన్నికలను మనుగడ పోరాటంగా జేడీఎస్ భావిస్తున్నది. దీంతో ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపనున్నాయి. మోదీ ఫ్యాక్టర్, రాష్ట్ర ప్రభుత్వంపై దాడి, పాన్ ఇండియా ఎజెండా, రామమందిరం ఫ్యాక్టర్ అనే నాలుగు అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తున్నది.
స్పష్టంగా స్థానిక సమస్యలపైనే ఎన్నికలను ఎదుర్కోవాలని కాంగ్రెస్ సిద్ధపడుతున్నది. రాష్ట్రంపై వివక్షను ఎత్తిచూపుతూ కేంద్రంపై ముఖ్యమంత్రి చేస్తున్న పోరాటమే ఈ ప్రచారంలో ప్రధానాంశంగా కనిపిస్తున్నది. ఐదు హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వారు ప్రాధాన్యం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కేంద్రంపై దాడి కన్నా ఐదు హామీల అంశమే ఎక్కువ ప్రభావం చూపేదిగా కనిపిస్తుంది.
ఎట్టకేలకు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో అభ్యర్థుల ఎంపికలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే బీజేపీ తన అభ్యర్థులను మారుస్తుందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ కూడా 2024 ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై జోరుగా చర్చ సాగుతున్నది. జేడీఎస్‌కు తాము పోటీ చేసే సీట్లపై ఆధారపడి ఉంటుంది. పార్టీలకతీతంగా ఒక ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తున్నది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం కంటే రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని అన్ని పార్టీల నాయకులు కోరుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకాడుతున్నారు. 28 లోక్‌సభ స్థానాలకు పోటీ ఊపందుకోవడంతో వచ్చే రెండు నెలల్లో రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు రసవత్తరంగా మారనున్నాయి.
– స్వామి ఆర్వీవీయస్